V
:

ప్రవక్తలూ, ప్రతిపక్షాలు:

Author Name: Virinchi Virivinti
SOCIOLOGY/POLITICS

బుద్ధుడు, సోక్రటీసు, ఏసు, మహమ్మద్, వేమన, బసవన్న, కబీర్‌లను ప్రవక్తలు అంటుంటాం. బుద్ధుడు మొదటి ప్రవక్త. 

ప్రవక్తలందరికీ చారిత్రకంగా కొన్ని కామన్ లక్షణాలుంటాయి. వారిని ఆ కోణం నుండి చూసినప్పుడు వాళ్ళని ప్రవక్తలు అనే పదం నుండి తొలగించి "ప్రవక్తాత్మక సామాజిక విమర్శకులు" అంటే మరింత బాగుంటుంది. అదే సరైనది కూడా. ఐతే, వారి మతపరమైన స్థానాలు, చారిత్రక పాత్రలు వేరు వేరు. కానీ అధికారాన్ని, ఆచారాన్ని, సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించే ఒక సామాన్య ధోరణి మాత్రం వీరందరిలో కనిపిస్తుంది.


బుద్ధుడి ప్రత్యేకత కేవలం రాజును విమర్శించడంలో లేదు; అప్పటి సమాజం సహజమని భావించిన విలువలను ప్రశ్నించడంలో కూడా ఉంది. వేమన కేవలం పాలకుడిని విమర్శించలేదు; ప్రజలు కూరుకుపోయిన కులం, ఆచారం, మతం, మతాధికారాన్ని కూడా ప్రశ్నించాడు. బసవన్న ఆనాటి సామాజిక సంబంధాలనే ప్రశ్నించి పునర్నిర్మించడానికి ప్రయత్నించాడు. కబీర్ మతపరమైన అధికారాన్ని రెండు వైపులా ప్రశ్నించాడు. సోక్రటీసు అయితే ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలే తమకు తెలిసినదని అనుకుంటున్న విషయాలను వాళ్లతోనే ప్రశ్నింపజేసి, వారిని గేలి చేసి, వారిని ఆలోచింపజేశాడు. అందుకే ఈ ప్రవక్తలందరినీ ఆనాటి  రాజ్యాధికారం తనకు ప్రమాదకరమనే భావించింది. వారిని హింసించడానికీ, అణచి వేయడానికీ ప్రయత్నించింది. 


ఆనాటి ప్రవక్తల స్థానాన్ని ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు నిజంగా తీసుకుంటున్నాయా? ప్రతిపక్షం అంటే ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడానికి పోటీ చేసే రాజకీయ పార్టీనే? లేక సమాజాన్ని కూడా ప్రశ్నించే, ప్రజలను రాజకీయంగా విద్యావంతులను చేసే శక్తినా? 


ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రశ్నించడానికి రెండు స్థాయిలు ఉన్నాయి. మొదటిది — institutional opposition:

ఎన్నికల్లో పోటీ చేయడం, పార్లమెంటులో ప్రశ్నించడం, ప్రభుత్వ విధానాలను విమర్శించడం.

రెండోది — social opposition:

ప్రజల మధ్యకు వెళ్లి, వారి స్వంత సమాజంలో ఉన్న అన్యాయాలను కూడా ప్రశ్నించడం; కులం, మతం, లింగం, మూఢనమ్మకాలు, స్థానిక అధికార సంబంధాలు, వివక్ష, అవినీతి వంటి వాటిపై ప్రజలతోనే సంభాషించడం; అంటే ప్రజలను కేవలం ఓటర్లుగా కాకుండా బాధ్యతగల పౌరులుగా తయారు చేయడం.


ఈ మాటలు ఎందుకు రాస్తున్నానంటే- ప్రియాంకా గాంధీ ఒకసారి పార్లమెంటులో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ఉంటే , అధికారపక్షంలోని ఎం.పీ. కలగజేసుకుంటూ అందుకే మేము అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు అని ఆ స్థానాన్ని తక్కువ చేసి మాట్లాడారు. అందుకు ప్రియాంకా గాంధీ ఇచ్చిన సమాధానం ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. 


ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడమంటే కేవలం అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే కాదు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో కూర్చోవడం కూడా. అధికారంలో ఉండటం గెలుపు కాదు, ప్రతిపక్షంలో కూర్చోవడం ఓటమీ కాదు. అధికారంలో ఉండే వారికి ఎంత విలువ ఉందో, ప్రతిపక్షంలో ఉండే వారికి అంతే విలువ ఉంది, అంతకంటే ఎక్కువ ప్రజావాణిని వినిపించేందుకు బాధ్యత ఉంది. కాబట్టి అధికారపార్టీ ఎంపీలు తలపోస్తున్నట్టు ప్రతిపక్షంలో కూర్చోవడం నామోషీ కాదు. అది గౌరవప్రదమైన స్థానం, అధికారాన్నే ప్రశ్నించే శక్తిగల స్థానం. ప్రియాంకా గాంధీని ఆ సదరు ఎం.పీ. గేలి చేస్తుంటే  "అవును మేము ఇక్కడే కూర్చుంటాం. మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడతాం, కూర్చోబెట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మిమ్మల్ని ప్రశ్నించడానికి మేము ఇక్కడే ( ప్రతిపక్షంలోనే) కూర్చుంటాం". అని ఎంఫాటిక్ సమాధానం ఇచ్చింది. ఆమెలో ప్రజాస్వామ్య విధానం పట్ల ఎంత స్పష్టత ఉన్నదో, ఎంత నమ్మకం ఉన్నదో, ఎంత బాధ్యత ఉన్నదో ఈ సంఘటన తెలుపుతుంది. ప్రజాస్వామ్యం అంటే  గెలుపోటములే కాదు అనే ఒక కొత్త నిర్వచనం ఆమె ఇచ్చింది మన భారతదేశ పార్లమెంటు సాక్షిగా. 


ఐతే మన ప్రతి పక్షాలు అది ఏ పార్టీకి చెందినవైనా ఒకప్పటి మన ప్రవక్తల రూపాన్ని సంతరించుకోవాలి. ఇది బుద్ధుడి నుండి కొనసాగిన ఒక సాంప్రదాయం కూడా. రాజ్యాధికారాన్ని త్యజించి స్వయంగా ప్రతిపక్షంలోకి వచ్చినవాడు బుద్ధుడు. కాబట్టి పార్లమెంటులో అధికారాన్ని ప్రశ్నించడమే కాకుండా, సమాజాన్ని జాగృత పరిచి, ప్రజలలో 'ప్రజాస్వామ్య రాజకీయ విద్య' పెంపొందేలా కూడా ప్రతిపక్షాలు కృషిచేయాలేమో అనిపిస్తుంది. ప్రతిపక్ష రాజకీయానికి రెండు కర్తవ్యాలు ఉన్నాయి: అధికారాన్ని జవాబుదారీ చేయడం, సమాజాన్ని నైతికంగా జవాబుదారీ చేయడం. మొదటిది పార్లమెంటులో జరుగుతుంది; రెండోది ప్రజల మధ్య జరుగుతుంది. మొదటిది ప్రభుత్వాన్ని మార్చగలదు; రెండోది ప్రజాస్వామ్య సంస్కృతిని మార్చగలదు. ప్రజలలో ఉన్న అన్యాయాలను ప్రశ్నించకుండా, వారిలో పాతుకుపోయిన పాత విలువలను కుదిపేయకుండా, ప్రజల పేరుతో ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నించడం సులభమైన ప్రతిపక్ష రాజకీయ విధానం. దీనిని విడనాడి మరింత బాధ్యతాయుతంగా బుద్ధునిలాగా మరింత పరిణతితో సాగాలేమో!


విరించి విరివింటి

All Replies

New to Communities?

Join the community