"Tryst With Destiny"

"విధితో చేసుకున్న ఒప్పందం"

14th August, 1947

Jawaharlal Nehru’s Historic Independence Speech


చాలా సంవత్సరాల క్రితం మనం విధితో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా కాకపోయినా గణనీయమైన స్థాయిలో నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది. ప్రపంచమంతా గాఢనిద్రలో మునిగిపోయిన అర్ధరాత్రి వేళ, భారతదేశం నూతన జీవంతో, స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో మేల్కొంటుంది.


ఇది చరిత్రలో అత్యంత అరుదుగా వచ్చే క్షణం. పాత శకం ముగిసి కొత్త శకంలోకి అడుగు పెడుతూ, దీర్ఘకాలంగా అణచబడివున్న ఈ దేశం తన వాణిని వినిపించే  అపూర్వమైన క్షణమిది. భారతదేశానికీ, దేశ ప్రజలకూ సేవ చేయడానికీ, మానవత్వమనే విస్తృత లక్ష్యానికి అంకితమవుతామని ప్రతిజ్ఞ చేయడానికీ, సముచితమైన సమయమిది.


చరిత్ర ఆరంభం నుంచే భారతదేశం తన అంతులేని అన్వేషణా యాత్రను ప్రారంభించింది. గడిచిన ఎన్నో శతాబ్దాలు మన దేశం చేసిన నిరంతర కృషికి, సాధించిన విజయాలకు, ఎదుర్కొన్న ఓటములకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఈరోజు మనం ఒక దురదృష్టకర యుగానికి తెరదించుతున్నాం. భారతదేశం మళ్లీ తనను తాను ఆవిష్కరించుకుంటుంది. ఈ విజయం ఒక ముగింపు కాదు, ఒక ముందడుగు. మనం అందుకోబోయే ఉన్నత విజయాల దిశగా తెరచిన ద్వారం. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి, భవిష్యత్తు విసిరే సవాళ్లను స్వీకరించడానికి మనం తగినంత ధైర్యం, వివేకం కలిగి ఉన్నామా?


స్వేచ్ఛ,అధికారాలు బాధ్యతలను కూడా తీసుకువస్తాయి. ఆ బాధ్యత భారత ప్రజల సార్వభౌమ ప్రతినిధులైన మనందరి భుజాలపైనే ఉంది. స్వాతంత్ర్యం పుట్టుకకు ముందు మనం ప్రసవ వేదనలన్నింటినీ భరించాము. ఆ దుఃఖపు జ్ఞాపకాలతో మన హృదయాలు ఇప్పటికీ భారంగా ఉన్నాయి, ఆ వేదనల ప్రతిధ్వనులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ గతం గతమే, ఇప్పుడు భవిష్యత్తు మనలను ఆహ్వానిస్తోంది.


ఆ భవిష్యత్తు సుఖపడటానికో లేదా విశ్రాంతి తీసుకోవడానికో కాదు; మనం చేసిన ప్రతిజ్ఞలను నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమించాల్సిన సమయం. భారతదేశానికి సేవ చేయడం అంటే... బాధల్లో ఉన్న కోట్లాది మంది ప్రజలకు సేవ చేయడం. పేదరికం, అజ్ఞానం, వ్యాధులు, అవకాశాల్లో అసమానతలను కూడా అంతం చేయడం. ప్రతి ఒక్కరి కన్నీటిని తుడువాలనేదే మన నాయకుల లక్ష్యం. అది మన శక్తికి మించినది కావచ్చు, కానీ కన్నీళ్లు, కష్టాలు ఉన్నంత కాలం... మన పని పూర్తికానట్టే.


కాబట్టి, మన కలలను సాకారం చేసుకోవడానికి అవిరళంగా కృషి చేయాలి. ఆ కలలు మనవి మాత్రమే కావు, అవి మానవజాతి మొత్తానివి. నేడు ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ దేశమూ ఒంటరిగా మనుగడ సాగించగలదని ఊహించలేం. మన పూర్వీకులు చెప్పిన ‘వసుధైవ కుటుంబం’ అనే భావనకు నేటి ప్రపంచం మరింత దగ్గరవుతోంది. ప్రపంచంలోని మనుషులందరూ ఒకే కుటుంబానికి చెందినవారే. అందుకే నేడు దేనినీ విడిగా చూడలేం. అది శాంతి అయినా, స్వేచ్ఛ అయినా, సంపద అయినా, చివరికి విపత్తు అయినా సరే. ఈ నవ ప్రపంచంలో దేశాల మధ్య బంధం అంత విడదీయరానిదిగా మారింది.


భారత ప్రజలకు ప్రతినిధులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ మహత్తర యాత్రలో విశ్వాసంతో, ధైర్యంతో మాతో కలవండి. ఇది కుత్సిత విమర్శలకు లేదా పరస్పర నిందలకు, ద్వేషానికి సమయం కాదు. ప్రతి పౌరుడు గౌరవంగా, సమానంగా జీవించగల స్వేచ్ఛా భారతాన్ని నిర్మించడం మన కర్తవ్యం.


ఇది విధి నిర్ణయించిన రోజు. విధి నిర్ణయించిన క్షణం.

దీర్ఘ నిద్ర, సుదీర్ఘ పోరాటం తరువాత జీవంతో, ఉత్సాహంతో, స్వేచ్ఛతో, స్వతంత్ర భారతం మళ్లీ మేల్కొంటోంది!


గత కాలపు సంకెళ్లు ఇంకా కొంతవరకు ఉన్నాయి. మన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి చేయాల్సింది ఎంతో ఉంది. అయినప్పటికీ, మన చరిత్ర కొత్తపుటను తిప్పుతోంది. ఆ చరిత్రను మనమే జీవిస్తాం, కార్యాచరణలో పెడతాం, భవిష్యత్తు తరాలు దాన్ని లిఖిస్తాయి.


ఇది మనకే కాదు, ఆసియాకి, ప్రపంచానికే ఒక మహత్తరమైన క్షణం. తూర్పున ఒక కొత్త నక్షత్రం ఉదయిస్తోంది; స్వేచ్ఛా నక్షత్రం. ఒక కొత్త ఆశ పుడుతోంది. చిరకాలంగా కన్న కల నేటికి నిజమైన దృశ్యమిది. ఆ నక్షత్రం ఎప్పటికీ అస్తమించకూడదు! ఆ ఆశ ఎప్పటికీ మోసపోకూడదు!!


మన చుట్టూ మబ్బులు కమ్ముకున్నా, ప్రజల్లో చాలామంది దుఃఖంలో ఉన్నా, మన ముందున్న సమస్యలు కఠినమైనవైనా ఈ స్వాతంత్ర్యం మనకు ఆనందాన్ని ఇచ్చేదే. అయితే స్వాతంత్ర్యం బాధ్యతలు, భారాలను కూడా తెస్తుంది! వాటిని మనం స్వేచ్ఛాయుతమైన, క్రమశిక్షణగల పౌరులుగా నిజమైన స్ఫూర్తితో ఎదుర్కోవాలి.


ఈ చారిత్రాత్మక సందర్భంలో, మన స్వాతంత్ర్య శిల్పి, జాతిపితను ముందుగా స్మరించుకుందాం. ఆయన భారతదేశపు మూల తత్వానికి ప్రతీకగా నిలిచి, స్వేచ్ఛా దివిటీని ఎత్తిపట్టి మనల్ని ఆవరించిన చీకట్లను పారదోలారు. చాలాసార్లు మనం ఆయనకు తగిన అనుచరులుగా నడుచుకోలేదు; ఆయన సందేశం నుండి దారితప్పిన సందర్భాలూ ఉన్నాయి. కానీ మనమే కాదు, రాబోయే తరాలన్నీ ఆయన సందేశాన్ని గుండెల్లో భద్రపరుచుకుంటాయి.దేశం పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం, ఆత్మబలం, ధైర్యం, వినయం మన హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్రలా నిలిచిపోతాయి. ఎంతటి ఎదురుగాలి వీచినా, తుఫానులు ముంచెత్తినా...ఆ స్వేచ్ఛా దివిటీని మనం ఎన్నటికీ ఆరిపోనివ్వకూడదు.


ప్రశంసకోసం ఎదురుచూడకుండా, ప్రతిఫలంకోసం ఆశించకుండా భారత స్వాతంత్ర్యానికి ప్రాణాలను అంకితం చేసిన అజ్ఞాత సేవకులు, వీర సైనికుల గురించి కూడా మనం స్మరించుకోవాలి.


అలాగే రాజకీయ సరిహద్దుల వలన మననుండి వేరుపడిన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలను కూడా మరిచిపోకూడదు. ఈ క్షణంలో వారు ఈ స్వాతంత్ర్యాన్ని పంచుకోలేకపోయినా వారు మనవారే, ఎప్పటికీ మనవారే. వారి సుఖదుఃఖాలలో మనమూ సమాన భాగస్వాములమే.


భవిష్యత్తు మనలను పిలుస్తోంది. మన ప్రయత్నం ఏమై ఉండాలి?


భారతదేశంలోని సామాన్య ప్రజలకు, రైతాంగానికి, కార్మికులకు స్వేచ్ఛను, సమాన అవకాశాలను అందించడమే మన ఆశయం. "పేదరికం, అజ్ఞానం, వ్యాధులు: వీటిని అంతం చేయాలి! సంపన్నమైన, ప్రజాస్వామ్యయుతమైన, ప్రగతిశీల దేశాన్ని నిర్మించాలి! ప్రతి పురుషుడికి, స్త్రీకి న్యాయాన్ని,సమానత్వాన్ని, పరిపూర్ణమైన జీవితాన్ని అందించే సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను మనం సృష్టించాలి."

ఇదే మన ప్రయాణం! ఇదే మన ప్రమాణం!!


మన ముందున్న దారి కఠినమైనదే. మనం చేసిన ప్రతిజ్ఞను పూర్తిగా నెరవేర్చే వరకు, దేశ ప్రజలందరికీ మంచి భవిష్యత్తును అందించే వరకు మనలో ఎవరికీ విశ్రాంతి లేదు. గొప్ప పురోగతికి సిద్ధంగా ఉన్న ఒక మహోన్నత దేశానికి మనం పౌరులం, ఆ ఉన్నత ప్రమాణాలకు తగ్గట్టుగా మనం జీవించాలి. మనం ఏ మతానికి చెందినవారమైనప్పటికీ, సమాన హక్కులు, అవకాశాలు, బాధ్యతలు కలిగిన భారతదేశ పౌరులం. మనం మతతత్వాన్ని లేదా సంకుచితత్వాన్ని ఎంతమాత్రం ప్రోత్సహించకూడదు; ఎందుకంటే ఆలోచనల్లో, పనుల్లో సంకుచితంగా ఉండే ఏ దేశమూ ఎప్పటికీ గొప్పది కాలేదు.


ప్రపంచ దేశాలకు, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ శాంతి, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య అభివృద్ధిలో వారితో కలిసి నడుస్తామని మనం ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రాచీన, నిత్యనూతన, మన ప్రియతమ మాతృభూమి అయిన భారతదేశానికి గౌరవపూర్వక నివాళులు అర్పిస్తూ... ఆమె సేవకు మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నాం.


స్వేచ్ఛానువాదం : దేవి పోలిన

Highlight any text to reply to that part.

All Replies

No replies yet. Be the first to reply.

Latest Comments

I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026
I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026

New to Communities?

Join the community