రాహుల్ గాంధీ ఫోటోలలో దాదాపు అందరికీ నచ్చే ఫోటోలు ఆయన భారత్ జోడో యాత్ర అప్పటివే ఉంటాయి. ముఖ్యంగా గడ్డం పెంచి, నుదుటి మీద ఆలోచనాత్మకంగా కనిపించే frown lines or 11 lines( వీటికి తెలుగులో పదం లేనట్టుంది)తో గంభీరతతో, యాంగ్రీ లుక్ తో కనిపించే ఫోటోలు చాలా ఆకర్షణీయంగా మనకి కనిపిస్తుంటాయి. దీనికి కారణం మనలోని కలెక్టివ్ అన్కాన్షియస్ లో Wise Old Man ఒకడుంటాడు. మరీ యువకుడిలా కనబడే లీడర్లను మన సామూహిక అచేతన సాధారణంగా వెంటనే అంగీకరించదని నా అవగాహన. మన పురాణాల్లో కూడా ఈ జ్ఞానానికి ప్రతిరూపాలైన సాలోచనాత్మక వృద్ధుడికి తగిన స్థానం ఉంటుంది. రాహుల్ గాంధీ ముసలి వాడైపోయాడనీ కాదు, అలా కనబడాలనీ కాదు. కానీ తెల్లగడ్డం, ఆ నుదుటి గీతలు, అవి ఇచ్చే గంభీరత అతడిని అచేతనలో అంగీకరించడానికి తగిన వాతావరణాన్ని కలిగిస్తాయని నా అంచనా.
అందుకే రాహుల్ గాంధీ కాస్త గడ్డం పెంచి, విప్లవ వీరుడి లుక్ తో సీరియస్ గా కనిపిస్తే బాగుంటుంది. ఐతే రాహుల్ గాంధీలో మరో ముఖ్యమైన కోణం ఏంటంటే అతడు మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు. గంభీరతలో చిరునవ్వు ఇతడు మనవాడే అన్నంత దగ్గరతను కూడా అందిస్తుంది. ఇది చాలా మందిలో అతడి పట్ల ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగిస్తుంది. మన దేశీయులు ఆలోచనాత్మక వ్యక్తికి అలాగే మందస్మిత వదనానికీ పడిపోయినంతగా అమాయక, ఏడుపు గొట్టు ముఖాలకు పడిపోరు. అవి మన అంతఃచేతనకి విరుద్ధమైనవి.
ఐతే స్త్రీ కన్నీటిని మాతృ మూర్తి కన్నీటిని కూడా స్థూలంగా ఈ దేశాంతరంగం క్షమించదు అని నాకనిపిస్తుంది.
అలాగే రాహుల్ గాంధీ ప్రస్తుతం ఉద్యమిస్తున్న 'ప్రజాస్వామ్యం మునిగిపోబోతున్నది' అన్న మాట కూడా అచేతనలో కలెక్టివ్ జ్ఞాపకాలను రగిలిస్తుంది. ప్రజాస్వామ్యం ఆధునిక భావన ఐనా ఏదైనా ఒకటి అంతమైపోతున్నది అన్న భావన ప్రతిస్పందనలను కలిగిస్తుంది. దానికి తోడుగా అతడు "నూతన భారత సృష్టి", "పునః సృష్టి", "నవ సృష్టి" ఎలా ఉండబోతోందో కూడా స్పష్టంగా ఈ దేశ ప్రజలకు చెప్పగలగాలి. ఎందుకంటే "ప్రళయం - సృష్టి" మన సామూహిక అచేతనలో చాలా బలమైన ఆర్కాటైపులు.
ఐతే ఇక్కడ చెప్పవలసిన ముఖ్యమైన జాగ్రత్త ఒకటుంది. పప్పు అనే పేరుతో మొదలైన రాహుల్ గాంధీ రాజకీయ ప్రయాణం, ప్రజల అంచనాలను దాటుతూ, ప్రత్యర్థుల అసమర్థతలను తిప్పికొడుతూ, మీడియా & సోషల్ నిర్మించే పర్సోనాలను అధిగమిస్తూ, ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పరిణమిస్తున్న క్రమంలో ఇలాంటి అచేతానా అంశాలు కూడా పనిచేస్తాయి. అంతేతప్ప ఈ అచేతనా అంశాలే అల్టిమేట్ గా అతడికి విజయాన్ని కలిగిస్తాయని కాదు. కాబట్టి దీనిపై కూడా రాహుల్ గాంధీ దృష్టి సారిస్తే బాగుంటుంది.
విరించి విరివింటి
Highlight any text to reply to that part.