Fractured Quietus / Virinchi Virivinti
-----------------------------------------------------------
ఇక మనమెపుడూ మాట్లాడుకోం..
గుండెల్ని ఓదార్చే పూలు
వడలిపోయాక
పక్క పక్కనే కూర్చున్నా
మనమేమీ మాట్లాడుకోలేం!
మనం మాట్లాడుకునేందుకు కాదు
ఇక మాట్లాడుకోకుండా ఉండటానికే
ఎక్కువ సన్నద్ధం ఔతుండాలి.
ఎవరికీ అనుమానం రానీయను
అద్దానికి పగులెందుకు వచ్చిందని
ఇంకెవరినీ అడగనీయను!
క్లాక్ టవర్ మీద గడియారానికి
ఇప్పుడే విలువా లేదు
మోచేతి గడియారంలో
కాలం కనబడకపోతేనేం...
గంటల ముల్లు మంచిని
సెకన్ల ముల్లు చెడునీ మోస్తుంటాయి
మనమెందుకు గంటల ముల్లుని
ఆపేస్తుంటామో మనకే తెలియదు
ప్రేమించే చేతులు
గాయాలను కూడా చేస్తుంటాయి
దానికదే ప్రేమించే గుండె
దానికదే పగిలిపోతుంది...
అరే..ఎవరైనా ఇంకొకరి కోసం
ఎందుకు కలగంటారు?
మృదువు మాటలు
ఎంతగా మభ్యపెడతాయి..
పరుష వాక్యాలు, బెదిరించే కోపాలు
ఎంత స్వచ్ఛంగా మెరుస్తుంటాయి!
తనలో తాను మాట్లాడుకునే
గుండె భాషనీ
నిలకడైన నిశ్శబ్దాన్నీ
అలాగే కొనసాగిద్దాం..
వదిలి వెళ్ళిపోయినవాళ్ళు
మనసులోకే వెళ్ళి ఉండిపోతుంటారేమో!
కలల్లో కలిసే ఉన్నట్టు
నిద్ర పుచ్చుతుంటారేమో!
నన్ను మరి కొంత సేపు
నిద్ర పోనివ్వు!
16/10/2025
Highlight any text to reply to that part.