చెప్పమ్మా …
అమ్మా యుద్ధం అంటే ఏమిటి
పూర్వం కత్తులు, కటార్లతో రాజులు యుద్ధం చేసే వారంటగా
మా బడిలో పాఠాలు కూడా ఎన్నో చెప్పారు
యుద్దానికో నీతి ఉందని
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పోరాడి
గెలుపు ఓటములు తేల్చుకునే వారని చెప్పినట్టు జ్ఞాపకం
మరి ఇది ఏ రకమైన యుద్ధం
పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోవడమా
బాంబుల వర్షం దీపావళి టపాకాయల్లా పేలడమా
గాయాలతో పడి ఉన్న దేహాలను
వెతికి వెతికి ఈడ్చుకు రావడమా
ప్రాణాలు పోయి పడి ఉన్న వారిని
కుప్పలు కుప్పలుగా ఒక చోటికి చుట్ట చుట్టి చేర్చడమా
అమ్మేది నాన్న ఎక్కడ నా భార్య ఎక్కడుంది అంటూ
ఏడ్చే ఏడ్పుల శోక సంగీతమా
అమ్మలను అక్కలను ఈడ్చుకెళ్ళడమా
టీవీలో ప్రసారమయ్యే వార్తల ప్రవాహమా
విడతలు విడతలుగా విహరించే సమూహాల సంరంభమా
ఛిద్రమైన దేహాల మాంసపు ముక్కల ముద్రలతో
చిప్పిల్లిన రక్తపు తైలవర్ణ చిత్రమా
యుద్ధం చేయరాదని శాంతిని పాటించాలని
సమన్వయంతో ఉండాలని చెప్పే మాటలు పాఠాలకే పరిమితమా
ఎగురవేసే శాంతికపోతాలు గాలికే సొంతమా
కులం మతం ప్రాంతం స్వార్థం సంపాదన
విద్వేషం ఈర్ష్య అసూయ అహంకారం
కారణం ఏదైతేనేం తన్నుకోవడానికి
మీ గొడవలకి అభం శుభం తెలియని వారెందుకు బలి కావాలి
నిద్రలో ఉన్న కుటుంబాలు చిన్నాభిన్నం ఎందుకవ్వాలి
రాత్రికి రాత్రి నిలువ నీడ లేకుండా ఎందుకు చేయాలి?
ఏం ద్రోహం చేసారని ? ఏం పాపం చేసారని ?
జీవించే హక్కును దోచేయడమే యుద్దమా
అమ్మా యుద్ధం అంటే ఏమిటమ్మా …సమాధానం చెప్పవూ !
- డా . సమ్మెట విజయ
( పాలస్తీనా యుద్ధ వ్యతిరేక కవితలు -డా గీతాంజలి ప్రచురించిన పుస్తకంలో నేను రచించిన కవిత )