ఆ ఏడు కూడా ఎండకాలం
మామిడి పళ్లనూ మధ్యాన్నం నిద్రనూ
చింత చిగురునూ చెమట కాయలనూ
కరెంటు కోతనూ కాళ్ల బొబ్బలనూ
ఎన్కెన్కనే తీసుకొచ్చింది
కాచిన నూనేసుకొని
అన్నం తింటుంటే
కాల్చి తడిపే రేకుల రూము
మామిడి కాయ పప్పుతో
పోటీ పడలేక పోయింది
మమ్మల్ని చూసీ చూసీ
మసీదు బాయి తాబేలు
విసుగొచ్చి నీళ్లలో మునిగిపోయింది
తలుపెనక ఈతచాప
అలిసిపోయి వాకిట్లో నడుం వాల్చింది
సెలవులకు వస్తున్నాడని
ఇన్లాండ్ లెటర్ చూసిన
తెల్ల ఐస్క్రీము కొనిస్తాడేమోనని
రస్నా రంగు మర్చిపోయిన
చేతిలోకి చారానా చాక్లెటొవ్చింది
గోళీలాట గోనగిల్ల
కాశీ పుల్ల తొక్కుడు బిళ్ళ
అంటాట కుంటాట
పావులాట నాలుగు డబ్బాలట
ముక్కు గిల్లే ఆట కళ్ల గంతలాట
వరుసగా రోడ్డెక్కి వీధిన పడ్డాయి
ఇవేం పాత ఆటలు
పట్నమాట నేర్పిస్తానన్నాడు
గొంగళి గుచ్చుకుంటుంటే
దూది పరుపు బావుంటుందన్నాడు
రూల్స్ లేని ఆటలల్లో
రోజూ నన్నోడించాడు
మళ్లీ ఎండకాలం కోసం
ఎదురు చూడాల్నో వద్దో
అర్థం కాక భయపడిన
ఎవరికి చెప్పాల్నో తెలియక
ఇప్పటికీ ఏడుస్తున్నా
మాలతి పల్లా
21-Mar-2025