Turn the volume up / Virinchi Virivinti
---------------------------------------------------------
నా జీవితమంటూ
నేనేమైనా జీవిస్తున్నానంటే
ఇదిగో
ఈ రెండు కవిత్వ వాక్యాలు రాసేప్పుడే..
మిగిలిన నా జీవితమంతా
నీవు కలగన్న కలనే!
నీ సెవెన్ స్టార్ హోటల్ లాంటి
కార్పోరేట్ ఆఫీసు ముందర
మూతి వంకరగా పెట్టి
సెల్ఫీ తీసుకున్నాగానీ
నాకంటే నీ దోపిడీ దివ్వెలే
వెలుగుతున్నాయి.
నా పదాలను
నీ నోటిఫికేషన్ల కింద
ఎన్నిసార్లు చంపేశావో!!
నా గొంతుని
నీ అడ్వర్టైజ్మెంట్లు ఎంతగా చిదిమేశాయో!
స్కిన్ కేర్ యాడ్స్ స్కిప్ కొట్టలేక
యూట్యూబ్ లో
ఒక పాట పూర్తిగా వినక
ఎన్ని రోజులైందో!
టేప్ రికార్డర్- క్యాసెట్
నీవు మాయం చేసిన రోజే
నేనూహించాల్సింది.
నేను గొంతెత్తిన ప్రతిసారీ
ఒక కొత్త ఆఫరంటావు
కొత్త లోనిస్తానంటావు
నా స్వరానికంటే ముందే
డియర్ కస్టమర్ శబ్ధం
చొరబడుతుంది.
నీవు నా ఉదయాన్ని
ఈఎమ్ఐ అలారాలతో లేపావు
నా మధ్యాహ్నాన్ని
ఇన్సటాల్మెంట్ కలలతో నింపావు
నా నిస్సత్తువ సాయంత్రాలను
స్క్రోలింగులతో, రీళ్ళతో ఎక్కడికో నెట్టేశావు
నా రాత్రులేవీ నావి కాకుండా చేశావు
నీ సర్వర్లు నా డార్క్ సర్కిల్స్
మేడ్ ఫర్ ఇచ్ అదర్!
నా ధ్యాసలూ నా నిశ్శబ్దాలు
అన్నీ చెరిపేశావు.
నా ఆందోళనలను
వైఫై పూర్ సిగ్నల్స్ లో
నా ఎదురు చూపులను
అప్ లోడింగ్ చక్రంలో వేసి తిప్పుతూనే ఉన్నావు.
నా మెదడు గనిలో
నీవు వెలికి తీసిన బంగారమెంతో
నేనెప్పుడూ అడగలేదు
నా బీదరికం
నీ కొత్త టెక్నాలజీకెంత పనికొచ్చిందో
నేనడగలేదు
కానీ
నా చెవులకూ మెదడుకీ కళ్ళకీ
నా వాళ్ళకీ
నీ కార్పోరేటీకరణనుంచి
డికోలనైజేషన్ కావాలి
నీ noise cancelling గోడల్ని చీల్చే
నా స్వరం నీవు వినాలి
Turn the volume up
నేనెందుకు నీకు ఉత్తి డాటాలా కనిపిస్తానో
నీ ఫ్రీ మార్కెట్ లో ఏదీ ఫ్రీగా ఎందుకు దొరకదో
వీధి మొదట వెలుగుల ఆసుపత్రిలో
మనిషిగా కంటే కస్టమర్ గా
నేనెందుకు నీకు పరిచయమౌతానో
నా పిల్లలు నీ స్కూల్ లో చదివి
నీ కంపెనీలోనే కంప్యూటర్లెందుకు నొక్కుతారో
నా అప్పుల ఊబిలో
నీకు వజ్రాలెందుకు దొరుకుతున్నాయో..
నాకిప్పుడు సమాధానం కావాలి..
నీ కృత్రిమ మేథ
నీలో మనిషిని చంపేయక ముందే
నేను నీతో మాట్లాడాలి.
Turn the volume up
8/11/25
Highlight any text to reply to that part.