రాసిన కథలే మళ్ళీ రాద్దామా?. Darwin, Modernity and Telugu Literature

తెలుగు సాహిత్య వాతావరణంలో సైన్స్ కి ఏమైనా స్థానం ఉంటుందా ఉండదా అనే ప్రశ్న అప్పుడప్పుడూ తిరిగి తిరిగాం నా వద్దకు వస్తూనే ఉంటుంది. సీరియస్ రచయితలు, కథకులు, నవలాకారులూ, కవులూ- సైన్స్ గురించి చదువుతారా?. అసలు పట్టించుకుంటారా? శాస్త్రీయ వ్యాసాలు, పాపులర్ సైన్సు పుస్తకాలు, కొత్త థియరీలు, కొత్త ఆవిష్కరణలు వారి కల్పనలో ఏమైనా ప్రభావం చూపుతాయా? ఈ సందేహం ఇటీవల ఒక సినీ రచయిత నన్ను అడిగిన ప్రశ్నతో మరోసారి బయటికొచ్చింది. తన కథలో ఒక పాత్రకు ఒక “సూటయ్యే జబ్బు” ఏదైనా ఉందా? అని అడిగాడు.


అంటే కథలో తాను ఊహించిన జబ్బు నిజంగా మెడికల్ గా ఉంటుందో ఉండదో అన్న అనుమానం అతనిది. మన తెలుగు కథల్లో రచయితలు బహుశా “ఉంటాయనుకున్న” జబ్బులు, “ఉంటాయనుకున్న” టెక్నాలజీలు, “ఉంటాయనుకున్న” రసాయనాలు—చాలావరకూ మెడికల్, సైంటిఫిక్ విశ్వసనీయత పరిధిని మించిపోతుంటాయి. మిథికల్ గా మారుతుంటాయి. నీటి మీద నూనె లాగా మన తెలుగు సాహిత్యానికీ సైన్స్ కీ మధ్య సంబంధం అంటీ అంటనట్టు అలా ఉండిపోయింది. ఐతే మన తెలుగు సాహిత్యానికీ అలాగే స్థూలంగా మన దేశ సాహిత్యానికీ తిరిగి వచ్చే ముందు పాశ్చాత్య సాహిత్యాన్ని ఒకసారి పరిశీలించి వద్దాం.


సైన్సు సాహిత్యాన్ని రెండు మార్గాల్లో ప్రభావితం చేస్తుంది:


1.కంటెంట్ (Subject Matter)

2.నిర్మాణం (Form, Narrative Logic, Epistemic Frame)


ఒక రచయిత సైన్సు గురించి చదివినట్టైతే, కొత్త థియరీలు, కొత్త ఆవిష్కరణలు, బయోమెడికల్ పద్ధతులు—వంటివి కంటెంట్ ని ప్రభావితం చేస్తుంటాయి. పాత్రలు డాక్టర్లు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, కథలో జీన్ థెరపీ ఉండవచ్చు, కథాంశంలో క్వాంటం-ప్యారడాక్స్ గురించి ఇద్దరు పాత్రల మధ్య శాస్త్రీయ చర్చ జరుగుతున్నట్టు రాయవచ్చు.


ఇలా సాధ్యమే. ఇది ఆయా రచయితల పఠనాసక్తి వలన కథలోకి వచ్చేవే. కానీ నిర్మాణం సంగతి అటువంటిది కాదు. రచయితలు కంటెంట్‌ నుంచి నిర్మాణం వరకు చేరడం మన దగ్గర అరుదు. నా దృష్టిలో మన తెలుగు సాహిత్యం లో జరగలేదు కూడా(exceptions will be there!). ఎందుకంటే సాహిత్య నిర్మాణం—పాత్ర నిర్మాణం, కథ దృష్టి కోణం, గమనం, కథనం యొక్క తార్కిక పద్ధతులు—ఇవి మారడానికి ఆ సమాజం సైన్స్ ని అర్థం చేసుకునే విధినంలోనే ఒక పారడైమ్ షిఫ్ట్ అవసరం.


పాశ్చాత్య దేశాల్లో అటువైపు సైంటిఫిక్ ఆవిష్కరణలు, ఇటువైపు సైంటిఫిక్ సిద్దాంతాలు ఈ రెండూ కూడా కథా నిర్మాణాలను విపరీతంగా ప్రభావితం చేశాయి. ఏయే ఆవిష్కరణలు లేదా సిద్దాంతాలు మానవుని జీవన అవగాహనను, ప్రాపంచిక దృక్కోణాలను అప్పటిదాకా వేళ్లూనుకున్న శాస్త్రీయ అవగాహనలనూ పారడైమ్ షిఫ్ట్ చేయగలిగాయో వాటినే సైంటిఫిక్ రివొల్యూషన్లు అనాలి అంటాడు థామస్ కున్ (The Structure of Scientific Revolutios by Thomas Kuhn). సాహిత్య నిర్మాణాలను విపరీతంగా ప్రభావితం చేయగలిగే శక్తి ఈ సైంటిఫిక్ రివొల్యూషన్లకి మాత్రమే ఉంటుంది తప్ప ప్రతీ ఆవిష్కరణకీ ప్రతీ సిద్ధాంతానికీ ఆ శక్తి ఉండదు‌. అందుకే వీటిని సైంటిఫిక్ రివొల్యూషన్లు అనే వీలు కూడా ఉండదనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి.


ఉపకరణాలు (instruments):


1.గడియారం (Mechanical Clock) → కాల అవగాహన, టైమ్-డిసిప్లిన్, శకునాలు ప్రకృతి విలయాలూ గల మిథికాలిటీ నుండి రియలిజానికి మళ్ళడం.( బాల్జాక్, టాల్స్టాయ్)


2.దిక్సూచి (Compass) → ప్రపంచాన్ని స్వీయ కేంద్ర-రహితంగా చూడటం. సముద్రయానంతో ప్రపంచ విస్తృతి తెలియడం.


3.మైక్రోస్కోప్ → అప్రత్యక్ష , సూక్ష్మ ప్రపంచాల ఉనికి అవగాహన → డిటైల్ రియలిజం పెరుగుదల.(Bleak House and the Fog (Dickens))


4.గన్‌పౌడర్ → రాజకీయ-సామాజిక శక్తుల సమీకరణాలు మారడంతో కథా నిర్మాణాలూ మారాయి


సిద్ధాంతాలు (theories):


1.కోపర్నికస్‌ సిద్ధాంతం → మనిషి విశ్వకేంద్రం కాదనే అవగాహన; సాహిత్యంలో ఆత్మకేంద్రీకృత పాత్రల పతనం


2.డార్విన్ సిద్ధాంతం → మార్పు, పోరాటం, అనుకూలత కథనం యొక్క ప్రాథమిక సూత్రాలు అయ్యాయి


3. ఫ్రాయిడ్ సిద్ధాంతం → అవచేతన కథా నిర్మాణాలు, సైకలాజికల్ నవల పుట్టుక.


ఐతే ఈ మూడు సిద్ధాంతాలు భూమిపై మానవుని ఆధిపత్యాన్ని అహాన్నీ తుడిచిపెట్టేశాయి.

ఈ ప్రస్తుత వ్యాసంలో డార్విన్ పరిణామ సిద్ధాంతం పాశ్చాత్య సాహిత్యాన్ని తీర్చిదిద్దిన విధమెట్టిదో చూద్దాం.


డార్విన్ పరిణామ సిద్ధాంతం 19వ శతాబ్దపు విక్టోరియన్ సాహిత్యపు కథా నిర్మాణాన్నే కాదు, ఆ కాలపు ప్రబలమైన ప్రాపంచిక దృక్కోణాన్నీ పునాదుల నుంచీ కదిలించిందని జార్జ్ లెవైన్, జిలియన్ బీర్ వంటి సాహిత్య విమర్శకులు స్పష్టం చేస్తారు. డార్విన్‌కు ముందు విక్టోరియన్ కల్పిత గాధల్లో ఈ ప్రపంచం దైవ నిర్ణయంతో నడిచే నైతిక శాసనం గలదిగా; పాత్రలు ఒక నిర్దిష్ట లక్ష్యం వైపు ప్రయాణించే విధి-ఆధారిత కథా సరళిలోనే కదలాడేవిగా కనిపించేవి. క్లోజ్డ్-ఎండ్ ప్లాట్లు, నైతికంగా సమతుల్య పరిష్కారాలు గల ముగింపులు, కథాగమనంలో ‘క్రమం’(linear story) అనే విలువ—వీటన్నింటి మీద అప్పటి రచయితలకు విశ్వాసం ఉండేది.


కానీ Darwins ‘s “Origin of Species” తరువాత, జార్జ్ ఇలియట్, థామస్ హార్డీ, జార్జ్ మెరెడిత్, హెచ్.జి. వెల్స్ లాంటి రచయితల రచనల్లో కథనం పూర్తిగా కొత్త పుంతలు తొక్కింది. కథా పయనం ఇక ఏమాత్రం విధి వంచితం కాకుండా దానికదే ‘ఒక ప్రక్రియ’ ( process)గా పరిణామం చెందింది. ముందే నిర్ణయించబడిన నైతిక శాసనం వలె కాకుండా, యాదృఛ్చిక సంఘటనలు, అనుకోని పరిణామాలు కథల్లోకి వచ్చి చేరాయి. Nothing is pre determined. పాత్రలు పరిసరాల ప్రభావానికి లోనై వికసించే లేదా నశించేవిగా, పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ చేసుకునేలాగా చిత్రితమయ్యాయి; క్రమరహిత( non – linear) కథా గమనాలు, మరింత అస్థిరమైన, ఏ పరిష్కారం దొరకని తెరిచి ఉన్నవిగా (open-ended) కథా ముగింపులు వచ్చాయి.

ఇక్కడ మనం గమనిస్తే కేవలం డార్విన్ సిద్ధాంతం సాహిత్యంపై ప్రభావం చూపడమే కాకుండా, సాహిత్యం కూడా డార్వినియన్ ఆలోచనలకు ఒక సాంస్కృతిక వాహకంగా మారి, ఆ సిద్ధాంతం మానవుల మానసిక–సామాజిక స్తరాల్లోకి సులభంగా ఇంకిపోయే వేదికను సాహిత్యమే ఏర్పరిచింది. ఇది సాహిత్యం చేయగలిగిన గొప్ప సామాజిక మార్పుగా మనం గమనించుకోవాలి. పరిణామవాదం అప్పుడు శాస్త్రీయ వాదన మాత్రమే కాక, సాహిత్యం ద్వారా ప్రజల సాంస్కృతిక ఊహాశక్తిలో ఒక భాగంగా కూడా మారింది. సాహిత్యం ద్వారా అక్కడి సమాజాల్లో వచ్చిన ఈ మార్పును మనం ఆధునికత అందాం.

ఇక మన దేశానికొస్తే—వలసవాదం ద్వారా మన దేశానికి వచ్చిన ఆధునికత పరిపాలనా వ్యవస్థలో (administrative modernity) బలంగా స్థిరపడినా, మేధోపరమైన (intellectual modernity) రూపంలో విస్తరించలేదు. పాశ్చాత్య ప్రపంచంలోలా డార్విన్ సిద్ధాంతం ఎటువంటి పారమార్థిక-తాత్విక సంక్షోభాన్నీ మనకి తీసుకు రాలేదు. ఫలితంగా అది ప్రజల ఊహాత్మక ప్రపంచంలో కాకుండా పాఠశాలలో ‘సామాన్య శాస్త్రం’ సిలబస్‌లో ఒక అధ్యాయంగా మాత్రమే నిలిచిపోయింది. అందుకే ఆధునిక తెలుగు సాహిత్యంలో డార్విన్ గైర్హాజరీ మాత్రమే కాదు—సాహిత్య నిర్మాణమే మొత్తానికి ఏదో ఒక విధంగా యాంటీ-డార్వినియన్ ఊహపై నడుస్తోంది.

మన సామాజిక–తాత్విక జీవితం పురాతన హిందూ సాంస్కృతిక మూలాలతో బలంగా ముడిపడి ఉండటం వల్ల మన కథా సంప్రదాయం కర్మ సిద్ధాంతం, విధి, నైతికత–అనైతికతల ఘర్షణ, దుష్ట శిక్షణ–శిష్ట రక్షణ, చతుర్విధ పురుషార్థాలు, చతురాశ్రమ ధర్మాలు, అరిషడ్వర్గాల నియంత్రణ, దైవ నిర్ణయం, కలి ధర్మం వంటి చింతనలతో నిండి ఉంటుంది. ఐతే ఆధునికత ప్రభావం మన జ్ఞాన సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చలేకపోయినా, నైతిక వ్యవహారాల్లో మాత్రం కొంతమేర ప్రగతిశీలతను ఆహ్వానించగలిగాము. అందుకే పాత్ర మోడరన్ గా అమెరికా లో ఉన్నా ఆధునిక గాడ్జెట్లను వాడుతున్నా, ఉదయమే సంధ్యా వందనాల్ని చేస్తూ, సాంప్రదాయ దుస్తులనూ, పండుగలనూ, ఆడవారి జడలో మల్లెపూలనూ పొగుడుతూ ఉండటమే గొప్ప మహత్తరమైన విషయంగా మారుతుంటుంది. ఐతే ఎంతో కొంత విశ్వనాథీయ సాంప్రదాయత నుంచి బయటపడి సామాజిక మార్పు, సంస్కరణోద్యమాలూ, ప్రోగ్రెసివ్ ఆదర్శాలు, కులం–జెండర్–అస్తిత్వ వాదాలనూ, మానవతా వాదాలను కంటెంట్ స్థాయిలో ఐనా ఆధునికీకరించగలిగాము. కానీ నిర్మాణాన్ని మాత్రం మార్చుకో లేకపోయాం.

ఫలితంగా, తెలుగు కథ–నవలల్లో నేటికీ ‘మంచివాడికి మంచి జరుగుతుంది’, ‘చెడువాడికి శిక్ష పడుతుంది; ‘కథలో ఒక స్పష్టమైన నీతి ఉంటుంది. మెసేజ్ ఉంటుంది. పాత్రలు ఉదాత్తమై జీవితానుభవాలను శాశ్వత సత్యాలుగా ప్రబోధిస్తూ(didactics) ఉంటాయి. పాత్రల స్వభావాలు స్థిరంగా, పరిసరాలకు అనుగుణంగా మారనివై, ఉంటాయి. సుఖాంతమో, దుఃఖాంతమో ఔతూ కథలు చివరికి కంచికి చేరడంతో కథా నిర్మాణ పరిమితులు మునుపటిలానే కొనసాగుతున్నాయి.

ముఖ్యంగా మన రచయితలు సైన్సును జ్ఞానంగా కాకుండా profession గా మాత్రమే చూడడం, శాస్త్రీయ గ్రంథాల పఠనం మన సమాజంలోనే తక్కువగా ఉండటం, సైన్సును అంగీకరిస్తే “భావుకత పోతుందేమో!” అన్న భయాలు సాహిత్యకారుల్లో నిండిపోవడం, సైన్సునూ, ఆధునికతనూ వలసవాద భావనలుగానో, కాపిటలిస్ట్ భావనలు గానో భ్రమపడటం లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. మన సాంస్కృతిక అహంమీద మీద వలసవాదం చేసిన గాయం నుండి బయటపడే క్రమంలో ఏర్పడుతున్న మన ప్రస్తుత రాజకీయార్థిక వ్యవస్థలు కూడా ఢీ కొట్టడానికి వీలు లేనంత పెద్ద కొండలా మారడంతో ఫిలాసఫికల్ modernity మన సాహిత్యంలో బలమైనన పునాదిని ఏర్పరుచుకోలేక పోతోంది.

ఈ నేపథ్యంలో, సైన్స్‌ తీసుకువచ్చిన ప్రపంచ-దృష్టి మన కథా నిర్మాణాల్లో ప్రవేశిస్తే తప్ప మన సాహిత్యం, తద్వారా, మన సమాజం- ఆధునికత వైపు నిజమైన అర్ధంలో అడుగు పెట్టదు. సైన్స్ – సాహిత్యం రెండు వేరు వేరుగా కాకుండా ఒకటిగా కలిసి, ఒకదానికొకటి ఆలంబనగా సాగితే తప్ప మన సమాజం ఆధునీకరించబడదనే స్పృహ వస్తేనే రాబోయే కాలపు రచయితలనుండైనా కొత్త సాహిత్యానికి బాటలు పడతాయి.

అలా జరగకపోతే—మన కథలు ఎంత ప్రస్తుత విషయాలపై మాట్లాడినా, ఎంత కొత్త జనరేషన్ రచయితలు రచనలు చేసినా ఆధునికత కేవలం “పైన పూతగా” మాత్రమే మిగిలిపోతుంది.

*
చిత్రం: సృజన్ రాజ్ 

Highlight any text to reply to that part.

All Replies

No replies yet. Be the first to reply.

Latest Comments

I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026
I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026

New to Communities?

Join the community