రేపటి యముడు!! అనే కవిత 'యుద్ధం లో pillalu'
అనే శీర్షిక కోసం వ్రాయబడినది.ఇది నా స్వంతం.దేనికీ అనువాదం, అనుకరణ కాదు...
Savitri Ramanarao
రేపటి యముడు!!!
పుడమంతా పరుచుకున్న యుద్ధ మేఘాలు,
కురుస్తున్న క్షిపణుల కుండ పోతలు.
పేలిపోతున్న నగరాలు;
రాలి పోతున్న వుసురులు.
వణుకు తప్ప కునుకు ఎరుగని
చూలింతల గర్భ స్రావాలు,
కడుపు పంటను కోల్పోయిన బాలింతల దీనాలాపాలు.
ఖర్మ కాలి బతికి బయట
పడిన బిడ్డ;
ఆలనా పాలనలకు నోచుకోని
అనాధ.
చేయని నేరానికి దారుణ శిక్షలు అనుభవిస్తున్న పసి కూనలు,
మారణ హోమాల్లో సమిధల
వుతున్న అసంఖ్యాక రేపటి పౌరులు.
మానవాళి నొసటన మనిషి కార్పణ్యం చేసిన మానని గాయం,
మొగ్గ గానే చిదిమేస్తూ పూవులను వికసించనీయని ఈ కర్కశత్వం,
మతమో, అతి దాహమో; కారణ మేదైనా కాటేస్తున్న నియంతృత్వం,
ఈ భూమిని అనాదిగా పట్టి పీడిస్తున్న పెను జాడ్యం,
సంకుల సమరం అనే ఈ సంకటం ద్విపాద పశువుల, నైజం, నిర్వాకం.
రణ కింకరుల
పాల పడి,
తమ వారలకు
దూరమయి,
ముక్కు పచ్చ లారని ముద్దు బిడ్డలు వికలాంగులై,
జోల,లాల లెరుగని పసి గుడ్ల
బతుకులు తెగిన గాలి పటాలై;
అయోమయంగా,
అమాయకంగా,
ఈ బాల జీవశ్చవాలు
ఈ ఘోర శవసేద్యఫలాలు
శరణార్థుల శిబిరాల ఉచ్చుల లోకో,
మొట్టి చేయించే వెట్టి చాకిరీల చిచ్చుల లోకో;
తరలించ బడుతూ,
కరుణించమంటూ;
ఆరళ్ళకు, అత్యాచారాలకు గురై,
వసి వాడి పోతూ, మసి బారి పోతూ,
ఈ రాక్షస, దుష్ట , నికృష్ట అమానవీయ
కృత్యాలకు:
దగ్ధ మవుతున్న అపురూప కిశోర సౌకుమార్యం,
వీరు మనసులలో రగిలి,
తమలో తాము మరిగి;
రేపు ఆత్మాహుతి దళాలు గానో,
బాల సైనిక బృందాలు గానో,
వచ్చి తిరగబడితే?
రెచ్చి తెగ బడితే??
నేటి ఈ నియంతల ఘోర రణ తంత్ర ఫలం,
ఇలా నిరాదరణ కు గురైన బాల్యం,
రేపు విచక్షణ లేని మృగాలై తెగ బడితే...
మరిన్ని మారణ హోమాలకు పూర్వ ప్రస్ధానాలయితే??
చీకటి దారుల్లోకి మొత్తం ప్రపంచాన్ని నెడితే ???
ఆ పాపం ఎవరిది?
ఆ శాపం ఎవరికి?
అహాల ఆరాటాల, ఆపని పోరాటాల,
అంతులేని స్వార్ధాల, అత్యంత క్రూర తత్వాల,
వికృత రతులు ఇలాగే కొన సాగితే..
ఇహాల, పరాల స్పృహలేని
మౌఢ్యాలు ఇలా కసు గాయలను కబళిస్తే...
ఆ విషపు పడగ నీడల్లో,
ఆ విధ్వంస వాడల్లో:
గాయాలు గా పుట్టి,
గాయాలుగా ఎదుగుతూ,
నేడు రక్తాశ్రువులు రాల్చే ఈ బాల గాయాలే;
రేపు ఎదిగి కసితో చేయవా మరెన్నో తీవ్ర గాయాలు?
మానని ప్రతి గాయం అయి తీరుతుంది;
జాతి మనుగడకు పక్కలో బల్లెం!
ఆరని అనలం ఆపదు
దహించడం అన్నది చరిత్ర చెబుతున్న చేదు నిజం.
నేటి ఈ రణ సృష్టి,
ఈ దారుణ పరిస్ఠితి;
రేపు కోట్ల ఎదల్లో
మరిగే లావాలకు నాంది.
ఈ బాల గాయాలకు..
ఈ బేల హృదయాలకు..
ప్రేమ మలాములు పూయక పోతే...
ఈ కన్నీటి కథలకు చరమ గీతి
పాడక పోతే...
ఈ రోదించే చిన్నారులే
రేపటి బద్దలయే అగ్ని పర్వతావుతాయి!!
ఈ రగులుతున్న హృదులే రేపు ఆరని రావణ కాష్టాలు రాజేస్తాయి!!!
ఈ ద్వేషం కాటేసిన బాల్యాలే రేపు విష జ్వాలలై విరుచుకుపడి మాయని రక్త చరిత్రలు లిఖిస్తాయి!!!!
అవును...
నేటి యుద్ధం లో గాయ పడ్డ ప్రతీ బాలుడు;
రేపటి నరజాతి పాలి మరో కాల యముడు కాగలడు!!