V
:

కొంచెం నిప్పు కొంచెం నీరు

Author Name: Virinchi Virivinti
SOCIOLOGY/ ARTS AND LITERATURE

కొంచెం నిప్పు కొంచెం నీరు. అరణ్యకృష్ఘగారి పుస్తకం.

 

పోయిన సంవత్సరం బుక్ ఎక్జిబిషన్ కి వెళ్ళాలనే సంకల్పమేదీ లేదు. చదవవలసిన పుస్తకాలే చాలా ఉన్నవి. అవేవీ చదవకుండా మళ్ళీ బుక్స్ కొంటూ బుక్స్ కలెక్షన్ మాత్రమే చేసే సుండోకు పద్ధతికి బలికాకూడదనే స్పృహతో వెళ్ళకూడదనే అనుకున్నాను. కానీ అరణ్యకృష్ణ గారు తన పుస్తకం విడుదల కాబోతోందని రమ్మని ఆహ్వానించారు. ఐనా సమయానికి చేరుకోలేకపోయాను. కానీ ఆయన మాత్రం వచ్చినందుకు సంతోషపడి ఆయన వ్యాసాల పుస్తకం కొంచెం నిప్పు కొంచెం నీరును నాకు ప్రేమతో బహుకరించారు. పుస్తకం వెల తీసుకోమన్నా సున్నితంగా తిరస్కరించారు. ఐతే చదివి ఎలా ఉందో చెప్పాలి అని కండీషన్ పెట్టారు. నేను వీలైతే మీ పుస్తకం పై రాస్తానని చెప్పాను. ఇంటికి వచ్చి ఒక వ్యాసం చదివాను. నిజంగానే సుర్రున నిప్పుతో కాల్చినట్టు అనిపించింది. తరువాత అపుడపుడూ కొన్ని వ్యాసాలు చదువుతూ సాగాను. అన్ని వ్యాసాలూ చదివాను. మళ్ళీ చదివాను. చదివే కొలదీ వాటి లోతు తెలిసింది. ఇది కొంచెం నీరు కాదు మనం మునిగిపోయేంత నీరున్న పుస్తకం అనిపించింది. ఒక్కో వ్యాసం చదివి అందులోని అంశాలపై ఆలోచిస్తూపోతే ఆ ఆలోచనల్లో మునిగిపోతామేమో అనిపిస్తుంది. అంత బలమైన ముద్ర వేయగల వ్యాసాలు ఇవి. 

 

ఐతే వ్యాసాలు చదివే గుణం తగ్గిపోయిన ఈ కాలంలో ఇటువంటి విలువైన రచనలు వ్యాసాల్ని మనం ఎందుకు చదవాలో మరలా తెలియజేస్తాయి. అసలు ఒక విషయాన్ని వ్యాసంలాగా ఎందుకు రాయాలి?. ఒక వాక్యమో కొన్ని వాక్యాల్లో రాస్తే సరిపోతుందిగా అని ఎవరైనా అడగవచ్చు. వ్యాసం ఒక వాక్యం కాదు. అవి నిర్జీవ అక్షరాల గుంపులు కావు. ఆలోచనల పరంపరలు. ఒక విషయంపై పలు రకాలుగా పలు కోణాలుగా రచయిత చేసే ఆలోచనల పరంపరలు. అవి చదివేకొద్దీ విషయావగాహన విస్తృతంగా మాత్రమేకాకుండా లోతుగా కూడా పెరుగుతుంది. మనకు కొన్ని అభిప్రాయాలుంటాయి. కొన్ని బలంగా ఉండవచ్చు కొన్ని బలహీనంగా ఉండవచ్చు. భూమి మీద పైపైన నాటిన మొక్కల్లాంటి వాటిని పీకి ఒక పెద్ద గొయ్యి తవ్వి మొక్క స్థానంలో పెద్ద వృక్షాన్ని నిలబెడితే ఎలా ఉంటుంది?. విస్తృతిగల రచయిత వ్యాసాలు చదివితే అలాగే ఉంటుంది. ఈ పుస్తకంలోని వ్యాసాలు మనలోపల కొన్ని బలమైన లోతైన ఆలోచనలుగా వృక్షాలు నాటినట్లుగా నాటుతాయి. ఈ పుస్తకానికి సబ్ టైటిల్ గా సామాజిక సాంస్కృతిక రాజకీయ వ్యాసాలు అని పెట్టారు. భారతదేశ విభిన్నమైన ఈ సామాజిక సాంస్కృతిక రాజకీయ వాతావరణాన్ని అర్థం చేసుకోవడం నిజానికి అంత తేలికైన విషయమని నేననుకోను. చాలా లోతైన పరిశీలన ఉండాలి. లోతైన నిరంతర అధ్యయనం జరగాలి. అరణ్య కృష్ణగారు ఒక అడుగు ముందుకువేసి నిరంతరం వేదనపడే మనిషిగా కనిపిస్తారు. తను నివసిస్తున్న భారతదేశాన్ని బాగుచేసుకోవాలని ఎంతో తపన ఎంతో ప్రేమ ఎంతో వేదన ఉంటే తప్ప ఇంత మంచి వ్యాసాలు రాయలేరనిపిస్తుంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మీడియా ఉన్న కాలంలో ఏది నిజమైన వార్తనో ఏది కాదో తెలుసుకోలేని అసంబద్ధ కాలంలో మనను సరైన దారిలో నడపగలిగేవి నిబద్ధతతో రాయగలిగిన ఇలాంటి వ్యాసాలు మాత్రమే. 

 

అరణ్య కృష్ణగారు రచయిత మాత్రమే కాకుండా అద్భుతమైన కవి కూడా. దానివలన రవికాంచనిచోట కవిగాంచును అన్నట్టు తను ఎంచుకున్న విషయాలలో ఎవరూ చూడని ఒక కోణాన్ని మనకు చూపిస్తారు. ఉదాహరణకు ఒక హత్య జరుగుతుంది. హత్య ఎవరు చేశారని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. కాని "ఒక హత్య జరిగితే దాని వెనుక కనిపించని నిందితులు అనేకులుంటారు" అంటాడు. మన సమాజం ఒక వైపు ఆధునికత మరివైపు సాంప్రదాయతగా రెండుగా విడిపోయిందని మనం అనుకుంటాం కానీ " ఈ దేశంలో సనాతన ఆధునిక సంస్కృతులూ రెండూ స్త్రీకి వ్యతిరేకంగా ఉన్నాయి" అంటాడు. "ప్రేమంటే ఒక ప్రజాస్వామిక ప్రవర్తన" అంటాడొకచోట. " మనం ఉపన్యాసాలకీ, నీతి ప్రవచనాలకీ అలవాటు పడిపోయాం"అంటాడు మరోచోట. ఇలా చెబుతూ పోతే ఈ పుస్తకంలో ప్రతివ్యాసంలో ఎన్నో గొప్ప పరిశీలనలు ఉన్నాయి. అరణ్య కృష్ణగారి వచన శైలి కూడా అక్కడక్కడా కవితాత్మకంగా సాగుతుంది. ఆ వాక్యాలు కవితలో భాగాలా అనిపిస్తుంది. ఒక విషయం గురించి ఒక కవి ఎన్ని రకాలుగా వర్ణించగలడో అలా వర్ణిస్తూ పోతారు. ఇది ఆయనకు మాత్రమే సాధ్యమైన విలక్షణమైన శైలి. సాధారణంగా వ్యాసంలో విషయ సేకరణ ఉంటుంది. విషయంపై పలు కోణాల్లో విశ్లేషణ ఉంటుంది. కానీ దానిని కవితాత్మకంగా బలంగా పాఠకుడి మనసులో ముద్రించుకుపోయేలా రాయగలిగే శక్తి అరణ్యకృష్ఘగారి సొంతం. అంతేకాకుండా అరణ్యకృష్ఘగారి వ్యాసంలో మనకు అర్థంకాని పదాలుకూడా ఏమీ ఉండవు. ఎందుకంటే ఆయన ఏం చెప్పదలచుకున్నాడో ఆ విషయానికి సంబంధించిన పదాలను ఆయనే మొదట నిర్వచిస్తారు. ఆ నిర్వచనం తెలియకపోతే పాఠకుడికి అతడిని పట్టుకోవడం కష్టమౌతుంది. నమ్మకం అంటే ఏమిటి అని మనం అడిగితే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పవచ్చు. కానీ నమ్మకం అంటే అరణ్య కృష్ణ ఏమనుకుంటున్నారో మొదట నిర్వచిస్తారు. " ఒక సంశయానికి సంబంధించిన అంశంలో తిరుగులేని సానుకూల స్పందనే నమ్మకం" అంటాడు. ఇక పాఠకుడికి ఇబ్బంది లేదు. ఆచారం అంటే ఏంటి దురాచారం అంటే ఏంటి అనడిగితే ఆయన చాలా సులువుగా చెప్పేస్తారు. "వివాహం ఒక ఆచారం. బాల్య వివాహం దురాచారం. పాతివ్రత్యం ఒక ఆచారం. సతీసహగమనం దురాచారం" ఇంత విస్పష్టంగా నిర్వచిస్తూ సాగడం ఆయన శైలి. 

 

ఐతే ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యాసావళి ప్రస్తుత భారత సమాజంపై ఎక్కుపెట్టిన బలమైన విమర్శనాస్త్రం. ఈ అస్త్రం రాజ్యాన్నీ ప్రజలనూ సంస్కృతినీ మన భారతీయ సైకాలజీని దేనినీ వదిలిపెట్టకుండా నిర్ద్వంద్వంగా విమర్శ పీఠం మీద నిలబెడుతుంది. ఇటువంటి విమర్శ చాలా అవసరం. భారతదేశం మీద ప్రేమ ఉండటం అంటే గతమంతా ఘనమని భజన చేస్తూ కూర్చోవడం కాదు. ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం. మన సమాజం ఎలా ఉంది. ఎటువైపు పోతోంది. మనం ఏమాలోచిస్తున్నాం. మన పాలకులు ఎటువైపు దేశాన్ని తీసుకుని పోతున్నారు. మన వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయి. మన చదువులు మన సినిమాలు మన ఎంటర్టైన్మెంట్ మన మీడియా మన వార్తలు మన లోపాలు మన బలాలు అనేది తెలుసుకోకపోతే మనకెంత నష్టం. మనకు ఇటువంటి వ్యాసాలు రాసేవారు లేకపోవడం కూడా పెద్ద లోపం. మనం వ్యాసాలు చదివే గుణం కోల్పోవడం, పుస్తకాలు చదివేగుణం కోల్పోవడం కూడా మరో లోపం. నాకు వ్యక్తిగతంగా నాచుట్టూ ఉన్న నాకిష్టమైన భారతీయ సమాజాన్ని ఈ వ్యాసాల్లో తెలుసుకుంటూ సాగుతుంటే ఒక్కోసారి సమయం తెలియలేదు. ఒక్కో వ్యాసం చదివాక దాని విస్తృతికీ దాని పరిణతికీ ఆ పద గాంభీర్యానికి ముగ్దుడనై ఆ ఆలోచనల్లోనే కూరుకుపోయిన సందర్భాలున్నాయి. ఒక సమగ్రమైన వ్యాసం ఒక గొప్ప పుస్తకాన్ని చదివినంత ఆనందాన్నీ జ్ఞాన పరిణతినీ ఇస్తుందనిపిస్తుంది. ఎన్నో వాక్యాలను కలర్ మార్కర్ తో అండర్ లైన్ చేయకుండా ఉండలేకపోయాను. ఈ పుస్తకంలో పుస్తకాల గురించిన వ్యాసం ఒకటుంది. " కరెన్సీ చేతులు మారినదానికంటే ఎక్కువగా పుస్తకాలు చేతులు మారాలి. పుస్తకం మంచిదని తెలిసాక అది మన దగ్గర ఉండకూడదు. మనం పుస్తకాలకి ధర చెల్లించేది మనం చదవడానికేగానీ దాచుకోవడానికి కాదని నా దృఢాభిప్రాయం" అంటారు ఆ వ్యాసంలో. ఆ వ్యాసం చదివాక నా దగ్గరున్న నేను చదివిన మంచి పుస్తకాలను నా మిత్రులకు ఇచ్చేశాను. కానీ ఈ మంచి పుస్తకాన్ని మాత్రం ఇవ్వను. ఇవ్వలేను. అరణ్యకృష్ఘగారేమనుకున్నా సరే!!

 

విరించి విరివింటి

25/12/23

All Replies

New to Communities?

Join the community