Cultural Anti-Darwinism: Epistemological Crisis in Postcolonial Societies

Cultural Anti-Darwinism: Epistemological Crisis in Postcolonial Societies :


డార్విన్ పరిణామ సిద్ధాంతం కీర్తించతగ్గ గొప్పదేమీ కాదనీ, దానికి నిరూపణలేవీలేవనీ, అది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమేననీ, అంత మాత్రాన సత్యం ఐపోదనీ- ఇలాంటి వాదనలు, “కోతి నుంచి మనిషి వచ్చాడన్నప్పుడు ఇంకా కోతులు ఎందుకు ఉన్నాయి?” వంటి వాదనలు లేదా దశావతారాల క్రమం చూస్తేనే అర్థమైపోతుంది మన వాళ్ళకు జీవ పరిణామం ఎప్పుడో తెలుసని అనే వాదన,—ఇవి మన సమాజంలో తరచూ కనిపిస్తుంటాయి. ఐనా ఇవి నవ్వుకుని వదిలేసేంతటి చిన్న అంశాలు కావు. భారతదేశంలో జ్ఞాన సిద్ధాంతం(epistemology)మాత్రమే కాదు, సిద్ధాంత జ్ఞానాన్ని ( theoretical knowledge)కూడా అర్థం చేసుకునే విధానంలోనే తీవ్రమైన లోపాలున్నాయన్నది ఈ వాదనలు నిరూపిస్తున్నాయి. ఇవి ఆధారభూత సైద్ధాంతకితకీ ప్రతీకాత్మక సాహిత్యానికీ ఉన్న భేదాలను గుర్తించలేని మన సాంస్కృతిక ఆశక్తతని కూడా తెలుపుతున్నాయి.  


 ఐతే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉదయిస్తుంది. ఈ డార్విన్ వ్యతిరేక వాదనలు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి కదా! అక్కడి వాదనకూ ఇక్కడి వాదనకూ తేడా ఏంటి? అని. ప్రస్తుతం పశ్చిమ దేశాల్లో డార్విన్ సిద్ధాంతం పట్ల ఉన్న వ్యతిరేకత ఒకరకంగా మత ఛాందస గ్రూపులకు మాత్రమే పరిమితమైనది. మత గ్రంథ ప్రామాణికతకూ సైన్స్ కి మధ్య వెలిసిన వైరమది. "మా పూర్వికుల జ్ఞానం గొప్పది → కాబట్టి డార్విన్ తప్పు" అనే వాదన అక్కడ అవసరం కాలేదు. 

కానీ మనదగ్గర, అలాగే మనతో పాటు టర్కీ, అరబ్, ఆఫ్రికా వంటి వలస దేశాలలో ఉన్న డార్విన్ వ్యతిరేక వాదన సాంస్కృతికమైనది. అందుకే మన దేశంలో యాంటీ డార్వినిజం ఉద్దేశ్యం వేరు. బ్రిటీష్ వలసవాదంతో గాయపరిడిన భారతీయ అహాన్ని ( wounded pride) సాంస్కృతిక పద్దతుల ద్వారా రక్షించుకోవాలనుకోవడం దాని లక్ష్యం. తద్వారా తన సాంస్కృతిక, ప్రతీకాత్మక ఆధిపత్యాన్ని తిరిగి నిరూపించుకోవాలి అనుకునే ప్రయత్నమే ఇది. " మా వాళ్ళకు ఇవ్వన్నీ ఎప్పుడో తెలుసు" అనడంలో అసలు మర్మమదే. ఐతే దానిని అర్థంలేని భేషజం, అనవసరమైన అహంకారం అనుకునేకంటే, అనూచానంగా వస్తున్న, మార్చేందుకు వీలే లేని పౌరాణిక సత్యాలకూ, కంటి ముందే కనిపిస్తున్న, నిరంతరం మార్పు చేసుకోగలిగిన ఆధునిక సైంటిఫిక్ సత్యాలకూ మధ్య భారతీయుడిలో ఏర్పడిన మేథో అభిజ్ఞను తగ్గించుకునే ప్రక్రియ( reduction of congnitive dissonance)లా కూడా చూడవలసి ఉంటుంది. ఇది భారతీయుడి జ్ఞాన సిద్ధాంత సంక్షోభం(epistemic crisis). జాతీయవాద భావజాలం ప్రబలే కొద్దీ, మన సంస్కృతీ సాంప్రదాయాలకు మనం కట్టుబడి ఉండాలనే ధోరణి పెరిగే కొద్దీ "డార్విన్ సిద్ధాంతం విదేశానికి చెందినది, మనదేశానిది కాదు - కాబట్టి అది నిర్ద్వంద్వంగా వ్యతిరేకించతగ్గది" అనేధోరణి కూడా ఈ మధ్య వచ్చి చేరింది. అందుకే డార్విన్ పరిణామ సిద్ధాంత వ్యతిరేకత ఇక్కడ లోతైనది. 

ఈ విధంగా మన సమాజంలో వివిధ స్తరాలలో విస్తరించిన డార్విన్ వ్యతిరేక వాదం రాబోయే కాలంలో భారతీయ సమాజాన్ని ఆధునిక శాస్త్రీయ, ఆధునిక తాత్విక ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరం చేసే ప్రమాదకరమైన వాదనగా మారుతుంది. ఇది చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం. 

మానవ చరిత్రలో ఆధునిక శాస్త్రవిజ్ఞానం ఆవిర్భవించాక రెండు మూడు శతాబ్దాల పాటు ప్రపంచాన్ని కొత్త ఆలోచనలతో నింపిన ఎన్నో ఆవిష్కరణలు, సిద్ధాంతాలు వచ్చాయి. ఐతే వీటన్నింటిలోకి కొన్నే విప్లవాత్మక ఆవిష్కరణలు ఉన్నాయి. అందులో డార్విన్ పరిణామ సిద్ధాంతం ఒకటి. నిజానికి ఏదైనా ఒక శాస్త్ర సిద్ధాంత అభివృద్ధిలో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి, ఆ శాస్త్రంలోనే అంతర్గతంగా ఎటువంటి ఆలోచనలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి అనే కోణమైతే, రెండు, ఏయే సామాజిక -ఆర్థిక -రాజకీయ పరిస్థితులు ఈ కొత్త సిద్ధాంతానికి దారితీశాయి అనే కోణం. దీనిని డార్విన్ పరిణామ సిద్ధాంతానికి కూడా ప్రసరిస్తే జీవశాస్త్రంలో ఆలోచనా ధారలు ఎలా మార్పు చెందుతూ డార్విన్ కాలానికల్లా ఎలా అభివృద్ధి చెందాయి. అలాగే ఏయే ఆర్థిక- సామాజిక - రాజకీయ పరిస్థితులు డార్విన్ సిద్ధాంత రూపకల్పనకు కలిసి వచ్చాయి. అనే రెండు పార్శ్వాలనూ మనం గమనించవలసి ఉంటుంది. (ఈ రెండు దృక్పథాలను రాబోయే వ్యాసాల్లో చర్చిద్దాం). 

ఆ విధంగా చూసుకుంటే, డార్విన్ పరిణామ సిద్ధాంతం ఒక శూన్య ఆకాశం నుంచి ఆకస్మాత్తుగా ఊడి పడ్డ ఆలోచన కాదనీ అది రెండు శతాబ్దాల పాటు ఐరోపాలో Baconian empiricism నుండి Lyell భూగర్భ శాస్త్రం వరకూ పెరిగిన శాస్త్రీయ, తాత్విక, రాజకీయ ఆర్థిక చింతనల సమ్మేళనాల అంతిమ ఫలితమనీ అర్థమవుతుంది. డార్విన్ కి ముందు రెండు వందల యేళ్ళుగా ఏర్పడిన ఈ మానసిక వాతావరణం నుంచే, భావనాత్మక క్షేత్రం నుంచే డార్విన్ ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే, డార్విన్ అనే ఒక వ్యక్తి తన మేధస్సు ఫలితంగా, కృషి ఫలితంగా మాత్రమే కాకుండా, (అంటే అందులో డార్విన్ మేధస్సు - కృషి లేవని కాదు) ఒక యుగం తన ఆలోచనల అంతిమ రూపంగా ఆవిష్కరించుకున్న శాస్త్ర చైతన్యంగా కూడా మనం పరిణామ వాద సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. సాధారణంగా మన భారతీయులకు శాస్త్రవేత్త అనువాడు అద్భుతమైన మేథా శక్తిగల హేతుబద్దతగల వ్యక్తి మాత్రమే. కానీ అతడిని ఆ సమాజం యేళ్ళ తరబడి చేసిన సామూహిక చింతనలనూ చర్చలనూ ఒక కొలిక్కి తెచ్చిన వాడిగా మన భారతీయులు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం జ్ఞానాన్ని ఒకరికి కలిగిన దర్శనంలాగానో లేదా గాఢ ధ్యానంలో ద్యోతకమైన అంశంగానో చూస్తాం. పరిశోధనా ఫలితంగా చూడం. కాబట్టి ఒకరి జ్ఞానం ఒక రెండు శతాబ్దాల సామూహిక ఆలోచనల ఫలితం అంటే చాలా మనకు విచిత్రంగా, కొత్తగా తోస్తుంటుంది. ఒక్క డార్విన్ సిద్ధాంతానికే కాదు ఏ శాస్త్రీయ అంశానికైనా ఇదే వర్తిస్తుంది. ఆధునికత మనకు ఒక చారిత్రక యాక్సిడెంట్, ఒక కొలోనియల్ దిగుమతి. కానీ అది వారికి హేతుబద్ధ తత్వ‌ విచారణా ఫలితం.

ఈ అవగాహనా రాహిత్యం మన దేశంలో రెండు రూపాలను సంతరించుకుంది.

1. Mythification of science - సైన్స్ ని పురాణీకరించడం. కొత్తగా ఏ సైంటిఫిక్ అంశాన్ని ప్రపంచంలో ఎక్కడ కనుక్కున్నా ఇదంతా మా వేదాల్లో పురాణాల్లో ఉందని చెప్పడం. మన పుస్తకాలను దొంగలించుకుని వెళ్ళి కొనుక్కోగలుగుతున్నారే తప్ప వీళ్ళెవరికీ మన పూర్వీకులకున్నంత జ్ఞానం లేదనడం.

2. Scientizing myth- పురాణాలను సైన్సీకరించడం. పురాణాల్లోని ప్రతి శ్లోకానికీ పద్యానికీ సంఘటనకూ వెనుక సైన్స్ ఉందనీ( కౌరవుల పుట్టుకలో జెనెటిక్ ఇంజనీరింగ్, వినాయకుడి తల ప్లాస్టిక్ సర్జరీ తో అతికించారనడం), పైకికనిపించని నిగూఢమైన అర్థాలు రహస్యాలు ఉన్నాయనీ, వాటిని మన యువత బయటకు తీస్తేగానీ మన దేశంలో గొప్ప సైన్స్ ఉందన్న విషయం ప్రపంచానికి తెలియని చెప్పడం.

దీనివలన ఏది నమ్మకమో ఏది హేతుబద్ధతో తెలియని హైబ్రిడ్ జ్ఞాన సిద్ధాంతమేర్పడుతుంది. ఇది భారతీయ విద్యార్థికి జ్ఞానంతో గల సంబంధాన్నే దారుణంగా గాయపరిచి ఏది పవిత్రత ఏది ఆధునికత అనే సందిగ్ధంలో ఊగిసలాడేలా చేస్తుంది. సైన్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ, నిరంతర చర్చ అనే స్పృహ లేకుండా సైన్స్ చదవడం, చెప్పడం చేస్తే ఈ హైబ్రిడ్ సిద్ధాంతాలే అతడి తలమీదికెక్కి కూర్చుంటాయి. 

ఐతే, ఈ రోజు డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని స్కూలు పిల్లల సిలబస్ నుండి తొలగించడాన్ని మనం విమర్శిస్తున్నాం కానీ గతంలో దాన్ని తొలగించని సమయంలో కూడా డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఎలా బోధించామన్న విషయాన్ని కూడా మనం తరచి చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి పిల్లల సైన్స్ పాఠ్యపుస్తకాలలోని అన్ని అధ్యాయాల్లాగే డార్విన్ పరిణామ సిద్ధాంతం కూడా ఒక అధ్యాయంగా నేర్పబడిందే తప్ప, ఆధునిక శాస్త్రీయ చైతన్యానికి ప్రతీకగా నేర్పబడలేదు. ఇది ప్రధానమైన లోపం. ఆ సిద్ధాంతపు లోతులు, తాత్విక గమనమూ విద్యార్థికి తెలుపకపోతే అది పరీక్షల్లో ఛాయిస్ లా వదిలేసుకునే పది మార్కుల ప్రశ్నలాగో లేదా ఐదు మార్కుల డయాగ్రాం లాగానో మిగిలిపోతుంది. కాబట్టి డార్విన్ సిద్ధాంతాన్ని ఒక మతాన్ని ప్రశ్నించిన, జీవశాస్త్రానికి కొత్త రూపురేఖలు ఇచ్చిన, మనిషి స్థానాన్ని విశ్వంలో పునర్నిర్వచించిన విప్లవాత్మక ఆలోచనగా విద్యార్థుల ముందుకు తీసుకుని రావాలి. అది సిలబస్ లో ఉంటేనే బోధిస్తామనుకోవడం పొరపాటవుతుంది. తరగతి గదిలో ప్రతీ విషయాన్ని పరీక్షల కోసం మాత్రమే బోధించము కాబట్టి దీనిపై ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలి. 

ఈ సాంస్కృతిక యాంటీ డార్వినిజం ఇపుడు కొత్తగా వచ్చింది కాదని, మన సమాజంలో ఎప్పుడో ఇది వేళ్ళూనుకుందని మనం తెలుసుకోవాలి. ఇది సైద్ధాంతికంగా reversal of the Enlightenment process గా మనదేశంలో మారబోతుందనీ గుర్తెరగాలి. ఏది సత్యం ఏది అసత్యమనే హేతుబద్ధ విచారణా శక్తి పెరగకుండా సత్యం పవిత్రమైన గ్రంథాలలో మాత్రమే ఉందనే స్పృహ లోనే ఉండిపోతే మెలి మెల్లిగా జ్ఞానోదయ పూర్వయుగా( pre enlightenment era of Europe )ల్లోకి దిగజారిపోతాం. ఎందుకంటే ఐరోపాలో కూడా సైంటిఫిక్ రివొల్యూషన్ రాకముందు పవిత్ర గ్రంథాలలోనూ, అరిస్టాటిల్ గ్రంథాలలోనూ చెప్పబడినదంతా సత్యమే అని తలచే scholasticism ఒకటి ఉండింది. కొత్త విషయాలను కనుక్కోవడానికంటే పురాతన గ్రంథాలను వర్ణించడంలో తాత్వీకరించడంలో పండితులు కార్యోన్ముఖులై ఉండేవారు. దీని ఫలితంగా శతాబ్దాల చీకటి, స్తబ్దత అక్కడ రాజ్యమేలింది. ఇదే ధోరణి నేడు మన దేశంలోనూ చూస్తున్నాం- మన బౌద్ధిక తాత్విక సామాజిక స్తరాలలో ఈ ధోరణి ఒక వందా -రెండు వందల సంవత్సరాల పాటు మన దేశంలో కొనసాగితే ఏం జరుగుతుంది?

భారతదేశ ముఖచిత్రమే మారిపోతుంది. హేతుబద్ధత, ప్రశ్నించే తత్వం, ప్రయోగశీలత మరుగునపడి అప్పటికే రాయబడి ఉన్న పురాతన గ్రంథాలను decoding చేసే పని మొదలవుతుంది. ఆవిష్కరణల కంటే వర్ణనలు పెరుగుతాయి. పరిశోధన కంటే భుజకీర్తులు పెరుగుతాయి. సైంటిఫిక్ ల్యాబ్ లకు బదులు గొప్పలుచెప్పుకునే మ్యూజియంలు వెలుస్తాయి. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల భావనా క్షేత్రం తీవ్రంగా నష్టపోతుంది. సైంటిఫిక్ హైపోథెసిస్ లను పరీక్షించడం ఆపేసి హెరిటేజ్ సైన్స్ రూపంలో విద్యార్థులు శ్లోకాలను వల్లించేవారిగా మారుతారు. సైంటిఫిక్ పేపర్లను స్థానంలో పురాతన శాస్త్రాల పునః పరిశీలనలూ, యువకుల మెదళ్ళలో ప్రశ్నలు బదులు పురాణాల కొటేషన్లు మిగులుతాయి. 

బేకన్, గెలిలియో, డెకార్టే వంటి Enlightenment era మేధావులు మన దగ్గర కూడా ఉదయించి సత్యాన్ని కొత్తగా కనుక్కోవాలే కానీ పాతను కొత్తగా వర్ణించడం కాదని చెప్పడం చేస్తే కానీ పరిస్థితులు మారవు. భారతదేశం ఆ ఆధునిక తత్వంతో, ఆ ఆధునికాత్మతో పునఃసంబంధం ఏర్పరచుకోవడమే, ఆధునిక హేతుబద్ధతే ఈ నేల అసలైన హక్కుగా గుర్తించడంలోనే మన విద్యా–సాంస్కృతిక భవిష్యత్తు ఆధారపడి ఉంది . మన సమాజం గొప్ప ఆధునిక నాగరికత విలసిల్లే క్షేత్రంగా మారాలంటే, మరో డార్వినో న్యూటనో అందులోంచి పుట్టుక రావాలంటే ఐరోపా చేసినట్లు కనీసం ఒక రెండువందల యేళ్ళైనా మన సమాజం విజ్ఞానోన్ముఖమై పరుగులెత్తాలి. The recovery of scientific temper in our country, therefore, is not a pedagogic issue but a civilizational necessity.

Highlight any text to reply to that part.

All Replies

No replies yet. Be the first to reply.

Latest Comments

I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026
I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...
R Anand - 01 May 2026

New to Communities?

Join the community