తేదీ: 30-03-25
కవితా శీర్షిక: జవాబు లేని ప్రశ్నలు
వ్రాసిన వారు:
అల్లంశెట్టి శ్రీనివాసరావు (వినిశ్రీ)
ఏ తూటా శబ్దం కన్నవారిని దూరం చేసిందో
ఏ బాంబుల వర్షం నా అన్న వారిని లేకుండా చేసిందో
ఎలా తెలుస్తుంది ఆ బాల్యానికి
భవితను శూన్యం చేసారని కూడా తెలియని పసితనం
ఏ అక్షరాలను దిద్దుకుంటుంది.
గుక్కెడు పాలు కోసం బాల్యం పడుతున్న క్షోభ
రణరంగానికి సిద్ధమైన వారికి తెలిసే అవకాశం ఉంటుందా?
ధరిత్రి నిండా కమ్ముకున్న యుద్ధ మేఘాలు
రేపటి తరానికి ఆశలు లేకుండా చేస్తున్నాయి
ఈ సంఘర్షణల పదఘట్టనలో
మమతల కోవెలకు నెలవైన బాల్యం
మంచి చెడులు ఊసే లేని పసితనం
ఉల్లాసానికి , రోదనకు తేడా లేకుండా పెరుగుతుంది.
అమ్మ చనుబాలు కన్నా
రుధిరం ఆనవాళ్లు ఎక్కువగా స్పర్శించే చేతులు
రేపటి రోజున ఆయుధాలు ధరించడం
ఏ శాంతి పతాకం ఆపగలదు?