మీసాలూ, గడ్డాలూ, దేవుళ్ళు
---------------------------------------
ప్రపంచంలో దాదాపు దేవుళ్ళకు అందరికీ మీసాలూ గడ్డాలూ ఉండవు. దేవుడు ఏడు రోజుల్లో అందరినీ సృష్టించడమే కాకుండా, ఈ ఏడు రోజుల్లో ఏదో ఒక రోజు రేజర్ బ్లేడ్ ని కూడా తప్పక సృష్టించి ఉంటాడు. లేకపోతే డింగుమని ఎప్పుడు ప్రత్యక్షమైనా గడ్డం మీసం నున్నగా కొరిగే ఉంటుంది తప్ప కనీసం మీసం లైన్ కూడా కనిపించదంటే తప్పక దివ్యమైన బ్లేడ్ ఏదో ముందే కనిపెట్టి ఉండాలి.
దేవుళ్ళ విగ్రహాలను మొట్టమొదట శిల్పాలుగా చెక్కినది మాత్రం గ్రీకులే. గ్రీకులతో సమస్య ఏంటంటే వాళ్ళు సౌందర్యారాధకులు. యవ్వన ఆరాధకులు. గొప్ప శిల్పకళను అభ్యసించిన వారు. పైగా సత్యం, సహృదయతా, ఆనందమూ అంతా కూడా యవ్వనంలో అందంలో మాత్రమే వ్యక్తమౌతాయనీ ప్లేటో వంటి మహానుభావుడు సెలవిచ్చాడు. కాబట్టి వాళ్ళు దేవుళ్ళను నిత్య యవ్వనులుగా ఊహించారు. "గ్రీకు శిల్పంలో అందాన్ని అందం కోసమే ప్రేమించారు. భారతీయ శిల్పంలో ఆ అందాన్ని మించిన గంభీరత ఏదో కనిపిస్తుంటుంది" అంటారు జవహర్ లాల్ నెహ్రూ. అందుకే గ్రీకు శిల్పంలో దేవుళ్ళు అందానికి కేరాఫ్ అడ్రస్ లు గా నున్నగా షేవింగ్ చేసుకున్నట్టు ఉండేవారు. Zeus వంటి దేవుళ్ళకి గడ్డం ఉన్నప్పటికీ అది చాలా నీట్ గా ట్రిమ్ చేయబడి ఉంటుంది. ఈ దేవుళ్ళకు స్వర్గంలో బ్యూటీ సెలున్ లు ఏమైనా ఉండేవేమో మనకు తెలియదు.
ఐతే భారతదేశానికి శిల్పకళ గ్రీకునుండే అబ్బింది. గ్రీకుల నుండి బౌద్ధానికి చేరి గాంధార కళగా అభివృద్ధి చెందింది. నాకేమనిపిస్తుందంటే మన దేశ శిల్పకళ గ్రీకు నుండి దిగుమతి కావడం వలననే మనం దేవుళ్ళకు కూడా మీసాలు గడ్డాలు ఉండవేమోనని. అజంతా గుహల్లో బౌద్ధ సన్యాసులు, బ్రహ్మచారులు గీసిన అజంతా స్త్రీలు అందంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచారు. ఏడవ శతాబ్దం వచ్చేసరికి బౌద్ధం క్షీణదశ పొందిందని హుయాన్ త్సాంగ్ పరిశీలన. ఆ తర్వాత ఏడు ఎనిమిదవ శతాబ్దంలోని ఎల్లోరా శిల్పాలు అందులోని కైలాస దేవాలయం, మహాబలిపురం శిల్పాలు ఇవన్నీ అద్భుతమైన శిల్ప సంపదగా గుర్తింపబడ్డాయి. ఎలిఫెంటా గుహల్లో నటరాజ విగ్రహన్ని చూసి ఇ.బి. హావెల్స్, లారెన్స్ బిలియన్ వంటి కళా చరిత్రకారులు ముక్కున వేలేసుకున్నారంటే మన శిల్పకళ గొప్పదనం ఏమిటో మనం తెలుసుకోవాలి.
ఎటొచ్చీ ఈ శిల్పాలకు కూడా మీసాలు గడ్డాలు లేవు. అదీ మనం గమనించ వలసినది. దేవుడు మనిషిని తన లాగా సృష్టించాడా? లేక మనిషే దేవుడిని తనలాగా సృష్టించాడా అన్నది ఇక్కడే తెలిసిపోతుంది. మనిషి తాను కోరుకునే నిత్య యవ్వనత్వాన్నీ నిత్య సౌందర్యాన్నీ తను ఆరాధించే దేవునిలో చూసుకున్నాడు. కార్పోరేట్ కల్చర్ లో కూడా గడ్డం మీసం లేకపోవడమే ఆదర్శం. జీసస్ క్రీస్తు బొమ్మలు గడ్డం తో ఉన్నాయి, కొన్ని గడ్డంమీసం లేకుండా నున్నగా ఉన్నాయి. మధ్య యుగం వరకు జీసస్ బొమ్మలు గడ్డం మీసంతోనే ఉండేవి. ఎప్పుడైతే గ్రీకు తత్వవేత్తల ప్రభావంతో యూరోప్ లో రెనిసా మొదలైందో..జీసస్ కూడా నీట్ గా గడ్డం మీసం లేకుండా కనబడటం మొదలెట్టాడు. ఇప్పటికీ లాటిన్ అమెరికా జీసస్ గడ్డంతో నూ అమెరికా జీసస్ నీట్ షేవ్ తోనూ కన్పించడం వారి వారి సంస్కృతులను గ్రీకుల ప్రభావాలను తెలుపుతుంది. అమెరికా యూరోప్ దేశాలు కార్పోరేటైజేషన్ చెందే కొద్దీ నీట్ షేవ్ జీసస్ కనబడటం ఎక్కువైందనే వాదన ఉంది.
ఐతే మన దేవుళ్ళకు అంతగా బ్యూటీ కాన్షస్ లేదేమో. బొజ్జ గణపయ్య సిక్స్ పాక్ విగ్రహం ఊహించలేం. జటాజూటధారి శివుని తలమీద నీట్ క్రాఫ్ ఊహించలేం. ఆయన కనీసం తలమీద వెంట్రుకలను చేతితో నైనా సరిచేసుకుని ఎరుగడు. బ్యూటీ క్రీంలేవీ లేకుండా బూడిద పూసుకోవడమే. విష్ణు మూర్తి పాలసముద్రంలో హంసతూలికా తల్పం మీద సుఖంగా నిద్రపోవడమే తప్ప స్వీయ అలంకారం తెలియదు. భక్తులకే విసుగొచ్చి ఆయన్ని నిద్రలేపి అలంకారాదులు చేసి మురిసిపోవడం చూస్తుంటాం. ఇక బ్రహ్మసంగతి చెప్పనవసరంలేదు. ఉన్న నాలుగు తలలకూ చాంతాడంత గడ్డాలు. ఎంత పెద్ద గడ్డం ఉంటే అంత మేధావి అనుకునేది మనదేశంలోనే. హనుమంతుడికి భవిష్యత్తు బ్రహ్మ అని ఎందుకన్నారో ఈ పాటికి మీకో అంచనా వచ్చి ఉండాలి.
మొత్తానికి చెప్పొచ్చేదేమంటే beauty consciousness of Greeks విశ్వవ్యాపితమైంది అనేది. ప్లేటో అంతగా మస్తిష్కంలోకి ఎక్కించాడేమో. AI లో దేవుని బొమ్మ అడిగితే గడ్డం మీసం లేకుండా నున్నగా షేవ్ చేసిన బొమ్మల్నే ఇస్తుంది అంటే చివరికి ఈ యవ్వన ఆరాధన ఎంతగా పెరిగిపోయిందో ఓ మాట చెబుదామని.
అదీ మ్యాటర్.