పునాదుల బలం - Myth or reality?
Few thoughts
ఏ దేశపు సంస్కృతీ పునాదులు బలంగా ఉంటాయో ఆ దేశం తనపై దండెత్తి వచ్చిన వారిని సంచలింపజేయడం, తనలో ఇముడ్చుకోవడం జరుగుతుంది అనేది ఒక అవగాహన. సంస్కృతి పునాదులు బలంగా ఉండటం అనేది ఇక్కడ అండర్లైన్.
ఇలా బలీయమైన సంస్కృతి గల దేశాలుగా ఇండియా ఇరాన్ లను ఉదహరిస్తారు జవహార్ లాల్ నెహ్రూ గారు. ఈ రెండు దేశాలు తమపై దండెత్తి వచ్చిన వారిని మానవ ప్రవాహంలా తమలో తమ సంస్కృతిలో భాగంగా చేసుకున్నాయి అంటారు.
నెహ్రూ కాలపు ప్రముఖ చరిత్రకారుడు H.H.డాడ్ వెల్ " ఇండియా" అనే పుస్తకంలో ఏమంటాడంటే, "భయంకర యుద్ధ లక్షణాలు గల తెగలు ఇండియా ఉత్తర మైదానాలపై దండెత్తి, రాజులను ఓడించి, దాని నగరాలను ధ్వంసం చేసి, కొత్త రాజధానులను కొత్త రాజ్యాలను నిర్మించుకుని కూడా ఈ దేశపు మానవ ప్రవాహంలో కలిసిపోయారు. ఆ బయటనుండి వచ్చిన వారు తమ వారసులకు నామ మాత్రంగా ఇవ్వగలిగిన తమ ఆచారాలు కూడా ఈ బలీయమైన సంస్కృతి వాతావరణంలో అవి కేవలం నీడలుగా మిగిలి పోయాయి" అని.
అంటే ఇతర సంస్కృతులను కలుపుకునే గుణం ఈ దేశానికి ఉంది. దేశమంటే మట్టి కాదు కదా!. మనుషులుకదా!. అంటే ఈ దేశపు మనుషుల్లో ఉంది. వారికి ఇది ఎలా అబ్బింది?. ఎవరో బయటనుండి వస్తే ఆహ్వానించే గుణం ఎక్కడి నుండి అబ్బింది. ఈ దేశపు భౌగోళిక పరిస్థితులు, ఇక్కడి వాతావరణం కారణమా?. లేదా, చారిత్రకంగా ఒక దేశంగా రూపు దిద్దుకుంటున్న ఒక శైశవ దశలో ఏదైనా జరిగిందా? అంటే ఏదో ఒక ఏకత్వ ఊహ బలంగా రావటమా లేక ఏదైనా తివ్రమైన జీవితేచ్ఛనా? లేక జీవిత పరమార్థాన్ని గురించిన ఒక తాత్విక దృక్పథమా? భిన్నమైన మానవ పద్ధతులపైన సహనంతో కూడిన గౌరవంతో కూడిన నైతిక సూత్రాలా? ఏకాత్మ భావననా?. ఏంటి?
ఏంటీ ఇలాంటి ఒక గుణం ఈ దేశంలో (అలాగే ఇరాన్ లో) నిజంగా ఉందా? లేక కేవలం మన ఒక ఊహాగానమా? ఒక అతిశయోక్తినా?. ఇలా ఒక దేశమంతా అంటే దేశంలోని ప్రజలంతా ఆలోచించగలగడం నిజంగా సాధ్యమా? ఇది మన స్వీయాతిశయభావననా? ఇటువంటి భావనను ఒక వ్యక్తి కీ , ఒకానొక సిద్ధ జ్ఞానికి, స్థితప్రజ్ఞునికీ కల్పించి చెప్పవచ్చు, కానీ ఒక దేశానికీ ఒక నాగరికతకే ఏకంగా ఇలా సూత్రీకరించవచ్చునా?
"ఏదైతే సంస్కృతి నిరంతరం అన్ని సంస్కృతులనూ కలుపుకుంటుంది" అని అనుకుంటే, అది ఎప్పటికప్పుడు నిరంతరం మారుతూ ఉంటేనే ఇది సాధ్యం ఔతుంది. దీనిని మరో రకంగా చెప్పాలంటే - ఏ సంస్కృతి ఐతే నిరంతరం మారుతూ ఉంటుందో లేదా నిరంతరం మారగలిగే శక్తిని సంతరించుకుంటుందో అదే అన్నింటినీ కలుపుకోగల శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో వివిధ సంస్కృతులు కలిసి పోవడానికి పైన చెప్పిన కారణాలే కాకుండా, ఈ సంస్కృతి నిరంతరం మారుతూ వెళ్ళడం కూడా కారణం. అంటే పరిస్థితులకు అనుగుణంగా మారడం మన దేశానికి ఎందుకనో అబ్బింది.
ఐతే కీత్ ఏమంటాడంటే "ఇండియా దేనినైతే అరువు తెచ్చుకుంటుందో దాన్ని మార్చుకుని తనలో ఐక్యం చేసుకునే విశిష్ట గుణం కలిగి ఉంది" అంటాడు. బయటనుండి అరువు తెచ్చుకున్న దానినే కలిపేసుకోగల శక్తి కలది లోపలే పుట్టిన బౌద్ధాన్ని తనలో కలిపేసుకోలేదా ఈ సంస్కృతి?. ఈ సందర్భంగా బౌద్ధం బలవంతంగా, హింసా పూర్వకంగా ఒక పద్ధతి ప్రకారం అంచెలంచెలుగా నాశనం చేయబడలేదు అంటారు నెహ్రూ. ఐతే హిందూ పాలకులకు బౌద్ధ సన్యాసుల సమూహానికీ స్థానిక రాజకీయ సంఘర్షణలు జరిగాయి కానీ అవి మతపరంగా మతకోణంలో జరిగినవి కావు. బౌద్ధం భారతీయం. బయటిది కాదు పైగా బ్రాహ్మణీయతనూ క్రతువులను కులనిర్మాణాన్నీ అపహసించిన ఉపనిషత్తులతో బౌద్ధం సన్నిహిత సంబంధం కలది. బౌద్ధం తన నైతిక ఆదర్శాలు సురక్షితంగా ఉంచబడినట్లైతే మరి దేనితోనైనా సమాధాన పడటానికి సిద్ధంగా ఉండేది కనుకనే మహాయానం బ్రాహ్మణ మత విధానానికి దగ్గరయింది . ఇండియాలో వెయ్యేళ్ళు సాగిన బౌద్ధం ఒక దశలో , అంటే దాదాపు ఏడవ శతాబ్దం వచ్చేసరికి (హుయాన్ త్సాంగ్ వచ్చే కాలానికి) క్షీణదశకు చేరడమే కాకుండా తాంత్రిక మూఢాచారాలతో ఏది బ్రాహ్మణీయమో ఏది బౌద్ధమో తెలియని ఒక స్థితి ఏర్పడింది. బ్రాహ్మణీయం మాత్రమే బుద్ధుడిని అవతారంగా దేవునిగా చేయలేదు. ఆ పని బౌద్ధం కూడా చేసింది. ఈ స్థితిని శ్రీమతి రైస్ డేవిడ్స్ ఇలా వర్ణించింది. " "లోకాతీత చమత్కారాల తళుకుబెళుకుల క్రింద ఆ మతం స్థాపకుని సరళ ఘన ఆశయాలన్నీ ఊపిరాడక నశించాయి" అని.
ఈ దేశానికి గ్రీకులు, సిథియనులు, శకులు, హూణులు, బాక్ట్రియన్లు పార్శీలూ అఫ్గన్లు తురుష్కులు మొఘలులు ఇలా ఎందరో బయటి వారు(ఇపుడున్న భౌగోళిక సరిసద్దుల పరంగా) వచ్చి కలిసిపోయారు. లోపలివే ఐన బౌద్ధ జైనాలు కూడా ఇదే మానవ ప్రవాహంలో కలిసిపోయారు. ఈ దేశంలో మమేకమవకుండా తనకు తాను ప్రత్యేకంగా నిలబడాలనుకునే ఏ సంస్కృతినైనా ఈ దేశం అంగీకరించదా అనిపిస్తుంది! మన జనజీవితంలో కూడా మనలోనే కొద్దిగా వేరేగా ప్రవర్తించే వారిని accept చేయలేం. మనకు ఏదైనా మనది అనిపించాలేమో. రజినీకాంత్ ని ఓన్ చేసుకున్నంత అమితాబ్ ని చేసుకోలేం. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టులో ఎవరు ఆడినా "మన" వాళ్ళు అయిపోవడం చూస్తుంటాం. ఇది ఒక జాతీయ ఫెనామినాన్. అది మంచయినా చెడ్డయినా సరే మనది ఐవుండాలి అనే ధోరణి. ఇది ఈ దేశ పెక్యూలియర్ గుణమా?. దీని చుట్టూతా కూడా జాతీయవాద రాజకీయాలు నిర్మించబడుతున్నాయేమో. ఆలోచించుదాం.
డిస్కస్ చేయండి.
ఈ నా రాతకు ఆధారం Discovery of India by Jawaharlal Nehru. These are the reflections of thoughts while reading that book.
19/10/2024
విరించి విరివింటి