పిల్లలు - మానసిక హింస.
ఎవరైనా పెద్దవాళ్ళు ఒక సమస్యకు సంబంధించిన ఒత్తిడికి గురైతే వెంటనే వాళ్ళు స్నేహితులతో మాట్లాడటమో లేక బయటకు వెళ్ళి గడపడమో లేక మరేదైనా పని చేయడమో చేయడమో చేస్తారు. పైగా వాళ్ళు ఆ సమస్య పట్ల అభిప్రాయాలను మార్చుకోవడానికి అర్థం చేసుకోవడానికీ అవసరమైన వనరులు చదువూ పరిణతి కూడా ఉంటాయి. కానీ పిల్లలు ఎటు వెళ్ళగలరు. ఎవరితో చెప్పుకోగలరు!?. వారికి అంత చదువు పరిణతి ఎక్కడనుండి వస్తాయి. ఒత్తిడిని మేనేజ్ చేయగల శక్తి వారికెందుకు ఉంటుంది.
పిల్లలు పిల్లలే. కానీ చాలామంది పేరెంట్స్ పెద్దవాళ్ళనుండి ఆశించే సమాధానాలను, పనులను, ఆలోచనలను చిన్నపిల్లలనుండి కూడా ఆశిస్తుండటం చూస్తుంటాం. దీనివలన పిల్లలు తీవ్రమైన వొత్తిడికి లోనౌతారు. పిల్లలను శారీరకంగా, లైంగికంగా హింసించడం ఎంత తప్పో మానసికంగా ఎమోషనల్ గా హింసించడం కూడా తప్పే. చాలామందికి వాళ్ళు పిల్లలపై చేసే ఎమోషనల్ హింస స్వరూప స్వభావాలు ఏంటో తెలియదు. మన సమాజాల్లో ఎమోషనల్ హింస గురించి చర్చలు జరగవు. కోర్టులలో కూడా పిల్లలపై శారీరక లైంగిక హింసలకు శిక్షలు ఉంటాయి కానీ ఎమోషనల్ హింసలకు శిక్షలు ఉండవు.
పిల్లలముందు అసాంఘిక కార్యకలాపాలు చేయడం, డ్రగ్స్ తీసుకోవడం, పోర్నోగ్రఫీ చూడటం, భార్యాభర్తలు ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ గట్టిగా అరుస్తూ చేతులతో కనిపించే వస్తువులతో కొట్టుకోవడం ఎమోషనల్ హింస కిందకు వస్తుంది.
పిల్లలకు డబ్బు విషయాలు ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పి బాధపడటం, వారిచేత బిల్లులను కట్టించడం, న్యాయసంబంధమైన విషయాలు వాళ్ళకు చెప్పడం బాధపడటం అవి చెప్పుకుని ఏడవడం ఆరోగ్య సంబంధమైన విషయాలు చెప్పి ఇబ్బంది పెట్టడం, తమ చావు గురించి పదే పదే ప్రస్తావిస్తూ సింపథీ గెయినింగ్ విధానాలు అవలంబించడం కూడా ఎమోషనల్ అబ్యూజ్ కిందకే వస్తుంది. ఆర్థిక న్యాయ సంబంధ విషయాలు జమా ఖర్చులు వంటివి పిల్లలకు సంబంధించిన సబ్జెక్ట్ లు కాదు. అవి చెప్పడం వారిని అందులో ఇన్వాల్వ్ చేయడం తప్పు. అవి పెద్ద వాళ్ళు చేయవలసిన పనులు.
పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఇంట్లోంచి బయటకు పో అని అరుస్తూ బయటకు పంపడం బయట నిలబెట్టే శిక్షను వేయడం, ఇతరుల ముందు తిట్టడం, ఇతర పిల్లలతో కంపేర్ చేస్తూ మాట్లాడటం..ఏదైనా ఒక పని చేయకపోతే ఇకపై ప్రేమించమని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడం, సొంత పనుల ఒత్తిడి ఉందని వారిపై ప్రేమను చూపించడానికి కనీసం సమయాన్ని కేటాయించకపోవడం, ఇదంతా వారి భవిష్యత్తు గురించే చేస్తున్నామని ఇలా తాము మారడానికి వాళ్ళు పుట్టడమే కారణమనీ వారిముందు మాట్లాడటం కూడా ఎమోషనల్ హింసనే.
మనకు జబర్దస్త్ వంటి షోలలో పిల్లలతో పెద్ద పెద్ద మాటలు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడించడం , అవి విని నవ్వుకోవడం, డబుల్ మీనింగ్ పాటలకు ఐటెం సాంగులకు డాన్సులు చేయించడం ( పిల్లల పాటలు పిల్లల డాన్సులు వేరేగా ఉన్నాయి.. వేరేగా ఉండాలి) పెద్ద వాళ్ళలాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టించడం, ముసలి వాళ్ళలాగా జబ్బున్నవాళ్ళలాగా వేషాలు కట్టించడం కూడా ఎమోషనల్ అబ్యూజ్ కిందకు వస్తుంది. తమ డేటింగ్ కి సంబంధించిన విషయాలు, మన తెలుగు సినిమాలలో చూపించినట్లు వాళ్శ లవర్ కి లవ్ లెటర్స్ పంచేందుకు పిల్లలను రాయబారులుగా చేయడాలు, తమ ప్రేమ పెళ్ళి సెక్స్ వంటి పర్సనల్ విషయాలు చెప్పుకోవడాలు కూడా ఎమోషనల్ అబ్యూజ్ కిందకు వస్తుంది.
ఫిజికల్ సెక్సువల్ అబ్యూస్ ని గుర్తు పట్టినంతగా ఎమోషనల్ అబ్యూస్ ని గుర్తు పట్టడం కష్టం. చాలామంది పేరెంట్స్ అలాంటిదేమీ జరగడం లేదని చెప్పడం బుకాయించడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగినపుడు ఏవో కారణాలు చెప్పి బుకాయించడం ఉంటుంది. దీనికి శిక్ష కూడా లేదు కాబట్టి దీనిని సీరియస్ గా తీసుకోకపోవడం ఉంటుంది. కానీ ఎమోషనల్ అబ్యూజ్ చాలా తీవ్రస్థాయిలోనో మంద్రస్థాయిలోనూ ప్రతిరోజూ ప్రతిఇంట్లో ఉండనే ఉంటుంది. దానిని అర్థం చేసుకుని పిల్లలను పెద్దవాళ్ళలాగా కాకుండా పిల్లల్లాగే పరిగణించి మసలుకోవడం మంచిది.
విరించి విరివింటి .