V
D:

Death Truth and History

Author Name: Virinchi Virivinti
PHILOSOPHY/ WESTERN

Death, Truth and History

ఎవరైనా దగ్గరివారు చనిపోతే..ఆ చివరి యాత్రలో పాల్గొనడం లేదా ఆ ఆఖరి చూపు కార్యక్రమానికి అటెండ్ కమ్మని చెబుతారు. ఎందుకు?. ఎందుకంటే ఆ వ్యక్తి తాలూకు గుర్తులు అన్నీ అమూర్తంగా మనసులోనే ఉండిపోకుండా ఒక్కసారిగా బయటకు వచ్చేస్తే ఆ వ్యక్తి ఆ బాధ నుండి విముక్తుడౌతాడనే ఉద్దేశం. లేకపోతే ఆ అమూర్త భావనలు మరింత బలపడి తీరని దుఃఖాన్ని కలుగజేస్తూనే ఉంటాయి. చనిపోయారనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోవడం సహజమే. ఐతే ఆ వాస్తవాన్ని సింబాలిక్ గా మార్చుకోవడానికి మార్గం ఆ చివరి funeral rites లో పాల్గొనడం. జీవితంలో ప్రతీదీ అంతే...అవతలి వ్యక్తి తనను ప్రేమించడంలేదనే వాస్తవం అమూర్త దశలో ఉన్నప్పుడు దుఃఖం అలాగే ఉండిపోతుంది. ఆ వ్యక్తిని కలవడం ద్వారా కలిసి చివరిసారి బైబై చెప్పుకోవడం ద్వారా ఆ వాస్తవాన్ని ఒక సింబాలిక్ స్థాయికి తీసుకురావడంతో ఆ బాధ తగ్గుతుంది. మానవ సంబంధాలు, అంతా ఈ వాస్తవాలను సింబాలైజేషన్ చేయడంలో ముడిపడి ఉంటాయి. Lacan ఏమంటాడంటే రియాలిటీ స్వతహాగానే సింబాలిక్ దశకు జారిపోవడాన్ని వ్యతిరేకిస్తుంది అని... దీనిగురించి ముందు ముందు చూద్దాం.

ఐతే వాస్తవానికీ, సత్యానికీ తేడాను మనం గ్రహించాలి‌. ఒక వ్యక్తి చనిపోయాడని మనం పేపర్ లోనో టీవీలోనో చూసి నిర్ధారించుకుని ఆ వ్యక్తి చనిపోయాడు అని తెలుసుకుంటాం కదా..అది వాస్తవం. అంటే it's a factual truth. అంటే ఆ వ్యక్తి మరణించకపోయి ఉండవచ్చు. కానీ మరణించాడని పేపర్లలో వార్త ప్రకటించి ఉండవచ్చు‌. కానీ మనకు పేపర్ లేదా టీవీలే ఆధారం కాబట్టి ఆ fact అనేది record ఐంది కాబట్టి ఇది factual truth. . అంటే సత్యం మరోలా అతడు చనిపోకుండా కూడా ఉండవచ్చు‌. Factual truth మనకు భాష ద్వారా ఒక మీడియం(టీవీ /పేపరు) ఆ భాషను ఉపయోగించడం ద్వారా అందుతుంది. అంటే ఫ్యాక్చువల్ ట్రూత్ ని భాషతో నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మైఖేల్ జాక్సన్ చనిపోయినపుడు మొదటి అది టీవీల్లో వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదు. ఇది factual truth. టీవీ ల్లో అలా చెబుతున్నారు. అతడు చనిపోలేదు అతడింకా బ్రతికే ఉన్నాడు అని అతడి విశేషమైన అభిమానులు అనుకున్నారు‌. కోరుకున్నారు.( అందులో నేను ఒకడిని).  ఇది inherently incomplete. ఆ నరేటివ్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. So it never itself becomes complete.  కానీ అది సత్యమే అని తెలియడానికి కొంత సమయం, కొంత మెంటల్ ప్రాసెసింగ్ జరగాల్సి వచ్చింది. Factual truth అనేది ultimate truth గా మారడానికి కొంత సమయం పడుతుంది. Ultimate truth భాషతో నిర్మించవలసిన అవసరం లేదు. అది ఆ వ్యక్తి లేని లోపం తెలియడం వలన లోపల అనుభూతిగా కలుగుతుంది.  ఆ వ్యక్తి లేమిని అనుభూతి చెందడమే ultimate truth.

 

Ultimate truth ని ఆనుభూతి చెందడమే సింబలైజ్ చేయడం‌‌. ఇది నిజంగా జరిగిందని మనసును కుదుటపరచడమే ఆ సింబలైజేషన్. ఆ వ్యక్తి ఒక ఫోటో గానో లేక ఒక పుస్తకంలో అతడిచ్చిన నెమలి ఈక గానో సింబాలిక్ రూపంలోకి మారిపోతాడు. Ultimate truth అనేది మాటలు అవసరం లేని, భాష అవసరం పడని ఒక స్థితి. ఈ స్థితినుండి సోక్రటీస్ మాట్లాడతాను అని సత్యాన్ని మాట్లాడటం మొదలెడితే అదంతా అడ్డం దిడ్డంగా ఉందని( మాటలు అవసరం లెని స్థితి కాబట్టి) ఎవరైతే తమ సత్యాన్ని మాటల్లో పెట్టలేరో వాళ్ళు అబద్ధాలు చెబుతున్నట్టేనని కాబట్టి ఇతడు కూడా అబద్ధాలు చెబుతున్నాడని అతడిని విషమిచ్చి చంపేశారు‌. గ్రీకు లో ఈ రకమైన understanding ఉండింది. ఏంటంటే సత్యం చెప్పేవాడు చాలా స్వచ్ఛమైన భాషతో దానిని వివరించ గలుగుతాడు అని. సోక్రటీస్ అలా వివరించ లేకపోయాడు కనుకనే శిక్ష , సోక్రటీసు తప్పు చేశాడని కాదు. ఐతే ఈరోజుకీ మనకు ఇదే రకమైన understanding ఉంది విచిత్రంగా. 

 

ఈ మధ్య చూస్తుంటాం‌. ఒక అమ్మాయిని ఒకడు రేప్ చేసి వదిలేసి ఉంటాడు. ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి పలానావాడు నా మీద ఇలా చేశాడు అని చెప్పుకుంటుంది. ఐతే వివిధ ఛానెల్స్ విలేఖరులు వివిధ రకాలుగా ఆమెతో ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆమె ఒక్కో చోట ఒక్కొక్క విషయం చెబుతుంది‌. కింద కామెంట్స్ లల్లో కొద్దిగా వల్గర్ భాషలో "ఈ అమ్మాయి పెద్ద ఫ్రాడ్ ..ఒక్కోచోట ఒక్కో మాట చెబుతుంది అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఈమె అబద్ధం చెబుతుందని, అందుకే ఈమెను శిక్షించాలి ముందు" అని కామెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆమె చెప్పే మాటల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది.  మాటలల్లో confusion లేకుండా coherence తో మాట్లాడటాన్ని మనం ఐడియలైజ్ చేశాం‌. గ్రీకులు వలె మనం కూడా ఈనాటికీ అలాగే ఆలోచిస్తుంటాం. ఐతే factual truth కోసం పనిచేసే మన పేపర్ & టీవీ మీడియా ఆమె భాష construction సరిగా లేదనీ..తప్పుల తడకగా ఉందనీ కన్ఫ్యూజన్ గా ఉందని అంటుంది. అర్థం చేసుకోవలసినది ఏంటంటే flaws are a part of ultimate truth. ఎందుకంటే ప్రతీ అంశమూ పూసగుచ్చినట్టు ప్రతి ఛానెల్ లో వివరిస్తుంది అంటే ఆ భాష well constructed. అంటే కావాలని దానిని నిర్మించారు. Well constructed language can give factual truth. But not ultimate truth. సత్యం చాలా నాటుగా, భాషకూడా కలగజేసుకోనంత  అనుభవంగా ఉండిపోతుంది. ఐతే ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా మనం factual truth గురించి ఆలోచిస్తాం. Factual truth బిల్డప్ చేయడానికి ఆమె భాష ఆమె వివరణ ఉపయోగపడతాయి‌. అది ultimate truth కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే సత్యం flaws తో తప్పులతో, భాషతో వాక్యాల నిర్మాణ లోపాలతో కన్ఫ్యూజన్ తో ఉంటుంది. అది ఆమెకి జరిగిన సత్యం. దానిని ఆమె అనుభూతి చెందింది. దానిని భాష రూపంలో వ్యక్తపరచడం ఆమెకి చాలా కష్టతరమైన అంశమైపోతుంది. కాబట్టి what is accepted truth what is real truth  అనేదానికి అంతరం అలాగే శాశ్వతంగా ఉండిపోతుంది. ఇప్పుడు factual truth, ultimate truth అని నేను ఈ వ్యాసం కోసం విభజించి రాస్తున్నాను కానీ, నిజానికి మనం absolute truth అని దేనిని అంటున్నాం. దేనిని absolute truth గా పరిగణలోకి తీసుకుంటున్నాం. పైన ఉదాహరణలో మనం factual truth నే absolute truth గా తీసుకుంటున్నాం. దీనికి ఎప్పటికీ falsifyablity ఉంటుందనేది Karl Popper వాదన. ఇది నిజమే కదా. నాలెడ్జి ని భాష construct చేస్తుంది. ఇదే నిజమనిపించేలా చేస్తుంది. ఇంక ఇది absolute truth ,మార్పు చెందడానికి వీలు లేనటువంటిది అని ఎలా అనగలం. అందుకే దీనికి falsifyablity ఉండాలి. ఐతే ఇక్కడ మరో విచిత్రమైన సమస్య ఏంటంటే ఏ విషయాన్నైతే మనం ultimate truth అంటున్నామో, ఏదైతే అనుభూతి చెందినదై మాటలకు అతీతమైనదై ఉందో అది కూడా నిజం కాకపోవచ్చు. అది కూడా మరో చిత్త భ్రమ అని ఎందుకు అనుకోకూడదు. తన వంటిమీద చీమలు పాకీనట్టు ఒక వ్యక్తి అనుభూతి చెందాడనుకుందాం. అతడు దానిని మాటల్లో వ్యక్తీకరించినప్పుడు factual truth , భాషా నిర్మాణంతో చక్కగా ఉన్నందున మనం దానీని discard చేశామనుకుందాం. కానీ అతడు దానిని అనుభూతి చెందుతాడు కాబట్టి ఇది ultimate truth అనుకుని అక్కడ చీమలు ఉన్నాయేమో నాని వెతకడం మొదలెట్టాను కుందాము ఐతే, ...ఇది కేవలం తన చిత్త భ్రమ ఐవుండే అవకాశం లేదా?. కాబట్టి ultimate truth కూడా falsifyable అవుతుంది.

చరిత్ర విషయానికి వచ్చేసరికి ఇదంతా మరింత జటిలంగా తయారవుతుంది. జరిగిపోయిన ఒక విషయాన్ని మనం ఇదే absolute truth అని ఎలా అనగలం?. అంటే దొరికిన మేరకు ఆధారాల సహాయంతో మనం చరిత్రను construct చేయగలం. ఊహించగలం. వర్తమానం లో మన కంటి ముందు జరిగిన రేప్ వంటి దృగ్విషయమే చాలా వరకు భాషా నిర్మాణానికి తప్పుకీ లోనౌతున్నప్పుడు చరిత్రలో ఎప్పుడో జరిగిపోయిన దానిని  ఇలాగే జరిగిందనీ ఘంటా పథంగా ఎలా చెప్పగలం?. ఉదాహరణకు Archeological Society of India (ASI) కి మొదటి డైరెక్టర్ జనరల్ అయిన "కన్నింగ్హామ్"  హరప్పాలో తవ్వకాలు చేస్తున్న తరుణంలో హరప్పన్ సీలు తన చేతికి వచ్చింది. ఐతే అతడు భారత ఉపఖండాన్ని సందర్శించిన చైనా యాత్రికుల పుస్తకాలను ఆధారంగా చేసుకుని తవ్వకాలను మొదలు పెట్టడంతో ఆ హరప్పన్ సీల్ ని ఆ యాత్రికుల కాల వర్ణనలతో సరిపోయేదిలా ఉండవచ్చనే బయాస్ కు గురైయ్యాడు. ఇండియాకి వచ్చిన చైనా యాత్రికులు ముఖ్యంగా ఫాహియాన్ ఐదో శతాబ్ధం, హుయాన్ త్సాంగ్ హర్షునికాలమైన  ఏడవ శతాబ్దం. కాబట్టి ఈ సీల్ ను అతడు ఏ కాలానిదిగా ఊహించి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ   CE 5 , 7 శతాబ్దాలకు కాలానికి చెందినదిగా ఇక్కడ factual truth నిర్మితమౌతుంది. కానీ తర్వాత ASI director గా వచ్చిన జాన్ మార్షల్ మాత్రమే ఈ సీళ్ళు అంతకంటే పురాతనమైనవని చెప్పాడు. ఇతడే హరప్పన్ సివిలైజేషన్ ని కనుగొన్నామని ప్రపంచానికి ప్రకటించాడు. కన్నింగ్హామ్ కానీ మార్షల్ కానీ చాలా ఉత్సాహవంతులు. తాము ఒక పెద్ద విషయాన్ని కనుగోవటంలో  చాలా ఉత్సాహాన్ని చూపే వ్యక్తులు. ఈ క్రమంలో మార్షల్ archeological mounds పై  తవ్వకాలను జరిపే క్రమాన్ని మార్చి strata లుగా కాకుండా units గా జరిపేవాడు. దానివలన strata లలో ఉండే డాటా మొత్తం పోయేది. అతడి వ్యక్తిత్వం అతడు చేసే పరిశోధన మీద కూడా ఉండింది. ఏదో చిన్న విషయాలు కాకుండా ప్రపంచమంతా అవాక్కయ్యేంత పెద్ద విషయం కనుగొనాలనే ఉత్సాహం త్వరగా conclusions ఏర్పరచుకోవడానికి దారితీసేది. కాబట్టి అతడు ఉపయోగించిన పద్ధతి ఆధారంగా truth ని నిర్మించడం జరిగినప్పుడు ఇదే absolute truth అనేదానికి ఉండదు. ఇతడి తర్వాత ASI డైరెక్టర్ వచ్చే వరకు పరిస్థితి ఈ విధంగా ఉండింది. మిలటరీ బ్రిగేడియర్ గా పనిచేసిన అనుభవం గల R.E.M. WHEELER వచ్చిన తర్వాతనే అతడు military precision తో stratigraphy ని పాటిస్తూ తవ్వకాలను జరిపించాడు. 

ఐతే చారిత్రక సత్యం అనేదంతా దొరికిన facts ఆధారంగా నిర్మితమయ్యేదని అర్థం చేసుకోవాలి. ఇదే absolute truth అనడమే కాకుండా దాని చుట్టూ interpretations చేస్తూ వర్ణనలు కథలు నవలలు వస్తుంటాయి. Any interpretation is very much cleverly constructed one. కాబట్టి అది ఎంతగా flawless గా construct ఔతుందో అంతగా నిజానికి దూరం జరుగుతుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ నాజీలు చేసిన మారణకాండ, concentration camp లు వీటన్నింటి పై నవలలు కథలు వచ్చాయి. Holocaust అనేది నిజం. Concentration camp లలో చనిపోయిన వారికీ అందులో తమవారిని కోల్పోయిన వారికీ అది నిజం. మనిషిలో ఉన్న ఆ క్రూరత ఆ మానవీయత ఇవి Ultimate truths. ఐతే Primo Levi తన కాన్సెన్ట్రేషన్ అనుభవాలను క్రోడీకరించి పుస్తకం రాశారు. ఆయన పుస్తకమే చాలా నవలలకు కొత్త interpretations కీ ఆధారం. ఐతే ఇది ఏమిటి అంటే మిగిలిన వారికి ఒక మరిచిపోలేని అమూర్తంగా ఉండిపోయిన సత్యానికి సంబంధించిన అంశం నవల రూపంలో సింబాలైజ్ ఔతుంది. Holocaust మీద ఎన్ని కథలు నవలలు వస్తాయో ఆ traumatic experience మనకు అంతగా పలుచనవడం మొదలౌతుంది. Truth has a structure of fiction అంటాడు లాకాన్. కాబట్టి తప్పనిసరిగా ఈ సత్యం చుట్టూ ఫిక్షన్ అల్లుకుంటుంది. ఒక వ్యక్తి మెడమీద కత్తి పెట్టి గొంతు కోసేస్తున్నది ఎవరైనా లైవ్ వీడియో చేసి పెడితే లేదా ఎవరైనా ఒక వ్యక్తి నిప్పు అంటుకుని కంటి ముందే కాలిపోవడాన్ని ఒక వీడియో చేసి పెడితే మనం నిజంగా చూడగలమా?. కానీ అదే విషయాన్ని ఫిక్షన్ లో ఒక సినిమాలో చూపితే చూస్తాం. ఆ పని ఒక హీరో చేస్తే మరింతగా చప్పుట్లు కొడతాం. అంటే ఏమి?. Trauma తాలూకు నొప్పిని బాధను ఫిక్షన్ చల్లబరుస్తుంది. నొప్పిని బాధను అది సింబాలైజ్ చేసి అమూర్తంగా భరించలేనిదిగా ఉన్న సత్యాన్ని భరించగలిగేదిగా మారుస్తుంది. ఐతే చరిత్రలో కొన్ని సూత్రాలను దాచి ఉంచాలనే ప్రయత్నాలు అందుకే బెడిసికొడతాయి. మన దేశానికి సంబంధించిన విభజన గాయాలను ఎంతకాలం పాటు దాచిపెడితే అంతకాలం అవి అమూర్తంగా ప్రజల మనో నేత్రంపై భావోద్వేగాలను వెదజల్లుతూ మరింత తీవ్రతరంగా ఉడికి పోతూ ఉంటాయి. వాటిని బయటకు రానివ్వాలి. సినిమాలు నవలలు కథలు ఆ ఆమూర్తత్వాన్ని తొలగించి వాటిని సింబలైజ్ చేయగలిగితేనే వాటి తీవ్రత తగ్గుతుంది. ఐతే సత్యం స్వతహాగానే సింబలైజ్ ఆవడానికీ వ్యతిరేకత చూపిస్తుంది అనుకున్నాం. ఎందుకంటే ఇవి ఏవిధంగా సింబలైజ్ చేసేందుకు ప్రయత్నించినా అవి సంపూర్ణం కావు. అవి కేవలం పాక్షికాలు మాత్రమే. కాబట్టి ఈ సినిమాలు లేదా నవలలు గాయాన్ని తగ్గించడమే కాకుండా వాటికి అవి సత్యాన్ని ఆపే గుణం కలిగినవి కనుక అవి ఎప్పటికీ సంపూర్ణ సత్యాలు కావు. అంటే ఒక సినిమానో లేక నవలనో మొత్తం సత్యాన్ని చెప్పేస్తుంది అనుకోవడం అలాగే ఈ సినిమా లేదా నవల గాయాల్ని మరింత రేపుతుంది అనుకోవడం రెండూ అర్థరహితమే!! ఐతే ఇటువంటి చారిత్రక సాహిత్యం కానీ సినిమా కానీ సివిల్ సొసైటీలో ఒక డిబేట్ ని తప్పక ప్రవేశపెడతాయి. వాటి రోల్ వాటి టార్గెట్ డిబేట్ ని పెంపొందించి దానిని మరింత అర్థం చేసుకునేందుకోసమే అనేది మనం గుర్తించుకోవాలి. 

విరించి విరివింటి
17/11/2024

All Replies

New to Communities?

Join the community