On Yoga.
Introduction:
ఈ మధ్య బాగా mis use అవుతున్న పదాలలో ఇదీ ఒకటి. అందులో రకరకాల యోగా ప్రక్రియలు అందుబాటులోకి వచ్చే సరికి ఎవరు ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నారో అర్థం కాని పరిస్థితి కూడా ఉంది. ఒకరకంగా westerners దీనిని సరైన అర్థంలో - సంగమం అనే అర్థంలో వాడుతూ ఉండటం కనిపిస్తుంది. మనదేశంలో "యోగా" అనే పదాన్ని ఆసనాలు అనేదానికి లేదా యోగాసనాలు అనే పదానికి సమానార్థకంగా వాడటం చూస్తుంటాం. చాలా మంది దృష్టిలో యోగా చేయడం అంటే శరీరాన్ని వంచే ఆసనాలను వేయడమే తప్ప మరేమీ కాదు. భగవద్గీతలో జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు, సన్యాస విభూతి యోగాలూ చెప్పబడ్డాయి. అలాగే సాంఖ్య యోగమూ చెప్పబడింది. ఈ భగవద్గీత సాంఖ్య యోగానికీ సాంఖ్య దర్శనానికీ సంబంధం ఉందా లేదా అనేది తరువాత పరిశీలిద్దాం. ఐతే మంత్ర యోగా, తంత్ర యోగా, లయ యోగా, హఠ యోగా ఇత్యాదివన్నింటినీ కూడా తరువాత పరిశీలించాల్సి ఉంటుంది. ఇన్ని రకాల యోగాలు ఉండగా మనకు యోగా అంటే కేవలం యోగాసనాలు మాత్రమే గుర్తుకు రావడం ఎందుకు జరుగుతుంది. ఇలాంటి పరిణామం మంచిదేనా కాదా అనేదీ చూద్దాం. .
ముఖ్యంగా ఈ పదాలు కలగాపులగం ఐపోవడం ఎపుడు జరుగుతుందంటే మనకు ఒక tradition కొన్ని శతాబ్దాల పాటు ఆగిపోయి ఆ తరువాత మొదలైనపుడు ఆ tradition లోని originality పోయి పైపై పదాలు మాత్రమే మిగలటం జరుగుతుంటుంది. ఈ పదాలను పట్టుకుని ఎవరి ఇష్టమున్న అర్థాలు వాళ్ళు ఇవ్వడమూ జరుగుతుంటుంది. ఇది తప్పని కాదు. కానీ ఇది అలాకాక వేరే విధంగా జరిగే అవకాశం ఉండదు కాబట్టి ఇది ఇలాగే జరగడం కద్దు. ఒక్క యోగానే కాకుండా ఎన్నెన్నో ఇతర విధానాలు కూడా మధ్యలో శతాబ్దాలుగా ఉనికిని కోల్పోయినపుడు తమ ఒరిజినాలిటీ కోల్పోయి వేరే రూపంలో తేలియాడుతూ ఉంటాయి. అవి మరింత వేళ్ళూనుకోవడానికి పునఃప్రారంభం కావడానికి ఒక్కోసారి ఈ superficial అవగాహనలు అవసరం ఔతాయేమో చెప్పలేం. కానీ crippled దశలో మళ్ళీ ప్రారంభం ఐనవి ఒక్కోసారి మరింతగా ఒరిజినాలిటీకి దూరం జరిగి distort రూపంలోకి మారే అవకాశం ఉంటుంది. భారతదేశంలో అలా ఉనికిని కోల్పోయిన వాటిలో అష్టాంగ యోగ మార్గం ఒకటి. ఇపుడది పునఃప్రారంభం ఐనా కేవలం ఆసనాల దగ్గరే యోగా అని పిలవబడటం జరుగుతుంది. దీనికి గల కారణాలు చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు. అష్టాంగ యోగ మార్గాన్ని పరిశీలించి పైన చెప్పిన మిగతా యోగా పద్దతులమీద కొంత దృష్టి సారించడం వరకు మాత్రమే ఇక్కడ చేస్తున్నది.
గతంలో ఒకసారి నేను యోగా మీద ఒక అభిప్రాయం వెలిబుచ్చినపుడు దానిని మరోరకంగా తీసుకున్నవారే ఎక్కువ. కొందరు నేను యోగా అనేదాని గాలి తీసేశాననీ సంతోషపడితే మరికొందరు అదే కారణం వలన బాధపడ్డారు. ఐతే నేను అందులో చెప్పినది పాశ్చాత్య మేధావులు యోగాను ఎలా అర్థం చేసుకుంటున్నారు అని మాత్రమే. మొదటి పేరాలో ఆ విషయం చెప్పి మిగిలిన పేరాలలో అలా రాసుకుంటూ పోవడం వలన అవన్నీ నా భావనలే అని నా మీద కోపాన్ని ప్రదర్శించి వెళ్ళిన వారూ ఉన్నారు. ముఖ్యంగా పాశ్చాత్యుల అవగాహన యోగా విషయంలో కొంత వేరేగా ఉంటుంది. ఒక్కోసారి అక్కడ జనించిన అడ్వాన్స్డ్ సైన్సు కూడా వారిని అలాగా ఆలోచించే విధంగా చేస్తుంది. ఏదైనా ఒక పద్ధతి అభివృద్ధి చెందాలంటే ఆ దేశ కాలమానపు సామాజిక పరిస్థితులూ అందుకు దోహదం చేయాలి అనేది ఒక ప్రాథమిక అవగాహన అనుకుందాం.
అంటే ఇప్పుడు ఆధునిక మెడిసిన్ అభివృద్ధి చెందడానికి అదే సమయంలో అమెరికాలో యూరోప్ లో క్యాపిటలిజం పెరగడానికీ అవినాభావ సంబంధం ఉంది. అసలు పంతొమ్మిదవ శతాబ్దంలో క్యాపిటలిజం అభివృద్ధి చెంది ఉండకపోతే ఈ ఆధునిక మెడిసిన్ కూడా అభివృద్ధి చెందేదే కాదు. అవి రెండూ చేయీ చేయీ కలిసి సాగాయి. అంటే ఇది మంచిదా చెడ్డదా వ్యాపారమా కాదా అనేది పక్కన బెడితే ఇక్కడ చెప్పదలచిన అంశమేమంటే ఏదైనా ఒక పద్ధతి అభివృద్ధి చెందాలంటే ఆ కాలపు సామాజిక ఆర్థిక అంశాలూ కలిసి రావాలి అన్నది ముఖ్యం. పద్ధతులే కాకుండా మనుషుల శరీరంలోని మార్పులూ జన్యువుల మార్పులూ కూడా సామాజికార్థిక అంశాలతో ముడిపడి ఉంటాయన్నది Western వారి అవగాహన. ఉదాహరణకు Thrift Gene hypothesis (1965) అనేది ఏం చెబుతుందంటే ఏయే దేశాలలో లేదా ప్రాంతాలలో కరువు కాటకాలు విపరీతంగా వచ్చేవో ఆయా ప్రాంతాలలోని ప్రజల శరీరంలో కొవ్వును నిలువచేసి ఉంచుకునే గుణం పెరుగుతుంది అని. అంటే సంవత్సరం పొడవునా ఆహారం దొరకదు కాబట్టి ఈ మనుషులలో కొవ్వును నిలువ ఉంచే adipose tissue అధికంగా ఉండేలా జన్యువుల మార్పులు జరుగుతాయి. అంటే ఇది ఒక adaptive mechanism. దానివలన కష్టకాలంలో నిలువ ఉన్న ఈ కొవ్వు వ్యక్తి బతకడానికి కావలసిన శక్తిని అందిస్తూ ఉంటుంది అని. ఈ హైపోథెసిస్ నిజమా కాదా అనేది పక్కన పెడితే అది ఒక హైపోథెసిస్ అనేది అర్థం చేసుకోవాలి.
Hypothesis అంటే ఏమి?. ఇది మరింత లోతుగా అధ్యయనం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ప్రాథమిక అంశం మాత్రమే. అంటే ఇంకా నిరూపితం కాని, నిరూపితం అయ్యేందుకు అవకాశం ఉందేమో అనుకునే ఒక అంశం. Theoryఅలా కాదు. కొన్ని ఆధారాల సహాయంతో నిరూపితమైన విషయాన్ని థియరీ అంటాం కదా!. అలాగే ఈ Thrift Gene hypothesis పై మరింత పరిశోధనలు జరుగుతాయి..జరుగుతుంటాయి. చివరికి ఇది తప్పని తేలవచ్చు కూడా. అసలు ఈ hypothesis రావడానికి కారణం type 2 Diabetes కొన్ని జాతులకు చెందిన వ్యక్తులలో ఎక్కువగా ఉండటం. ఏ జాతుల్లో ఐతే కరువు కాటకాలవలన కొవ్వును నిలువ ఉంచుకునే శక్తి ఎక్కువగా ఉంటుందో ఆ జాతులలో ఈ జబ్బు ఎక్కువగా ఉంటుందన్నది పరిశీలన. ఎందుకంటే ఆ మనుషులలో ఆ adaptive genes అలాగే ఉన్నాయి..కానీ పెరిగిన ఫుడ్ ప్రొడక్షన్ వలన కరువు కాటకాలు లేవు. అంటే విరివిగా ఆహారం లభిస్తోంది. అందువలన అవసరం లేకున్నా ఈ జన్యువులు ఉండటం వలన వీరిలో కొవ్వు పెరుగుతూనే పోయి ఊబకాయం పెరిగి ఆ తరువాత type 2 Diabetes కి దారి తీస్తుందనేది ఈ హైపోథెసిస్. అలా చూసినపుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మిసిసిపీ, లూసియానా రాష్ట్రాలలో ఒబెసిటీ ఎందుకు ఎక్కువగా ఉందనేది చరిత్ర ఆధారంగా చూడవలసిన అంశం.
అదేవిధంగా పాశ్చాత్యులు భారతదేశంలో మొదలైన యోగాను కూడా చూశారు. అది హైపోథెసిస్ మాత్రమే. కరువు కాటకాలను భరించేందుకు తగ్గిన ఆహార నిలువల వలన శక్తి ఖర్చు అయ్యే శారీరక శ్రమ తగ్గించుకోవడం ఒక మార్గం. కఠినమైన ఆహారనియమాలు పాటిస్తూ తక్కువగా తింటూ యౌగిక జీవనాన్ని గడపడం అనేది కేవలం ఊరికే వచ్చిన సూత్రాలు కావు ఆ సామాజికార్థిక పరిస్థితులనుంచి వచ్చినదే అనేది హైపోథెసిస్. దీనిలో నిజమెంత ఉన్నదో మనకు తెలియదు. కాకపోతే ఈ హైపోథెసిస్ లు మరింత లోతుగా కొత్త కోణాల్లో చూసే అవకాశాన్ని కలిగిస్తాయి. రామాయణ భారతాది ఇతిహాసాలకూ అప్పటి జనాభాకు కూడా సంబంధం ఉందనేది ఇండాలజిస్టుల వాదన. అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగిన సమయం ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా కలిగిన సమయమని దాని వలన ఏర్పడిన ఆహార కొరతలే ఈ యుద్ధానికి కారణాలయ్యాయనీ యుద్ధం తప్ప మరో మార్గం శ్రీకృష్ణుడికి కనబడలేదనీ చెబుతారు. చాలా ఇంట్రెస్టింగ్ కథనాలు ఉంటాయి. ఈ దృక్కోణం కలిగి ఉండటం మంచిది కూడా..ఎందుకంటే అది నిజమా కాదా అనే పరిశోధనా జరిగే అవకాశం పెరుగుతుంది. అలాగే యోగా విషయంలో కూడా భారతదేశంలో విపరీతంగా పెరిగిన ఆశ్రమాలూ అందరు యువకులూ సన్యాసాశ్రమం చేబట్టి పని చేయకపోవడం చూసి యోగా అనే కఠిన నియమావళిని ఏర్పరచి స్క్రీనింగ్ చేసే పద్ధతి కనిపెట్టబడిందనీ...బ్రహ్మచర్యాది కఠిన మానసిక నియమాలూ ఆసనాది శారీరక నియమాలూ అందుకే పుట్టుకొచ్చి చాలామంది యువకులను ఈ సన్యాసదీక్షకు దూరంచేసి మామూలు జీవితాన్ని జీవించేలా చేసిందనేది మరో హైపోథెసిస్. ఐతే ఇవేవిధంగా ఉన్నా వాటిని నమ్మినా నమ్మకున్నా నా గత రాతలో వీటిని యోగాపై పాశ్చాత్య భావనలని చెప్పి రాశాను. ఐతే సరిగా చదవకుండా పైపైనే చదివేసి అవన్నీ నా భావనలే అని కష్టపెట్టుకున్నవారికి ఉండే సమస్య వేరే. అది బ్రిటీషు వారు అందించిన పాలనలోంచి పుట్టిన జాతీయతా భావానికి సంబంధించినది. అంతే తప్ప వారి అవగాహన లో లోతు లేదన్నది స్పష్టం. ఐతే అష్టాంగ మార్గంలో పతంజలి మహర్షి చేసిన కృషి అందులో ఏర్పరచిన systematic నియమాలన్నీ అర్థం కావాలంటే ఉపనిషత్తులు అర్థం కావాలి. వేదాల జ్ఞానకాండలో వేదాంతమనబడే ఉపనిషత్తులలో బీజ రూపంలో ఉన్న అంశాలను తీసుకుని ఒక క్రమ పద్ధతి ఏర్పరచి ఎలా దానిని అభివృద్ధి చేశాడో తరువాత భాగంలో చూద్దాం.
విరించి విరివింటి.