Richard Dawkins - selfish gene
An Introductory essay
"ఒక సాలీడు చేసే పని నేతగాడు చేసే పనిలాగే కనిపిస్తుంది. తేనెటీగ తన తేనె తుట్టెను వాస్తు శిల్పి సైతం సిగ్గుపడేలా నిర్మించుకుంటుంది. అయితే అత్యుత్తమ తేనెటీగ కంటే అత్యాధమ వాస్తుశిల్పి సైతం మెరుగేననీ చూపే అంశం ఒకటుంది. వాస్తుశిల్పి వాస్తవంగా తన కట్టడాన్ని నిర్మించడానికి ముందే దాన్ని ఊహా రూపంలో నిర్మిస్తాడు. ప్రతి శ్రమ ప్రక్రియ చివరి కలిగే ఫలితం ప్రారంభంలోనే కార్మికుడి ఊహలో ఉంటుంది".
- పెట్టుబడి గ్రంథం
కార్ల్ మార్క్స్
ప్రముఖ అథీస్ట్, బయాలజీ ప్రొఫెసర్ ఐన రిచర్డ్ డాకిన్స్ రాసిన "Selfish Gene" పుస్తకం మీద రాద్ధామని అనుకున్నాను. సైన్స్ పాపురలైజేషన్ పేరుతో డాకిన్స్ 1974 సమయంలో రాసిన పవిత్రమైన పుస్తకం ఏమిటో తెలుసుకుని తరించవలసిందే! పవిత్రమైన అని ఎందుకు అంటున్నానంటే చాలామందికిది బైబిల్ భగవద్గీత వంటిది కాబట్టి.
ఐతే ఇక్కడ మూడు విషయాలు.
1.రిచర్డ్ డాకిన్స్ సైన్స్ గురించి తప్పులు రాశాడా?. లేక
2.రిచర్డ్ డాకిన్స్ తాను రాసిండేదానిని తప్పుగా అర్థం వచ్చేలా రాశాడా లేక
3.రిచర్డ్ డాకిన్స్ ని జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారా?
ఈ మూడింటిలో ఏది సత్యం. నా దృష్టిలో ఈ మూడూ సత్యాలే అనిపిస్తుంది. మొదటి దానికంటే రెండోది, రెండోదానికంటే మూడోది ఎక్కువ సత్యంగా కొందరు వాదించినా నాకు ఈ మూడూ సమానంగా విలువైన సత్యాలే అనిపిస్తున్నాయి నాకు. ప్రస్తుతానికి. కాదని ఎవరైనా ప్రూవ్ చేయవచ్చు.
ఐతే ఎక్కడినుండి మొదలు పెట్టాలో అర్దం కాలేదు. ఐతే పుస్తకం మొత్తం మీద ఒకే ఆర్టికల్ రాసే బదులు ప్రతీ చాప్టర్ మీద ఒక వ్యాసం రాయవచ్చనిపించింది. అందుకే ఈ ప్రయత్నం.
Why are people - ఇది మొదటి చాప్టర్. ఈ చాప్టర్ లో అతడు మానవ ప్రవర్తనకు సంబంధించిన విషయమై తాను ప్రతిపాదించే argument ని స్పష్టంగా ఉంటంకిస్తాడు. పరిణామ వాద జీవశాస్త్రంలో బయాలజిస్టుల మధ్య ఒక ముఖ్యమైన డిబేట్ ఉంది. ఇది మూడు శతాబ్దాలుగా నలుగుతున్న వాదన. ఏంటి అంటే natural selection జరిగినప్పుడు అది జంతు జాతి మొత్తానికి మేలు చేస్తుందా లేక కేవలం ఒక వ్యక్తి లేదా జంతువుకి మాత్రమే మేలు చేసి తద్వారా అది బతికేందుకు(survival )దోహద పడుతుందా అనేది ఆ ఆర్గ్యుమెంట్. డార్విన్ బతికిన పంతొమ్మిదవ శతాబ్దంలో అది ఒక జాతి లేదా species మొత్తానికి మేలు చేస్తుంది అనుకునేవారు. ఇరవైయవ శతాబ్దం ప్రథమార్థంలో కూడా authors—Konrad Lorenz, Robert Ardrey, and Irenäus Eibl-Eibesfeldt వంటి వారు ఈ వాదనలో ముఖ్యులు. కానీ ఈలోగా జన్యువులపై అవగాహన పెరిగిన తరుణంలో ఇరవైయవ శతాబ్దం ద్వితీయార్థంలో George C Williams , Richard Dawkins వంటి వారు natural selection అనేది gene level లో జీవికి లేదా మానవునికి వ్యక్తిగతంగా మేలు చేస్తుందని gene యే సర్వస్వమన్నట్టు జన్యు కేంద్రక సిద్ధాంతాన్ని చెప్పారు. ఇది పరిణామ వాదన లో paradigm shift వంటిది.
ఐతే ఈ అధ్యాయాన్నే చాలా విచిత్రమైన అతిశయోక్తులతో మొదలుపెడతాడు డాకిన్స్. భూమి మీద జీవితం జ్ఞానవంతంగా కావాలంటే - తమ అస్తిత్వానికి కారణాలు తెలుసుకున్న తర్వాతనే సాధ్యమౌతుంది అనీ.. అంతరిక్షంనుండి ఎవరైనా మనకన్నా ఉన్నతమైన జీవులు కనుక భూమి మీదకు వేస్తే వారు అడిగే మొదటి ప్రశ్న - ఈ భూమి మీద జీవులు evolution గురించి తెలుసుకున్నారా? అనీ అంట. విచిత్రంగా ఉంది కదూ! గ్రహాంతరవాసులు నిజంగానే ఉంటారని నమ్మడమేమౌ ఇది! మనిషి తన చరిత్రలో జీవితానికి అర్థమేంటీ? మనం ఎందుకు పుట్టాం? అసలు మనిషి ఎవరు? వంటి ఫిలాసాఫికల్ ప్రశ్నలు ఎన్నో వేసుకుని ఉన్నాం. ఐతే ఈ ప్రశ్నలకు డార్విన్ కి ముందరికాలంలో వచ్చిన సమాధానాలు నన్నింటిని ఈ పూర్తిగా విస్మరించాలని అంటాడు. డార్విన్ కి ముందర అసలు ప్రపంచంలో జ్ఞానమే ఉదయించలేదనేంత పని చేశాడు డాకిన్స్. Evolutionary biologists మధ్యన ఉన్న మరో ముఖ్యమైన వాదన- natural selection అనేది జీవుల మధ్య అవి బతకడంలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ చాలా క్రూరంగా ఏమాత్రం ములాజాలేకుండా ఉంటుందని ఈ వాదన. "ప్రకృతి యొక్క దంతాలూ, గోర్లు ఎర్రగా ఉన్నాయి"అని 1850 లో బ్రిటిష్ కవి Tennyson రాసిన Memorium అనే ఒక కవితలో వర్ణించిన వర్ణనను ఈ వాదనకు సింబాలిక్ గా తీసుకున్నారు. (ఈ వర్ణన తమ సంస్థలో పనిచేసే వ్యక్తులకు / ఉద్యోగస్తులకు ఉండవలసిన ప్రధాన లక్షణం అని ఒక కార్పోరేట్ సంస్థ చెబుతున్నట్టు ఉంది కదా! దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం). జీన్స్ ని చికాగో రోడ్లమీద గూండాగిరి చేసే gangaters తో పోలుస్తాడు. చాలా బలంగా ఉంటూ, అవకాశం వచ్చినప్పుడల్లా ఏ మాత్రం ముందువెనుకా చూడకుండా తుపాకీ ట్రిగ్గర్ నొక్కుతూ, తనతో వచ్చే వారిని కలుపుకుంటూ పోతే తప్ప చికాగోలో ఒక gangster ఏం విధంగా ఐతే ఎక్కువ కాలం బతకగలుగుతాడో..అదే విధంగా విపరీతమైన పోటి తత్వం ఉన్న ప్రపంచంలో కొన్ని జన్యువులు మిలియన్ల సంవత్సరాలు బతకడానికి ఇటువంటి లక్షణాలే కారణం అంటాడు. ఈ జీన్స్ లో ఉండే selfishness వలననే మనిషి కూడా స్వార్థపరుడిగా ఉంటాడు అంటాడు. ఐతే ఈ స్వార్థపరత్వం నుంచి అప్పుడప్పుడు కొంత బయటకు వచ్చి త్యాగ పూరితంగా, దాతృత్వంతో ఉండటం కూడా స్వార్థంలో భాగమనీ..దానివలననే జన్యువులు కొనసాగుతాయని అంటాడు. అందుకే విశ్వ మానవ ప్రేమ లేదా సౌభ్రాతృత్వం అనేవి పరిణామత్మక కోణంలో ఏ మాత్రం విలువ లేనివి అంటాడు. అంటే మొత్తానికి మన శరీరాలు జీవితాలు మొత్తంగా జన్యువులు తమ స్వార్థం కోసం నిర్మించుకున్నాయనీ మిలియన్ల యేళ్ళ పాటు బతికేందుకు మనుషులను స్వార్థపరులుగా అవసరమైతే కొంతమేరకు త్యాగశీలురుగా తయారు చేశారనీ అంటాడు.
ఒక మనిషి స్వార్థపరుడిగా, లేక త్యాగశీలిగా దాతృత్వంతో దానధర్మాలు చేయడానికి కారణం మన శరీరం లోపల కణంలో, కణ కేంద్రకంలో ఉండే డిఎన్ఎ లో ఉండే జన్యువులా కారణం?. ఇదెలా? . వ్యక్తిలో కనబడే లక్షణాలనూ వ్యక్తిత్వాన్నీ జన్యువులకు కుదించి చెప్పడం genetical reductionism అనిపించుకోదా?. Robert Kuhn (The Structure of Scientific Revolutions) ఏమంటాడంటే ఏదైనా ఒక scientific paradigm shift జరిగినప్పుడు అది అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. దానికి సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇంకా concept పరంగా అనిశ్చితి ఉన్న ఆ సమయంలో ఎవరైనా దానిని స్పష్టంగా విశదీకరించ గలిగితే అది మరింత పాపులర్ ఔతుంది. అని. రిచర్డ్ డాకిన్స్ ని సైన్స్ లో జన్యువులు ఉదయించి అవి అపుడప్పుడే అవగతమవడం మొదలైన ఆ సందర్భంలో అర్థం చేసుకుంటే ఎందుకు ఈ selfish gene theory అంతగా పాపులర్ అయిందనేది అర్థమౌతుంది. అలాగే యూరోప్ లో 1970 లలో కాపిటలిస్ట్ వాతవరణంలో ప్రజ్వరిల్లుతున్న వ్యక్తి వాదం (individualism )స్వార్థం, సహకారం కంటే పోటీతత్వానికి విలువ పెరగడం వంటి సామాజిక భావనలకు ఊతమిచ్చేలా డాకిన్స్ థియరీ ఉందనడంలో సందేహం లేదు.
ఇరవైయవ శతాబ్దం ద్వితీయార్థంలో ఒక ఊపు ఊపిన ఇలాంటి పుస్తకం 40th anniversary జరుపుకుని must read scientific classic అని చెప్పుకుంటున్న ఈ పుస్తకం మనకు తెలుగులో లేకపోవడం, తెలుగు లో ఏ బయాలజిస్టూ దీనిని అనువదించకపోవడం కూడా ఒక లోపం కావడంతో దీనిని ఇంగ్లీషులో చదివిన కొందరు ఇరకాటంలో పడి సొంత కవిత్వం కూడా జతచేసి వివరిస్తుండటం చూస్తుంటాం.
మరిన్ని వ్యాసాలు ఈ పుస్తకం పై రాయబోతున్నాను.
ఇది కేవలం introductory వ్యాసం. నిజానికి మనం సైంటిఫికల్ గా బాగా వెనుకబడిన ఉండటం వలన ఈ పుస్తకంపై డిస్కషన్ మొదలైతే తప్ప ఎంత లోతుగా లేక ఎంత సులభంగా రాయాలనే ది అర్థం కాదనిపించింది. ఐతే ఈ వ్యాసాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అది దీనిపై వచ్చే కామెంట్స్ పరిశీలించిన తర్వాత చేస్తాను.
విరించి విరివింటి
5/11/2024