D
:

ఫేక్ న్యూస్: ఏది నిజం?

Author Name: Devi Polina
SOCIOLOGY/MEDIA AND SOCIAL MEDIA STUDIES

రేపు ప్రళయం రాబోతుంది. ప్రపంచం అంతం అవుతుంది!!!

కొత్త వైరస్.ఈసారి మామిడి పండ్లతో వ్యాప్తి చెందే మహమ్మారి!!!

మీ మతం ప్రమాదంలో ఉంది!!!

ఏలియన్స్ భూమిపై దాడి చేయబోతున్నారా!!!

కిడ్నీలు కొత్తగా తళతళా మెరవాలంటే ఈ జ్యూస్ తాగండి!!!

 

ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచారం గాలికి మించిన వేగంతో పంచబడుతోంది. ఇది ప్రపంచాన్ని మరింత చేరువ చేస్తూనే, మరోవైపు ఓ భారీ సమస్యను తెచ్చింది. అబద్ధపు వార్తలు. నిజానికి విరుద్ధమైన లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నిజమైన వార్తలుగా ప్రచారం చేయటం. సోషల్ మీడియా వేదికలు ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి. ఎవరికైనా తక్షణమే సమాచారం పంచుకునే వీలుండటంతో సెన్సేషనల్ కథనాలు, అబద్ధపు శీర్షికలు కొన్ని గంటల్లోనే లక్షల మందికి చేరుతున్నాయి.

 

ఈ సమస్య మరింత పెరగడానికి మానవ భావోద్వేగాలు, టెక్నాలజీ ప్రధాన కారణాలు. కోపం, భయం, ఆనందం వంటి భావాలు మనపై ప్రభావం చూపితే లేదా ఒకవేళ ఆ కథనం మన అభిప్రాయాలకు అనుకూలంగా ఉంటే,అందులో నిజానిజాలు తెలుసుకోవటానికి ప్రయత్నించకుండా,అది నిజమేనన్న నమ్మకంతో తక్షణమే ఇతరులతో పంచుకోవడం సహజం. అయితే, ఈ నిర్లక్ష్యపు చర్యలు సమాజంపై తీవ్ర ప్రభావాలు చూపుతాయి. అబద్ధపు వార్తలు ప్రజల్లో భయాన్ని కలిగించి, సమాజాన్ని విభజనల వైపు నడిపించే శక్తిగా మారుతాయి. రాజకీయంగా ఇవి ప్రజలను తప్పుదారి పట్టించి, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రభావితం చేయగలవు. కొన్నిసార్లు, అవి హింసను లేదా వివక్షను ప్రేరేపిస్తాయి.

 

హెల్త్ రిలేటెడ్ ఫేక్ న్యూస్ ప్రజల ఆరోగ్యాన్ని ముప్పులో పడేస్తాయి. సోషల్ మీడియాలోని చిట్కాలు మరియు సలహాలు అనుసరించి, డాక్టర్‌ను సంప్రదించకపోవడం లేదా సమయానికి వైద్యం తీసుకోవడం ఆలస్యం చేస్తే, కొన్నిసార్లు తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఆరోగ్య సంబంధిత అబద్ధపు వార్తలను ఇతరులతో పంచడం ద్వారా మన సన్నిహితుల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాం. అందువల్ల, ఆరోగ్యానికి సమాచారం సరిగా పరిశీలించి, వాటిని షేర్ చేసేముందు,పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

 

అబద్ధపు వార్తల వ్యాప్తిని అడ్డుకోవడం మనందరి బాధ్యత. అందుకు,ముందు సమాచారం నిజమా కాదా అనే విషయాన్ని పరిశీలించాలి.విశ్వసనీయ వనరుల ద్వారా సమాచారాన్ని ధృవీకరించాలి. ఫ్యాక్ట్ చెక్ చేయడం అలవాటు చేసుకోవాలి.నిజం కాదని తెలిసిన వార్తలను డిబంక్ చేసి ఇతరులను నమ్మకుండా ఆపాలి.

ఫేక్ న్యూస్ అని ఏ మాత్రం అనుమానం వచ్చినా,పూర్తిగా తెలియకపోయినా షేర్ చెయ్యకండి. బ్రేక్ ద చైన్. ఆ చిన్న చర్యతోనే సమాజానికి పెద్ద మేలు చేస్తారు.ఎమోషనల్ కథనాలపై తక్షణ నిర్ణయం తీసుకోకుండా, ఆతృతకు లోనవకుండా ఆలోచించాలి. ఒక కథనాన్ని పంచేముందు మన చర్యలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

 

అబద్ధపు వార్తల వ్యాప్తి చిన్న సమస్య అనుకోవడం పొరపాటు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద సవాలు. అందరూ తమ బాధ్యతను గుర్తించి, నిజాయితీతో వ్యవహరిస్తేనే ఈ సమస్యను తగ్గించగలుగుతాం.

 A single pause can prevent countless problems. 

Stop the spread,Break the chain,Be the change...

 

 

All Replies

New to Communities?

Join the community