V
H:

Herbert Spencer - A threat to survival of humanity

Author Name: Virinchi Virivinti
SCIENCE/BASIC SCIENCE

ఈ వ్యాసం జనవిజ్ఞానం పత్రికలో ప్రచురితం.

Herbert Spencer - A threat to survival of humanity -


సైన్స్ ఒక మన చుట్టు పక్కల పరుచుకుని ఉన్న చరాచర జగత్తుకి ఒక వివరణాత్మక మోడల్(explanatory model) మాత్రమే, కానీ ఈ ప్రపంచం సైన్స్ ని నిజంగా అంతవరకే చూసిందా. పంతొమ్మిది ఇరవైయవ శతాబ్దాల చరిత్రను చూస్తే మానవులు సైన్స్ ని  చాలా సార్లు దానిని భావజాల ఆయుధం(ideological weapon) గా వాడటం జరిగిందన్న వాస్తవం బయటపడుతుంది. మనుషులలో ఉండే వైషమ్యపూరిత అమానవీయతకు, యుద్ధాలకూ, సంకుచితమైన జాత్యాధిపత్యాలకూ సైంటిఫిక్ ఆవిష్కరణలు జెస్టిఫికేషన్ లా మారాయి. మార్చబడ్డాయి. అది క్రేనియోమెట్రీ( వివిధ మానవ జాతుల కపాలాల సైజులను కొలచడం) తో మొదలుకుని వాలేస్ ఆంథ్రపలాజికల్ లైన్ (Wallace Anthropological line) దాకా ఏదైనా కావచ్చు‌. అందుకే సైన్స్ కొన్ని సమస్యలకు పరిష్కారంగా కనిపించినా దానిలోని క్లిష్టత వలన తనకుతాను ఒక కష్టతరమైన విషయంగా బయటకు వస్తుంది (inherent difficulty). అందుకే ఎవరికైనా సరే ఎంతటివారికైనా సరే సైన్స్ తో వచ్చే సమస్య ఏంటంటే సైంటిఫిక్ వివరణను అపోహలకు తావివ్వకుండా కరెక్ట్ గా సంపూర్ణంగా ఒక క్రమపద్ధతిలో సైన్స్ ని అర్థం చేసుకునే తీరాల్సి రావడం. దానికి నిరంతర అధ్యయనం, కృషి జరుగుతూనే ఉండాలి. లేకపోతే అది చాలా పెద్ద ప్రమాదాన్నే తీసుకుని వస్తుంది. సైన్స్ అధ్యయనం విషయంలో ఇంతటి ఆదర్శాలు ఆదర్శాలు గానే మిగిలిపోయాయి.. ఎంతటి సైంటిఫిక్ థియరీ బయటకు వచ్చినా దానిని ఆ కాలం నాటి మేధావులు తమదైన పద్ధతిలో అరకొరగా అర్థం చేసుకుని విశ్లేషించడం జరుగుతూనే ఉంటుంది. సైన్స్ మేధావులలోనే ఈ వక్ర విశ్లేషణలు జరుగుతున్నప్పుడు సామాన్య ప్రజల్లో అది ఎలా ప్రతిఫలిస్తుందో చెప్పడం కష్టం. ఆ విధంగా ఏదైనా గొప్ప సైంటిఫిక్ థియరీ ఉండి, దానిని తప్పుగా అర్థం చేసుకోవడంతో సమాజానికి పూడ్చుకోలేనంతగా నష్టం జరిగిందా?. అంటే ఔను అది డార్విన్ థియరీనే. డార్విన్ థియరీ తాత్వికంగా ఎంతో ప్రకంపనలను తీసుకువచ్చిన మాట వాస్తవం కానీ దాని తాత్వికతను అర్థం చేసుకునే విషయంలో అవకతవకలకు లోనై డార్విన్ థియరీనీ, తద్వారా సమాజాన్నీ కోలుకోలేని దెబ్బ తీసిందెవరు అంటే 19 వ శతాబ్దపు ఎందరో సైంటిఫిక్ ప్రముఖులు. అందులో ఈ రోజు మనం మాట్లాడుకునే వ్యక్తి  హెర్బర్ట్ స్పెన్సర్. -అతడు డార్విన్ పరిణామ వాదాన్ని కొన్ని 

పరిమితులతో అంగీకరించాడు- డార్విన్ చెప్పిన natural selection and adaptation ను అతడు సమాజానికి అన్వయించడం చేసి survival of the fittest  అన్నాడు.  ప్రచారం చేశాడు. ఒకరకంగా అతడు డార్విన్ థియరీని పాపులరైజ్ చేశాడు. కానీ..అది చేస్తూ... సైన్స్ కీ సైంటిఫిక్ కమ్యూనిటీ కీ, సమాజానికీ, తాత్వికతకూ ఎంతగా డామేజ్ చేయాలో అంతగా డామేజ్ కూడా చేశాడు. 19వ శతాబ్దపు విజయవంతమైన సిద్ధాంతాలన్నీ ఏదో విధంగా మతం, శాస్త్రం, రాజకీయ తత్వాలను ప్రభావితం చేశాయి. డార్విన్ సిద్ధాంతం కూడా అందులో మినహాయింపు కాదు. కాని దీనిని సామాజికపరం చేసి సామాజిక నియంతృత్వాలకు ఊతమిచ్చేలా చేసినది స్పెన్సర్, గాల్టన్ వంటి వారి సామాజిక  వక్రీకరణలు. దీనిని చాలా లోతుగా తరచి చూడవలసిన అవసరం ఉంది. కానీ అంతకు ముందు నేను ఒక ఉదాహరణతో మొదలు పెడతాను.


ఈ మధ్య మనం తరచూ వింటుంటాం, చూస్తుంటాం. ఇంతగా సైన్స్ &టెక్నాలజీ పెరిగినా ఈనాటికీ కొందరు మనుషులు మూఢ నమ్మకాలు నమ్ముతూ, గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు అని కొద్దిపాటి సైన్స్ చదువుకున్నవారు, హేతువాదులూ వాపోతూ ఉంటారు. అంటే వారి ఉద్దేశ్యం ఇంతగా సైన్స్ పరిఢవిల్లిన తర్వాత కూడా ఇంకా మూఢనమ్మకాలు ఎందుకు ఉన్నాయి అంటుంటారు. "మతము లన్నియు మాసిపోవును జ్ఞానమొకటే నిలిచి వెలుగును" అన్న గురజాడ వాక్యాన్ని పదే పదే గుర్తు చేస్తుంటారు. ఐతే ఈ ఆలోచన మనకు హెర్బర్ట్ స్పెన్సర్ అందించిన ఒక తప్పుడు వివరణ ఆధారంగా వచ్చిందని మనం గుర్తించక తప్పదు. స్పెన్సర్ ఏమన్నాడంటే మానవ సమాజాలు మత మూఢనమ్మకాలతో కూడిన ఆటవికత నుండి హేతుబద్ధత శాస్త్ర బద్ధత కలిగిన ఆధునిక సమాజాలుగా పరిణామం చెందుతాయని అతడు ఊహించాడు. అంటే ఒక ఏక రూప మోడల్ లో మానవ సమాజాలు అభివృద్ధి జరుగుతాయని ఆయన ప్రతిపాదించాడు. అంటే ఇది ఒక రకమైన  teleological argument. అంటే దీని ప్రకారం పరిణామం ఒక లక్ష్యంతో కొనసాగుతుందని ప్రతిపాదించడం. జంతు జాలం సరళత నుండి క్లిష్టత వైపు  పరిణామం చెందినట్టు మానవ సమాజాలు కూడా ఆటవికతనుండి హేతుబద్ధత వైపు పరిణామం చెందుతాయనుకోవడం డార్విన్ చేసిన పని సరిగ్గా ఈ లక్ష్యానుగత వాదాన్ని ఖండించడమే. . ఈ మోడల్ వలన మన మానవ సమాజ  తాత్విక సాంస్కృతిక పరిణామం (intellectual and cultural evolution )కూడా  ఒక సరళరేఖలాగా సాగుతుందనే భ్రమ మొదలవుతుంది. ఐతే మనం గమనిస్తే ఇందుకు విరుద్ధంగా మానవ సమాజాలు మార్పు చెందుతుంటాయి. మానవ సమాజానికి ఉత్థాన పతనాలు ఉంటాయి, అప్పుడప్పుడూ పురాతన సంస్కృతుల పునరుద్ధరణ ఉంటుంది, అలాగే మతమూ శాస్త్రీయ విజ్ఞానమూ కూడా కలిసి జీవనం సాగిస్తుంటాయి. స్పెన్సర్ ఊహించినట్టు మూఢనమ్మకాలు రాను రాను కనుమరుగవడం ఏదీ ఉండదు. పాత వాటి స్థానంలో కొత్తవి మొలకెత్తవచ్చు. ఒక నిరంతర చలనశీలత కలిగిన మానవ సమాజానికి ఒక యాంత్రికమైన సామాజిక పరిణామ( social evolution ) వాదంతో స్పెన్సర్ వివరించబూనటమే ఈ అపోహలకు కారణం. లెవీ స్ట్రాస్ ప్రకారం మతాలు సామాజిక అవసరాన్ని బట్టి అడాప్ట్ అవుతుంటాయి.  ఇది  ఆ క్రమంలో అవి మూఢనమ్మకాలనూ కూడా తిరిగి పట్టుక వేళ్ళాడతాయి. పెరుగుతున్న శాస్త్ర సాంకేతికత మూఢనమ్మకలను తొలగించేయాలని అనుకోవడం పూర్తిగా అసంబద్ధం అనీ అవి ఒక సమాజంలో కలిసిమెలిసి పక్కపక్కనే ఉంటాయనీ మనకు అమెరికా , ఇండియాలు నిరూపిస్తున్నాయి కూడా. మైకేల్ ఫూకో అభివ్రుద్ధి అనేది  అధికారంతో నిర్మితమైనది కాబట్టి అది సహజ స్థితి కాదు అంటాడు.


 స్పెన్సర్ ని ఈ విషయం మీద తీవ్రంగా విమర్శించిన వాడు నీషే. సరళరేఖలో మానవ సమాజాల అభివృద్ధిని కాదని నీషే సంస్కృతుల ఉత్థానపతనాలను వివరిస్తాడు. అందుకే విజ్ఞాన శాస్త్రం మత మూఢనమ్మకాలనుండి విముక్తి కలిగిస్తుందనువడం మరో మూఢనమ్మకమౌతుందంటాడు.  మనం మానవ చరిత్రను పరిశీలిస్తే మానవ సమాజాలు నిరంతరం ప్రతీకలను, పురాణాలను మోసుకునే తిరిగాయి. కాబట్టి ప్రస్తుత సమాజంలో మూఢనమ్మకాలు ఉన్నాయని అంటే అక్కడ శాస్త్ర అభివృద్ధి లేదని కాదు.  కానీ స్పెన్సర్ చెప్పినట్లు పోతపోసినట్టుగా ఏకరూప సరళరేఖ మీద మానవ సమాజాలు పరిణామం చెందవని అర్థం. ఇది అర్థం చేసుకోకపోతే సైంటిఫిక్ హేతుబద్ద సమాజమే అసలైన మేధో  పరిణామనీ దానిని సాధించడమే అంతిమ లక్ష్యమనే తప్పుడు ఆదర్శం ఒకటి బయలుదేరుతుంది. 


ఐతే పైన చెప్పినది ప్రమాద రహితమైన ఉదాహరణ. కానీ పంతొమ్మిది ఇరవైయవ శతాబ్దంలో డార్విన్ థియరీ, ఆ తర్వాత వచ్చిన డార్వినిష్టులు, హెర్బర్ట్ స్పెన్సర్, డాల్టన్ వంటి వారు సృష్టించిన సైంటిఫిక్ భీభత్సం చాలా తీవ్రమైనది. హేయమైనది కూడా.  ముఖ్యంగా మనుష్య జాతుల మధ్య హెచ్చు తగ్గులను, యూరోసెంట్రిసిజంను, యుజెనిక్స్ తో పాటు యాంటీ సోషలిజం వైపుకీ, యుథనేసియా, జీనోసైడ్లకు ఊతమిచ్చేలా తయారైంది. సోషలిస్టులు సమానత్వాన్ని ప్రవచిస్తుంటారు. ఇది ప్రకృతి విరుద్ధమైనదనీ కావాలంటే బయాలజీని చుడండనీ చెప్పడం మొదలైంది‌. ఒక రకంగా ఈ శతాబ్దాల క్రిస్టియన్లు  డార్విన్ థియరీ ప్రకంపనలను అది సృష్టించిన అమానవీయతనూ కనులారా చూసినా తర్వాతే వారిలో moral and ethical ప్రశ్నలు ఉదయించి  ఈ థియరీ మనిషికి ఉండే ఆధ్యాత్మిక ఉన్నతిని జంతు స్థాయికి దిగజార్చిందని అందుకే డార్విన్ థియరీని ఖండించి బైబిల్ క్రియేషనిజం మాత్రమే మనుషులను సమానంగా చూడగలదనే నమ్మకంతో యాంటీ డార్విన్ గా మారారని చెప్పవచ్చు. అయితే ఈ కాలపు హేతువాదులు యాంటీ డార్వినిజాన్ని dogma vs science అనే framework లో నుండి మాత్రమే చూడటం తెలిసినవారు. ఒక రకంగా ఈ framework పంతొమ్మిదవ శతాబ్దపు మత వాతావరణాన్ని విమర్శించడానికి పనికి వచ్చిండేదేమోకానీ  ఇరవైయవ శతాబ్దంలో కాథలిక్కుల హ్యూమనిజం డార్వినిజాన్ని కాదనడానికి కారణం జెనెసిస్ మత డోగ్మాటిజం కాదు. వారిలో డార్వినిజంపై వచ్చిన వ్యతిరేకత జ్ఞానసంబంధమైన లేదా మత సంబంధమైన ప్రశ్నగా మొదలు కాలేదు. నైతిక ప్రశ్నగా మొదలైంది. అన్ని నైతిక ప్రశ్నలు కూడా ప్రాక్టికల్ ప్రశ్నలనే విషయాన్ని మనం ఇక్కడ మరవకూడదు. కొందరు క్రిస్టియన్ మేధావులు డార్వినిజం చెప్పే సైంటిఫిక్ వివరణను ఒప్పుకున్నా నైతికంగా అది తీసుకువచ్చే అమానవీయతను ఎదుర్కోవడానికి వేరే మార్గమే లేక మొత్తంగా డార్విన్ థియరీనే వారు ఖండించవలసి వచ్చింది.  కాని తర్వాతికాలంలో  రాజకీయాల వలన యాంటీ డార్వినిజం మతోన్మాదానికి ఊతంగా మారడం మనకు తెలిసిన విషయమే.   


 ఐతే దీనికంతటికీ కారణం జీవ శాస్త్రానికి చెందిన డార్వినిజంని మానవ సమాజానికి అన్వయించాలని హెర్బర్ట్ స్పెన్సర్ చూడటమే. ఒక రకంగా డార్వినే ఈ ధోరణికి ఊతమిచ్చేలా తన పుస్తకాల్లో రాశాడని కూడా మనం గమనించాలి. విక్టోరియన్ యుగానికి చెందిన డార్విన్ లో ఈ రేసిజం తాలూకు ఛాయలున్నాయో లేదో చెప్పలేం కానీ అతడు రాసిన కొన్ని వాక్యాలు ఈ ధోరణిని ప్రతిబింబిస్తుందనే వాదన కూడా ఉంది. " కొన్ని శతాబ్దాల తర్వాత నాగరికత తెలిసిన మానవ జాతులు ఆదిమ జాతులను తుడిచిపెట్టేస్తాయి" అని Descent of Man పుస్తకంలో డార్విన్ అంటాడు. ఇటువంటి ధోరణులే ఆ కాలంనాటి జర్మన్ మేధావులలో విష బీజాలు నాటాయన్నది ఒకరకంగా వాస్తవం. ఒక రకంగా డార్విన్ రాసిన descent of man పుస్తకం scientific racism ని బలపరిచేదిగా తయారైంది. లేదా మనుషులలో కొన్ని జాతులు మిగిలిన జాతుల కంటే ఎక్కువగా పరిణామం చెందాయనే విషయాన్ని ఒప్పుకున్నట్టైంది. "Survival of the fittest" అనే వాక్యం డార్విన్ నిర్మించినది కాదు. అది స్పెన్సర్ నిర్మించినది. తమకు తాముగా బలంగా ఉన్న జాతులు నిలుస్తాయని బలహీనమైన జాతులు అంతరించిపోతాయని సామాజిక పరంగా స్పెన్సర్ ఇచ్చిన వివరణ. స్పెన్సర్ బ్రిటీష్ ఫిలాసఫర్, సోషియాలజిస్టు . బ్రిటన్ ఇండస్ట్రియల్ రివొల్యూషన్ లో ఉత్తమ స్థితికి చేరుకున్న సమయం అది. కొలోనియలిజంలో భాగంగా వివిధ దేశాలను జయించిన బ్రిటీష్ దేశాలు అందులోని మేధావుల్లో జాతీయవాదాన్నే కాక సైన్స్ పేరిట జాతి అహంకారానికి జీవశాస్త్ర సమాధానం స్పెన్సర్ రూపంలో  survival of the fittest రూపంలో దొరికింది. తన పరిణామవాదానికి ఈ వాక్యానికీ సంబంధం లేదని డార్విన్ స్పష్టం గా ఖండించిన దాఖలాలు లేవు. ఖండించకపోగా దానిని అంగీకరించినట్టుగానే పై వాక్యాలు మనకు కనబడుతున్నాయి. Survival of the fittest వాక్యం తన థియరీ జనబాహూళ్యానికి సులువుగా అర్థమయ్యేందుకు ఉపయోగపడుతుందని కూడా డార్విన్ భావించాడు.  మరో కోణం నుండి చూస్తే డార్విన్ థియరీ కూడా సామాజిక వేత్త మాల్థూస్ థియరీ తో ప్రభావితం చెందడం అనేది జంతుజాల  జీవ పరిణామాన్ని  మానవ సమాజాల పరిణామంతో పోల్చటం డార్విన్ నుండే మొదలైందన్న వాదనకు బలాన్నిస్తుంది. తాను మాల్థస్ రాసిన "Essay on the Principle of Population" (1798)తో ప్రభావితం చెందానని డార్వినే స్వయంగా ప్రకటించుకున్నాడు. తద్వారా సామాజిక మార్పులను జీవ శాస్త్రానికి అన్వయించి థియరీని తయారు చేయవచ్చనే సూచనను డార్వినే ఇచ్చాడు. The Threat of Subhuman అనే వ్యాసంలో సమాజంలో క్రిమినల్స్ మానసిక రోగులు ఎక్కువ పిల్లలని కంటారనీ విక్టోరియన్ ఉన్నతవర్గపు ఎడ్యుకేటెడ్ కుటుంబం తక్కువ సంతానాన్ని కంటుందనీ అందుకే ఈ ధోరణి ఉన్నత వర్గాల మనుగడ కష్టమోతుందనీ సూత్రికరించాడు మాల్థస్. "మానవ కణాలు మనుగడ కోసం చాలా వేగంగా బహుసంఖ్యలోకి మారుతాయి" అనే డార్విన్ సూత్రీకరణలో మాల్థస్ ప్రభావం కనిపిస్తుంది. . స్పెన్సర్, డాల్టన్ లు పంతొమ్మిదవ శతాబ్దం చివరికి వచ్చేసరికి  అచ్చం డార్విన్ లాగే జీవశాస్త్ర అంశాన్ని సమాజానికి అన్వయించడం మొదలెట్టారు. అందువల్లే స్పెన్సర్ వలన సోషల్ డార్వినిజం, గాల్టన్ వలన యుజెనిక్సూ మొదలయ్యాయి‌.


ఐతే డార్విన్ పరిణామ వాదం సిద్ధాంతాన్ని survival of the fittest గా ట్విస్ట్ చేసి సోషల్ డార్వినిజంని ప్రతిపాదించినది స్పెన్సరే తప్ప ఇందులో డార్విన్ పాత్ర ఏమీ లేదని ఆధునిక డార్వినిష్టులైన stephen Jay Gould వంటి వారి వాదన. అసలు, social Darwinism అనే పదమే డార్విన్ సిద్ధాంతానికి సంబంధించినదని కాదు, అది స్పెన్సర్, గాల్టన్, మరియు ఇతరులు రూపొందించినది అని డార్విన్ ని సోషల్ డార్వినిజం నిర్వహించిన దౌష్ట్యం నుండి కాపాడే ప్రయత్నం చేస్తాడు గౌల్డ్.  నిజానికి మొదటి డార్వినిష్టుగా డార్విన్ బతికున్న కాలంలోనే డార్వినిజాన్ని భుజానికి ఎత్తుకుని ప్రచారం చేసిన ఎర్నెస్ట్ హెకెల్ ని ఈ ఆధునిక యుగపు డార్వినిష్టులు మొదటి డార్వినిష్టుగా కొంత  క్షమించినా  జాతుల మధ్య హెచ్చు తగ్గులను అసమానతలను స్వయానా డార్వినిజమే సపోర్ట్ చేస్తుందన్నంతగా హెకెల్ రాసిన రాతలు సాగుతాయి. అతడు కాకేసియన్ లను ఉన్నత జాతి మానవులుగానూ ఆఫ్రికన్ లను తక్కువ జాతి మానవులుగానూ వివరిస్తాడు. ఉన్నత జాతి మానవులకు అధమ స్థాయి మానవులకు మధ్య తేడా చాలా ఉంటుందనీ కానీ అధమ స్థాయి మానవులకూ  కోతి చింపాంజీ వంటి ఉన్నతస్థాయి ప్రైమేట్స్ కీ మధ్యన తేడా స్వల్పమేనంటాడు. చూడండి దీనిలో స్పష్టంగా జాతుల మధ్య హెచ్చు తగ్గులున్నాయనే సూచన ఉంది. ఈ సూచన రిచర్డ్ డాకిన్స్ రూపంలో, డిఎన్ఏ కనుక్కున్న వారిలో ఒకడైన జేమ్స్ వాట్సన్ రూపంలో నేటికీ కొనసాగుతోంది. 2011 లో రిచర్డ్ డాకిన్స్ ఏమంటాడంటే - ఆస్ట్రాలోపిథికస్ వంటి మానవ జాతిని జన్యు ఇంజనీరింగ్ ద్వారా బ్రతికించి అది ఏ విధంగా మనుషులకూ కోతులకూ మిస్సింగ్ లింక్ గా ఉందో పరిశీలించాలి అంటాడు. ఇందులో తప్పేమి లేదు కదా అనిపించవచ్చు కానీ గత రెండు శతాబ్దాలుగా సోషల్ డార్వినిజం పేరుతో ఆఫ్రికన్ పిగ్మీ లను మనుషులకూ కోతులకు  మిస్సింగ్ లింక్ గా అభివర్ణించిన ఆకాలపు డార్వినిస్టులకూ, రిచర్డ్ డాకిన్స్ కి తేడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఆస్ట్రాలో పిథికస్ మరలా ఏ జాతుల మధ్య హెచ్చు తగ్గులను సృష్టిస్తుందోననే భయం మొదలవుతుంది.


ఏది ఏమైనా సోషల్ డార్వినిజం డార్విన్ ని సైతం ఇబ్బందుల్లో పెట్టింది. Survival of the fittest  స్పెన్సర్ తో ప్రభావితమైన ఆనాటి సైన్స్ యుజెనిక్స్ అనే కొత్త సైంటిఫిక్ విభాగాన్ని ముందుకు తెచ్చింది. Survival of the fittest theory కి ఇది ప్రాక్టికల్ అప్లికేషన్. డార్విన్ తరువాతి డార్వినిస్టులు తమపై వస్తున్న వ్యతిరేకతకు సమాధానంగా యుజెనిక్స్ ని చూపించడం మొదలుపెట్టారు‌.  బలంగా ఉండే జాతులే నిలబడుతాయి, బలహీనమైనవి నశిస్తాయి కాబట్టి బలంగా ఉండే సమాజాన్ని తయారు చేయాలంటే ఏం చేయాలి? బలమైన జాతుల మనుషుల మధ్యనే సంపర్కం జరగాలి. బలిహీనమైన వారిని అందుకే నాశనం చేస్తే రాబోయే మానవ సమాజాలు గొప్పగా ఉంటాయన్న ఆలోచన మొదలైంది. అమెరికాలో 1921 లో National Congress of Eugenics Meuseum మొదలైంది. అందులో వివిధ జాతులకు చెందిన మనుషుల పిల్లల చిత్రపటాలుంటాయి.ఎవరి మెదడు సైజెంతుందో, ఎవరికి తెలివి ఎక్కువగా ఉందో, ఎవరి అంగ సౌష్టవం ఎలా ఉందో వర్ణిస్తూ చిత్రాలుంటాయి. అవన్నీ కూడా చివరిగా ఇచ్చే సందేశం  బ్లాక్, హిస్పానిక్ , ఏషియన్, మెక్సికన్ లకంటే కాకేసియన్స్  ఉత్తమ జాతికి చెందిన వారని. ఈ మ్యూజియం బయట ఈ యూజెనిక్స్ కి ఆద్యులుగా  ఇద్దరి శిల్పాలు చెక్కబడి ఉంటాయి . ఒకటి డాల్టన్ ది ఐతే రెండవది డార్విన్ ది. డార్విన్ కుమారుడు లియోనార్డ్ తో పాటు గ్రహాంబెల్ వంటి ఎందరెందరో ప్రముఖ సైంటిస్ట్ లు ఈ మ్యూజియం నుండి ఆహ్వానాలు అందుకునే వారు. వీరందరూ తమ జాతులు సంకరం అయిపోతున్నాయి గగ్గోలు పెట్టేవారు. మరో పదేళ్ళకు ఈ పిచ్చి మరింతగా  ముదిరింది. కొంతమంది నల్లజాతివారిని ప్రదర్శనకు పెట్టేవారు‌. హార్మోన్ సమస్య వలన గడ్డం మీసం వచ్చిన ఒక అమ్మాయిని మనుషులకు చింపాంజీలకు మధ్యన మిస్సింగ్ లింక్ గా ప్రదర్శనలో నిలబెట్టారు‌. అక్కడి కోతులకు ఆహారంవేసే "ఒటా బెంగా" అనే ఒక నల్లజాతి పిల్లవాణ్ణి మరో మిస్సింగ్ లింక్ గా ప్రచారం చేశారు. సందర్శకులు అతడిని చూసి నవ్వేవారు. కర్రలతో అతడిని పొడిచి చూసేవారు. ఒకరకంగా ఈ అమానవీయ వాతావరణాన్ని మొదటినుండీ అడ్డుకున్నదీ విమర్శించినదీ కాథలిక్ చర్చినే. మానవ సమాజాలకు మతోన్మాదమే కాదు సైంటిఫిక్ డిటర్మినిజం రూపంలో యుజెనిక్స్ రూపంలో ఉండే సైంటిఫిక్ ఉన్మాదం కూడా ప్రమాదకరమైనదే‌ అనేందుకు ఈ మ్యూజియం ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది. 


ఇరవైయవ శతాబ్దం మొదటి మూడు దశాబ్దాలలో ఈ యుజెనిక్స్ పెద్ద ఉద్యమం లాగా పైకి లేచింది. దీని ప్రభావంతో జాతిని కాపాడాలంటే బలహీనులను దివ్యాంగులనూ పట్టుకుని గంపగుత్తగా స్టెరిలైజేషన్ చేయాలని చట్టాలు చేశారు. అమెరికాలో ముప్పై రెండు రాష్ట్రాలలో దీనిని అమలు చేసారు. కొన్ని వేలమంది బలవంతంగా స్టెరిలైజ్ చేయబడ్డారు. విచిత్రమేమంటే మతఛాందసత్వంతో ఉంటాయనుకునే దక్షిణ రాష్ట్రాలకంటే, సైంటిఫిక్ ,లౌకిక  రాష్ట్రాలనుకునే ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లోనే ఈ యుజెనిక్స్ ప్రభావం కనబడింది. యుజెనిక్స్ డాటా క్లినిక్ లు ఏర్పడ్డాయి. ఈ  అమెరికన్ రాష్ట్రాల పాఠశాలల్లో ప్రతి విద్యార్థీ వంశ వృక్షాన్ని గీయాలి. ఎవరెవరికి ఏయే జబ్బులు ఉండేవో రాయాలి. ఈ డాటాని స్కూళ్ళు గవర్నమెంట్ కి సమర్పించాలి. తద్వారా ఎవరు బలవంతులో ఎవరు బలహీనులో గవర్నమెంట్ అధికారులు నిర్ణయిస్తారు. పెళ్ళి చేసుకోవడానికి కూడా దంపతులు మొదట తమ తమ వంశవృక్షాన్ని, కుటుంబ జబ్బులనూ విధిగా సమర్పించాలి. బలహీనమైన జన్యువులుగల వారు పెళ్లికి అనర్హులు. వివిధ జాతులకు చెందిన వారు పెళ్ళి చేసుకోకూడదు. తెల్లవారు నల్లవాళ్ళ మధ్య పెళ్లిళ్ళు నిషిద్ధం. అలా చేస్తే బలహీన జాతులకు చెందిన జన్యువులు కలిసిపోయి మొత్తంగా జాతి నిర్వీర్యమౌతుంది. నల్లజాతి వారు sub human కాబట్టి వారి ఇమ్మిగ్రేషన్ పై కూడా విపరీతమైన ఆంక్షలను విధించే వారు. నల్లవాళ్ళని ఎక్కువ మందిని దేశంలోకి రానీయడం వలన దేశం బలహీనమౌతుందనే భయం. ఇదంతా ఏ మనువు కాలంలో నో కాదు.ఇవన్నీ సైన్స్ అభివృద్ధి చెందిందనుకుంటున్న ఇరవైయవ శతాబ్దపు పోకడలు. యుథనేసియా కాంపెయిన్ అని దాదాపు 70000మంది శారీరక మానసిక బలహీనులను దివ్యాంగులనూ కాంపుల్లో వేసి చంపేశారు. ఎందుకంటే వీరు పిల్లలను కనడం వలన బలహీన మానవ సమాజం ఏర్పడుతుందనే భ్రమల వలన. ఐతే యుథనేసియా కాంపులో చంపేసిన అనుభవమే తర్వాత హోలోకాస్ట్ కి ఊతమిచ్చిందని .. అంటారు. నాజీయిజానికీ కూడా ఈ జాత్యహంకారాలే మూలమని మనకు తెలుసు. ఎన్ని లక్షల మంది యూదులను నాజీయిజం పొట్టన పెట్టుకున్నదో మనకు తెలుసు. ఈ ఊచకోతకు జీవశాస్త్రం నుండి సపోర్ట్ రావడంలో పంతొమ్మిదవ శతాబ్దంలోని డార్విన్ ఆధారిత  సామాజిక డార్వినిజం- యుజెనిక్స్ ల వాతావరణమే కారణం అనుకోవచ్చు. హిట్లర్ తన ఉన్నతమైన ఆర్యన్ జాతి జీన్ పూల్ ఇతర జాతులతో కలవడం వలన కలుషితమౌతుందని భావించాడు.  


ఆఫ్రికన్ పిగ్మీ లను తక్కువ జాతి మనుషులుగా చూడటం, మతస్థుల పట్ల హేతువాదులు మేధోపరమైన అంటరానితనం పాటించడం రెండూ కూడా స్పెన్సర్ యొక్క సామాజిక డార్వినిజం ఫలితాలే! ఐతే జన్యు ఇంజనీరింగ్ ఆధారంగా పుట్టబోయే బిడ్డ లక్షణాలు నిర్ణయించే దశకు మనం చేరుకుంటున్న కొద్దీ సోషల్ డార్వినిజమూ,  యుజెనిక్సూ రెండూ తిరిగి పునర్జీవం పొందుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ మానవ సమాజాలు వివిధ దేశాల్లో ఎప్పటినుండో సామాజిక హెచ్చు తగ్గులను పాటిస్తూనే ఉన్నాయి. డబ్బు సంపాదన, ఉద్యోగం సంపాదన హోదాసంపాదన, మేథావిత్వం, IQ, అంతా కూడా హెచ్చుతగ్గుల బేరీజు జరిగేలాగే మనం సమాజాలను నిర్మించుకున్నాం. అంటే  మనుషులుగా మనకు ఉండే అనైతికతకు బయాలాజికల్ రూపం ఇచ్చే ఒకానొక వైజ్ఞానిక అంశమే సోషల్ డార్వినిజం. అన్ని రకాల అమానవీయతలను వదిలి సైన్స్ ని మానవీయత వైపు నడపగలిగే మేధావిత్వం, రాజకీయం మనకు ఎప్పటికైనా అందేనా అన్నదే అసలైన ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సైన్స్ & టెక్నాలజీని ఆధారంగా చేసుకుని సామాజిక క్షేత్రంలో కంటే మనిషి లోని కణాలలోపలి విషయాలు అంటే మాలిక్యులార్ బయాలజీ, జెనెటిక్స్ వంటి విషయాల్లో పరిశోధనలు జరుగుతున్న తరుణం ఇది. గమనించి చూస్తే ఈ జన్యు పరిశోధనలను తమ తమ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా వివరిస్తూ తమకు తాము ఎంతో గొప్ప జాతులుగాను మిగితా జాతులు క్రూరమైనవిగానో లేక ఆటవికమైనవిగానో ప్రతిపాదించే కొత్త సూత్రీకరణలు పెరిగిపోతున్నాయి. సైన్స్ పరిశోధనలను వివరణాత్మక విషయాలుగా కాక తమ రాజకీయ లక్ష్యాలను నిర్దేశించే ప్రిస్క్రిప్షన్లుగా వాడుకునే ధోరణులు పెరుగుతున్నాయి. మళ్ళీ మనం అమానవీయత వైపు పయనించే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో సైన్స్ పేరిట జరిగిన దాష్టీకాలను దాచిపెట్టి సమాజాలు సైంటిఫిక్ గా మారడమే అసలైన సామాజిక లక్ష్యమని మాట్లాడే మాటలు మళ్ళీ ఏ ఉపద్రవాన్ని తీసుకువస్తాయో! మనం మతం పట్ల మాత్రమే కాక సైన్స్ పట్ల, దానిని వివరింపబూనే సో కాల్డ్ మేధావుల పట్ల  కూడా జాగరూకతతో ఉండక తప్పదు. Mysnathropy has many faces. అందులో మతోన్మాదమే కాదు విజ్ఞానోన్మాదం కూడా ఉందని గుర్తించక తప్పదు. 


విరించి విరివింటి

All Replies

New to Communities?

Join the community