V
L:

Literature of 30 seconds

Author Name: Virinchi Virivinti
SOCIOLOGY/ ARTS AND LITERATURE

Literature of 30 seconds.

A long essay on short messages.

 

అర్థమయ్యేలా రాయగలగడం ఒక డెమొక్రటిక్ విధానం. అర్థంకాకుండా రాయాలనుకోవడం అనేది పండిత ప్రకర్షలోంచి, ఎక్కువ తక్కువల్లోంచి వచ్చే ఒక ఆధిపత్య భావన. ఒక విషయం అర్థం కావాలంటే దానికి సరైన కంటెంట్ ఉండాలి. దానికి హేతుబద్ధమైన వివరణ ఉండాలి. అర్థమైనపుడే ప్రజలకు ఆ విషయం పట్ల అవగాహన పెరుగుతుంది. అర్థం కావడం ప్రజాస్వామిక అవసరం. అర్థం చేయించడం విద్య యెక్క ప్రధాన లక్ష్యం. ఐతే రాను రానూ ప్రభుత్వాలు, ప్రజలు దీనిని మరచిపోయారు. ఎక్కడైతే ప్రజలలో విషయావగాహన పెరగదో హేతుబద్ధత పెరగదో అక్కడ నిజమైన ప్రజాస్వామ్యం ఉండే అవకాశం లేదు. ప్రజలను మూఢులుగా తాము చెప్పినదానిని మరోమాట లేకుండా ఒప్పుకునేలా చేయగలగడం అధికార కాంక్షకు సామాజిక సింబాలిజమ్.

 

ఎక్కడైతే ఆలోచనలకు బదులు భావోద్వేగాలు ప్రజల మైండ్ (PUBLIC MIND) లోకి చొప్పించబడతాయో అక్కడ ప్రజాస్వామ్యం ఉండటం నిలవడం కష్టమౌతుంది. ప్రాపగాండా అనేది ఆలోచనలను లేకుండా చేయడం వలన సులువుగా సాగుతుంది. కాబట్టి ఇపుడు ప్రజలను ఆలోచన రహితులుగా చేయడమెలా అనేదే ప్రధానమైన సాహిత్యం. ఇదే "ముప్పై సెకనుల సాహిత్యం" లా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలుతున్నది. ఇపుడు రాజకీయ నాయకులను చూస్తే వారు నిజమైన ప్రజల పక్షపాతులుగా ప్రజా సమస్యలను తీర్చే నిఖార్సైన పనిమంతులుగా కనిపించరు. వాళ్ళు ప్రాపగాండా ఆర్టిస్టులుగా కనిపిస్తారు. ప్రజలు ఏది నమ్మాలి ఏది ఇష్టపడాలి అని అతడు అనుకుంటాడో దానిని ప్రాపగాండా చేసే ఆర్టిస్టుగా అతడు ఉంటాడు. అందుకోసమే ఆలోచన కలిగించే సాహిత్యాన్ని తమకు అనుకూలంగా పెద్దగా ఆలోచించనవసరం లేకుండగా మలచుకోవడమే ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులు సాధించగలిగిన ఘన విజయం. 

 

ట్విట్టర్ లు షార్ట్ వీడియోలు ఇతర సోషల్ మీడియాలలో కనబడే చిన్నపాటి రైటప్ లు ప్రజలు ఇచ్చే కామెంట్స్ అన్నీ మూడునాలుగు ముక్కల్లో ఉండాలనే నియమానికి మనమంతా ట్యూన్ చేయబడ్డాం. ఇదే మనలని ఆలోచనా రహితులుగా చేయగలిగేటటువంటి అతి పెద్ద కుట్ర. దీనివలన ఏమౌతుందంటే ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ (ప్రాపగాండాలో భాగంగా) ఫీడ్ చేయబడుతుందో అదే విషయాన్ని అతడు నమ్మడం జరుగుతుంది. నీవు ఒక ఆలోచన చేస్తున్నావంటే ఒక అభిప్రాయానికి వచ్చావంటే ఆ ఆలోచనకు నీవు రావడానికి లేదా ఆ అభాప్రాయానికి నీవు రావడానికి నీకంటూ సొంత హేతుబద్ధత ఉండనవసరం లేదిపుడు. ఎవరో చెప్పారు కనుక నీవు నమ్మితే చాలు. పలానా రంగు గల కూరగాయలు పలానా మతానికి సంబంధించినది అని ఫీడ్ చేస్తే ఔను నిజమే అని నమ్మేంత దారుణ స్థితికి ప్రజలు పడిపోతారు. హీరో వేసుకున్న లోదుస్తుల కలర్ మా మతానికి చెందినది అంటే మా మతాన్ని కావాలని అవమానిస్తున్నారని రాస్తే నిజమేనని నమ్మి ఉద్యమాలు చేసే వారొచ్చేశారు. వీరందరికీ ఆలోచనా సామర్థ్యాలు ఎందుకు పోయుంటాయి?. ఏ మార్పు వీరినాలా చేసింది. సమాధానం ఒకటే షార్ట్ మెసేజింగ్. ముప్ప సెకనుల సాహిత్యం. ఒక గేమ్ లో ఇండియా టీం గెలుస్తుందా ఆస్ట్రేలియా టీం గెలిస్తుందా అని అడిగితే బాగా ఆడే టీం గెలుస్తుంది అని చెప్పాలంటే కొంత హేతుబద్ధతతో కూడిన ఆలోచన అవసరం. లేదు ఇండియా టీమే గెలుస్తుంది అని చెప్పాడనుకోండి. ఎందుకు అని అడిగితే ఇది "నా గట్ ఫీలింగ్" అంటాడు. ఆలోచనల స్థానంలో గట్ ఫీలింగ్ లు వచ్చి కూర్చున్నాయి. ఈ గట్ ఫీలింగ్లు అనబడే భావోద్వేగాలనే ఓటర్లలో రాజకీయ నాయకులు ఆశించేది. భావోద్వేగాలను సృష్టించడం చిటికలో పని . అవి రెడీ మేడ్ దుస్తులవంటివి. ఆలోచనలను కల్పించడమే కష్టం. నూలు వడకడం దగ్గరనుండి మొదలెట్టాలి. 

 

షార్ట్ మెసేజ్ లు షార్ట్ వీడియో లు అలాగే చిన్న వ్యాసాలు రాయండని చెప్పేవారు హక్స్లీ Brave New World propogandists. ఈ రోజు ఆలోచనలమీద వీళ్ళే విజయం సాధించి ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఒక విషయం పట్ల వివరణను ముప్పై సెకండ్లకంటే ఎక్కువ ఇస్తే భరించలేనంత ప్రజలను మేధావులను తయారు చేయడంలో వారు డెఫినెట్ గా విజయం సాధించారు. యాభై పదాలలో విషయం చెప్పగలగాలి. బ్రివిటీ లేకపోతే అతడు మేధావేకాదు. అతడిని చదవనవసరమే లేదనే ధోరణిని ప్రజలలో కలిగించడంలో ఈ ప్రాపగాండిస్టులు విజయం సాధించరు. ఒకప్పటి మతసంబంధ సూత్రాలలా మాత్రమే ఈరోజు మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ రోజు మనం చదువుతున్నది మేధావుల ఆలోచనలను కాదు. వారి స్టేట్మేంట్స్ ని. వారు తమ అభిప్రాయాలను చిన్న పది పదాలలో చెప్పేస్తారు. వారు ఆ అభిప్రాయానికి ఎలా వచ్చారో రాయలంటే వారికి వ్యాసమే రాయాల్సి ఉంటుంది. కానీ ఇపుడు వారు ఆ అభిప్రాయానికి ఎందుకు వచ్చారో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మూడు ముక్కల్లో చెప్పేశారు కాబట్టి ఇంక పనైపోయింది. చదివే పాఠకులకు అవసరం లేదు. మూడు ముక్కలే చాలు. పెద్ద వివరణలు అనవసరం. ప్రజలు పడుకున్నప్పుడు కూడా బ్రేవ్ న్యూ వరల్డ్ ప్రాపగాండిస్టు తన ప్రాపగాండాను చేస్తూనే ఉంటాడు(Hypnopaedia). ఉన్న అధికారాన్ని భజనచేయడానికీ ప్రజలను ఆలోచనారహితులుగా చేయడానికీ వారిని కండీషనింగ్ చేయడానికి హక్స్లీ చెప్పిన ప్రాపగాండిస్టులకి దొరికాన ఆయుధమే literature of 30 seconds. 

 

ఒక వ్యాసం రాయడానికి తన వాదనను చెప్పదలచుకున్న అంశాన్ని చెప్పడానికి రచయితకి చాలా నిజాయితీ అవసరం ఔతాయి. భావోద్వేగాన్ని చెప్పడానికి గట్ ఫీలింగ్ లను చెప్పడానికి అవేమీ అవసరం లేదు కదా. ఎవరూ దేనినీ వివరించనవసరం లేని ఒక వాతావరణాన్ని మొదట సృష్టించడం అనేది జరిగాక కదా ఎవరూ దేనినీ ప్రశ్నించలేని ఆలోచించలేని స్థితికి మనం చేరుకునేది. అందుకే Brave New World ప్రాపగాండిస్టులు గెలిచారు. మనం ఓడిపోతూనే ఉంటాం. 

 

విరించి విరివింటి

1/1/24

All Replies

New to Communities?

Join the community