V
A:

A new species

Author Name: Virinchi Virivinti
EDUCATION / COLLEGE LEVEL

A new species.

 

ఒక్కోసారి యంగ్ జనరేషన్ వాళ్ళతో అంటే 15నుండి 22 సంవత్సరాలు ఉన్న వారితో అంటే "జనరేషన్ z"తో మాట్లాడేటపుడు ఏదో వేరే స్పీసీస్ తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కానీ చాలా ఓపికతో పాటు సరైన అనలైటికల్ దృక్పథం పెంపొందించుకుంటే వారిని అర్థం చేసుకోవడం, వారితో మాట్లాడటం కష్టమేమీకాదు అనిపిస్తుంది. ఇది అవసరం కూడా. 

 

మొన్న ఒక మిత్రుడి కొడుకు 16యేళ్ళ అబ్బాయితో మాట్లాడవలసి వచ్చింది. అతడి పేరు నిఖిల్(మార్చబడినది). కొంతమంది స్నేహితుల ప్రభావం వలన నిఖిల్ కొన్ని పిచ్చిపనులు చేసి చివరికి ఒక చిన్న గొడవ విషయమై పోలీసు స్టేషన్ దాకా పోవలసి వచ్చింది. అది అతడికి చాలా భయంగానూ సిగ్గుగానూ అనిపించింది. ఏదైతేనేం అతడి సమస్యలన్నీ సమసిపోయాక అతడితో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఆ విధంగా కల్పించబడింది. నేను మాట్లాడితే ఐనా నిఖిల్ వింటాడేమో అని నా మిత్రుడి ఆశ. ఐతే చాలా సేపు మాట్లాడుతుండగా నాకు చాలా విషయాలు తట్టినై. ఈ జనరేషన్ జెడ్ పిల్లల ఆలోచనా సరళినే పూర్తిగా భిన్నంగా ఉందనిపించింది. అవన్నీ రాయాలంటే చాలా రాయాలి. లేదా ఒక పుస్తకమే రాయాలి. కానీ ఒకటి రెండు విషయాలకు పరిమితమై మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. చాలామంది తల్లిదండ్రుల సమస్యలు కూడా దాదాపు ఇవే.

 

ముఖ్యంగా స్నేహితుల విషయంలో సెలెక్టివ్ గా ఎందుకు ఉండవని అడిగాను. నేను ఇదే విధంగా ఉంటాను. నేనే కాదు నాతో పాటు ఉన్న మిలేనియల్ జెనరేషన్ (1980 నుండి 1990/ 2000వరకు పుట్టినవారు) అంతా బహుశా ఇంతే అని నా నమ్మకం. నా అనుభవం కూడా. Hi-bye ఐని పలుకరించేవారు ఎందరున్నా (aquintances) స్నేహితులు మాత్రం కొందరే ఉంటారు. కొందరినే తమ స్నేహితులు గా ఎన్నుకోవడం ఉంటుంది. సోషల్ మీడియాలో "Friends" అని కనిపిస్తున్నవారంతా నిజానికి by definition ఫ్రెండ్స్ కాదు. ఆఫీసుల్లో రోజూ పలకరించే వారితో ఒకరకమైన ఆరోగ్యకరమైన అనుబంధం ఉంటుంది తప్ప వాళ్ళను మిలేనియల్స్ "స్నేహితులు" అని డిఫైన్ చేయలేరు. అలాగే ఫేస్బుక్ లో తెలిసిన వారంతా by definition స్నేహితులే అని అనుకోరు. వారిలో కొంతమందిని మాత్రమే తమ స్నేహితులు అనుకుంటారు. అలాగే మిలేనియల్స్ తాము చదివే పుస్తకాల విషయమే కావచ్చు లేదా చూసే సినిమాలే కావొచ్చు చాలా సెలెక్టివ్ గా ఉంటారు. వచ్చిన ప్రతి సినిమా చూసేయాలనే ఆదుర్దా ఏమీ కనిపించదు, సాధారణంగా!(Exceptions everywhere).

 

ఐతే జనరేషన్ జడ్ లో ఇదంతా పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. నేను నీవెందుకు నీ స్నేహితులను చాలా సెలెక్టివ్ గా ఉంచుకోవు అని అడిగినపుడు16 యేళ్ళ నిఖిల్ ఏమన్నాడో చూడండి. "See, Im not hiring them. Why should I be choosy or selective. You talk like business. I want to hangout with those friends that make me feel good.With whom I am having fun."

 

ఇవి పూర్తిగా అతడి మాటలు. మనం ఈ మాటలను డీకోడ్ చేయాలి. చేయకతప్పదు. ఈ వాక్యాలలో మనకు ఆశ్చర్యకరమైన పదాలు/వాక్యాలు కనిపిస్తాయి. 

1. Hiring

2. You talk like business

3. Hangout

4. Feel good 

5. Having fun

 

మనం పదహారేళ్ళ వయసులో ఉన్నపుడు బహుశా ఇలాంటి పదాలను ఊహించి కూడా ఉండిండము. ఈ పదాలన్నీ చాలా కొత్తవి. అంటే చాలా రీసెంట్ గా జనబాహుళ్యంలోకి సాధారణ మాటల్లోకి వచ్చి కలిసినవి. కొత్తగా వచ్చి చేరిన పదాలు కల్చర్ ని డిఫైన్ చేస్తాయి. జీవిత దృక్పథాన్నీ మారుస్తాయి. అనడానికి ఇది ఒక ఉదాహరణ. బహుశా మంచి ఉదాహరణ.

 

 అంటే స్నేహం అనేది ఒక బిజినెస్ సంబంధ అంశంగా మనం చూసి ఉండం. కానీ ఈ జనరేషన్ వాళ్ళు దానిని చూశారు. కనుక వాళ్ళు తాము చేసే స్నేహం బిజినెస్ గా ఉండకూడదని తన స్నేహితుడిని అతడేమీ జాబ్ లో పెట్టుకోలేదని నిఖిల్ నాతో చెప్పదలిచాడు. నేను చెప్పాలనుకున్నది వేరే. ఏ స్నేహమైతే జ్ఞానాన్ని ఆనందాన్ని ఒక ఫుల్ ఫిల్మెంట్ ని ఇస్తుందో ఆ కొంత స్నేహమే మనకు చాలుకదా అనేది నా అవగాహన. నా ప్రశ్నయొక్క అంతరార్థం కూడా అదే. కానీ అది నిఖిల్ కి మరోలా అర్థమైంది. నేనన్నది ,అంటే స్నేహితుల విషయంలో సెలెక్టివ్ గా ఉండమన్నది ఒక బిజినెస్ మోడల్ వంటిదని అతడనుకోవడంతో అతడి రియాక్షన్ డిఫెరెంట్ గా ఉంది. 

 

మనం గమనిస్తే స్నేహమనేదానికి పూర్తిగా అర్థం మారిపోయింది. ముఖ్యంగా ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలు వచ్చాక aquintance కి friend కి మధ్య ఉండే విభజన తగ్గి తనకు సోషల్ మీడియాలో తెలిసినవారంతా స్నేహితులే అనే ధోరణి వచ్చింది. అందుకే వారెవరైనా సరే వారితో కాసేపు లోకాన్ని మరిచి ముచ్చట్లు చెప్పుకోవడం hangout అయింది. ఈ hangout అనే పదం బహుశా మన కాలేజీ రోజుల్లో మనం విని ఉండం. కానీ ఇపుడు పదవతరగతి పిల్లవాడు hangout పదం ఉపయోగించాడు చూడండి. అంటే తెలిసిన కొంతమంది వ్యక్తులతో సరదాగా కాసేపు గడపడం అనే రిచువల్ యే హ్యాంగౌట్ అనీ దానిలో పాల్గొనే ఆ తెలిసినవారే స్నేహితులనే స్పృహ మనవంటి మిలేనియల్స్ లో ఉండిండదు. అంతకు ముందు తరంవారికి అసలే ఉండిండదు. 

 

ఇలా కాసేపు ఫ్రెండ్స్ అనబడేవారితో గడపినపుడు వచ్చే లాభం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అది వచ్చిందికనుక ఆ హ్యాంగౌట్ రిచువల్ కీ ఆ ఫ్రెండ్షిప్ కి ఒక చిన్నపాటి సార్థకతవంటిదేదో వచ్చిందనుకోవడం ఇది. అంటే స్నేహంలో పెద్దగా విషయాలేమీ లేవు. ఆ రిచువల్ వరకు దాని యుటిలిటీ ఉంటే చాలు అన్నది వీరి అవగాహనలా కనిపిస్తుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటేచాలు. సినిమాలలో కూడా ఇదే ట్రెండ్. రోజర్ ఎబర్ట్ , జిజెక్ వంటివారి సినిమా వ్యాసాలు అనాలసిస్ లు ఎన్నో చదివి ఉంటాము. కానీ ఎక్కడా ఫీల్ గుడ్ మూవీ అని ఒక సినిమాను వర్ణించడం కనబడదు. అంటే ఇది చాలా రీసెంట్ గా వచ్చి చేరిన పదం. సీరియస్ సినిమా విమర్శకులకు ఇది over simplified పదంగా కనిపించకమానదు. నా పాయింట్ ఏంటి అంటే ఇది చాలా రీసెంట్ పదం. జనరేషన్ జెడ్ కి చెందిన పదం. సినిమా వరకు ఈ కొత్తతరం విలువలే సినిమా విమర్శలోనూ కనిపిస్తుంటాయి. సీనియర్ రచయితలు కూడా ఫీల్ గుడ్ ఫిలిం అని రాస్తుండటం చూస్తుంటాం. ఇది తప్పని అనడం కాదు. ఫీల్ గుడ్ అనేది సినిమా యుటిలిటీ. ఇదొక యుటిలిటేరియన్ సమాజపు విలువ. సినిమా లో డైరెక్టర్ లేదా రైటర్ చెప్పాలనుకున్న అంశం ఏంటి ప్రెజెంట్ చేసిన విధానం ఏంటి అనేదానికన్నా ఈ సినిమా నన్ను ఏం చేసింది.నాకు చూస్తున్నంత సేపు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని ఇచ్చిందా లేదా అనేది ప్రధానాంశం. సినిమా నన్ను ఏడిపించింది కాబట్టి మంచి సినిమా అని ,లేదా నన్ను విపరీతంగా నవ్వించిందికాబట్టి మంచి సినిమా అనీ చెప్పేవారు కనిపించడం కూడా అందుకే. అందులోని విలువలూ ఆర్ట్ ప్రెజెంటేషన్ ఇవన్నీ అర్థ రహితాలయి లేదా సెకండరీ అంశాలయి నన్నెలా ఊపేసింది నాలో ఎంత పూనకాలు రెకెత్తించింది అనేదే అంశమవడం. ఇదంతా లేటెస్ట్ ట్రెండ్. 

 

నిఖిల్ చెప్పిన ఈ మాటల ఆధారంగా నేను అతడికి స్నేహమంటే మనం సెలెక్టివ్ గా చేసుకునే ఒక వ్యక్తిగత అంశం అని చెప్పలేను. లోపం అతడిలో లేదు. నాలో లేదు. కాలంలోనూ లోపం లేదు. కాలం మారింది. పదాలు మారాయి. విలువలూ యుటిలిటేరియన్ వి అయ్యాయి. అందుకు తగ్గ short term "feel good" , "having fun" rituals వచ్చాయి. ఇంకా మాట్లాడుతుండగా నిఖిల్ ఏమన్నాడో తెలుసా -" I have very good friend with whom I can share anything and everything" అని. మనకు దోస్తానీ అంటే కూర్చుని సొల్లు కబుర్లు గంటలతరబడి చెప్పుకోవడం అనే అవగాహన ఉంది కానీ sharing everything and anything అనే ఐడియా లేదు. ఆ భావన వస్తే ఈ మధ్య వచ్చిండవచ్చు కానీ మనం పదహారేళ్ళ వయసులో ఉన్నపుడైతే లేదు. అంటే ఆ స్నేహానికి ఓ లక్ష్యమంటూ లేదు. అలా ఉంది. కొందరితో అలా కొనసాగుతూ ఉంది. మనకిష్టమైతే కొన్ని చెప్పుకోగలం. కొన్ని చెప్పుకోలేం. చెప్పాలనీ అనుకోం. చెప్పం కూడా. కానీ ఈ sharing everything అనే భావన కొత్తది కదా! స్నేహితుడంటే షేర్ చేసుకోవాలి అని. అది కూడా ఏదైనా. అంటే ఇది పెరుగుతున్న ఒంటరితనాన్ని కూడా సూచిస్తుంది అనుకుంటాను. అసలు పదహారేళ్ళకు అంతగా షేర్ చేసుకోవాల్సినంత everything anything ఏముంటుంది?. చదువుకునే వయసులో చదువు లోకం తప్ప ఇతర విషయాలపై మనసు మళ్ళి అందులోనూ రహస్యాలు ఏర్పడి ఆ రహస్యాలను కూడా పంచుకోతగ్గవి ఏముంటాయి. ఏమో! కానీ ఇవన్నీ అర్థం చేసుకోక తప్పదు. లేకపోతే ఈ జనరేషన్ గ్యాప్ అనేది ఎపుడూ కానంత సమస్యాత్మకంగా ఇపుడయ్యే అవకాశం ఉంది. Technological advancements చాలా వేగంగా జరుగుచుండటంతో చేతిలో సెల్ఫోన్ సోషల్ మీడియాలతో పుట్టే ఈ జనరేషన్ ని వారెదురుకునే నూతన సమాజాన్ని అర్థం చేసుకోకపోతే మనం వాళ్ళతో మాట్లాడానపుడు కొత్త స్పీసీస్ తో మాట్లాడినట్టే ఉంటుంది.

 

డాక్టర్ విరించి విరివింటి

All Replies

New to Communities?

Join the community