Tsundoku -
Tsundoku అని జపనీస్ పదం. పుస్తకాలు కొనడం, కానీ చదవకపోవడం అని దానికి అర్థం.
మన బుక్ ఎక్జిబిషన్లలో ఇసుకరాలనంత జనాల్ని చూసి వారెవా లోకంలో పుస్తకాలు తెగ చదివేస్తున్నారు అని భ్రమపడకూడదు. పుస్తకాలని తెగ కొనేస్తున్నారు అనంకోవచ్చేమో. ఇలా అంటే, అపుడపుడైనా పుస్తకాలు చదివేవారికి కోపమొచ్చినా రావొచ్చు.
Bibliomania అని ఇంకో పదం. Thomas Frognall అనేటాయన రాసిన నవల పేరు. అంటే పుస్తకాల పిచ్చి. ఇది కూడా చదివేందుకు కాదు. కలెక్షన్ పిచ్చి అన్నమాట. గొప్ప అరుదైన పుస్తకాలను కలెక్ట్ చేసి తమ దగ్గర ఉందని చెప్పుకోవడం వంటిది. చదవరు. ఇది స్టాంప్ కలెక్షన్ చేసేవాడు స్టాంపులను వాడుకోడుగా..ఇదీ అలాంటిదే అన్నమాట.
కానీ సుండోకు పరిస్థితి వేరే. అది ఒక గొప్ప యుద్ధ కళ వంటిది. పుస్తకాలు చదవడమంటే భలే ఉబలాంటంగా ఉంటుంది. చదివేస్తాం, పొడిచేస్తాం అన్నట్టు ఉంటారు కానీ చదవరు.
ఇంకొందరుంటారు. తాము ఏ పుస్తకం చదివితే అదే బ్రహ్మాండం అనేలా ఉంటారు. మీరు పలానా పుస్తకం చదివారా అని అడుగుతారు. చదవలేదు అన్నామనుకోండి. అయ్యో..చదవలేదా!!?.. అని కొంపలు మునిగిపోయినట్లుగా ముఖం పెట్టేస్తారు. ఆ పుస్తకం చదవనందుకు మనం ఎంత పాపం చేసేశామో అన్నట్టు చీదరిస్తుంటారు. అసలా పుస్తకం చదవకపోతే జీవితం వ్యర్థం అంటారు. ప్రపంచం మొత్తాన్ని ఆ ఒక్క పుస్తకంలో చెప్పేశారు అంటారు. కానీ ఆ పుస్తకంలో ఏం చెప్పారో చెప్పమంటే చెప్పరు.
"అరే కాదురా భయ్!!. నేను చదివిన పుస్తకంలో ఏముందో నేను నీకు చెబుతా, నీవు చదివిన ఆ పరమోత్తమ పుస్తకంలో ఏముందో నీవు నాకు చెప్పు" అని ప్రాధేయపడ్డామే అనుకో..వాడి బుర్రలో ఉన్న సామాగ్రినేదో మనం దొంగతనం చేస్తున్నామంత ఫీలైపోతారు..."ఊహూ..నేను చెప్పను. నీవే చదివి తెలుసుకోవాలసిందే" అంటుంటారు. అంటే ఎంతో కష్టపడి ఆ పుస్తకాన్ని చదివి అందులోని జ్ఞానాన్ని నేను ఆకళింపు చేసుకున్నాను..నీవు తేరగా వచ్చి అడగగానే నేను నీకు చెప్పేయాలా అన్నట్టు ఉంటుంది పరిస్థితి.
ఎవరు చదివిన పుస్తకాలు వారివే. ఎవరి పఠనానుభవం జ్ఞానానుభవం వాడిదే. జీవితకాలంలో అన్ని పుస్తకాలు చదవం. చదవలేం. కొన్ని పుస్తకాలు చదవలేదని నేనసలు మనిషినే కాదని ఒకాయన నామీదొకప్పుడు డయేరియా చేసుకుని పోయాడు. వెర్బల్ డయేరియాకు మందులు లేవు.
మనకు లైబ్రరీలలో పాపులర్ పుస్తకాలు ఉంటాయి. పాపులర్ పుస్తకాలను జనాభాలో ఎన్నదగ్గ మందే చదివి ఉంటారు. కానీ యాంటీ లైబ్రరీ( Anti-Library) అనే పదం ఒకటుంది. అంటే లైబ్రరీలలో పాపులర్ గా దొరకని పుస్తకాలను చదవడం అన్నమాట. తద్వారా ఈ ఎన్నదగిన చదివే విజ్ఞులకులేని విశిష్టమైన యూనిక్ జ్ఞానాన్ని కలిగి ఉండటం ఇందులో విశేషం. ఇదేదో బాగానే ఉంది కదూ. ఎవరి నాలెడ్జి వారి ప్రాపర్టీ. నేను చదివిన పుస్తకాలు నాకు అందించే జ్ఞానం నాకున్న యూనిక్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ చాలా అరుదైన విషయంగా ఉండాలంటే చాలా అరుదైన పుస్తకాలు ఎవరూ చదివి ఉండని పుస్తకాలు చదవడం. ఇదెలాంటిదంటే అంతకుముందు ఎందరో డాక్టర్లు డయాగ్నాసిస్ చేయని అంశాన్ని ఒక డాక్టర్ డయాగ్నాసిస్ చేసినట్లు అన్నమాట. అదో ఉబ్బిబ్బానందం వంటిది. అలా అని చెప్పి వచ్చిన ప్రతి పనికిమాలిన పుస్తకాన్ని చదవడం కాదు.
ఐతే నాకేమనిపిస్తుందంటే ఒక పుస్తకం పనికిమాలినదా కాదా అని తెలుసుకోవాలంటే అది ఒక్కసారిగా తెలియదు. పదులకొద్దీ వందలకొద్దీ పుస్తకాలు చదవంగా చదవంగా చదవంగా ఏదో ఒకరోజు ఠపీమని జ్ఞానోదయం కలుగుతుంది. ఆరోజునుండి మాత్రమే అసలైన విలువైన పుస్తకాలు చదవడం మొదలౌతుంది. ఆ దశకు చేరాలంటే కనబడిన ప్రతిపుస్తకమూ, చదవాలనుకున్న ప్రతిపుస్తకమూ చదవక తప్పదు. కొందరికి ఈ దశకు చేరేసరికి జీవితకాలం ముగిసేపోతుంది, అది వేరే విషయమనుకోండి!!
కాబచ్చి, బుక్స్ ఎక్జిబిషన్ మొదలైంది కాబచ్చి..ఒకటి గిఫ్ట్ గా ఇచ్చారనో ఒకటి బాగుందన్నారనో ఒకటి బలవంతంగా కొనిపించారనో ఒకటి అట్ట బాగుందనో ఒకటి పాపులర్ అనో అర్థంపర్థంలేక ప్రతిపుస్తకమూ కొనుక్కుని ఇంటికి తెచ్చేసుకున్నాం కాబచ్చి..తెచ్చినవేవో చదవడం మొదలుపెడదాం. ఏమంటారు?.
విరించి విరివింటి