V
:

డార్విన్ థియరీ - కొన్ని ఛాలెంజ్ లు:

Author Name: Virinchi Virivinti
SCIENCE/BASIC SCIENCE

జనవిజ్ఞాన వేదిక వారి సైన్స్ పత్రిక జనవిజ్ఞానం లో ప్రచురితమైన నా వ్యాసం.

పత్రికా యాజమాన్యానికి కృతజ్ఞతలు 🙏.


డార్విన్ థియరీ - కొన్ని ఛాలెంజ్ లు:

-------------------------------------------------


పాశ్చాత్య దేశాల్లో ఈరోజుకీ అగ్గివలె మండుతూన్న తత్వ శాస్త్ర సంబంధ అంశం ఏదైనా ఉంది అంటే అది డార్విన్ థియరీ ఆఫ్ ఇవొల్యూషన్. 1859 లో డార్విన్ రాసిన The Origin of Species పుస్తకం ప్రచురితమైనప్పటి నుండి ఇప్పటి దాకా మతానికీ, సైన్స్ కీ మధ్య ఈ వివాదం ముసురుతూనే ఉంది. డార్విన్ పరిణామ వాదానికి బైబిల్ సృష్టివాదానికి మధ్య పచ్చగడ్డి వేస్తే మండేంత వైరం ప్రస్తుత అమెరికన్ మత రాజకీయాల నేపథ్యంలో రోజురోజుకీ ముదురుతూనే ఉంది. రిపబ్లికన్లు క్రిస్టియన్ మత ప్రాతిపదికన సృష్టి వాదాన్ని అమెరికా లో స్కూళ్ళల్లో కూడా బోధించాలని పట్టుబట్టారు. డార్విన్ పరిణామ వాదాన్ని సిలబస్ నుండి తొలగించాలని కొన్ని రాష్ట్రాల్లో డిమాండ్ కూడా పెరిగింది. అటు యూరోప్ సమాజంలో పరిణామ వాదమే బలంగా ఉన్నా, ఈ మధ్య క్రిస్టియన్ మత వాద సంస్థలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం కూడా మొదలుపెట్టాయి. 


ఫిలాసాఫికల్ గా Darwin theory of Evolution by Natural Selection కి ప్రధానమైన వ్యతిరేకత వచ్చేది బైబిల్ జెనెసిస్ కి సంబంధించిన creationism నుండి. Creationism ప్రకారం ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఆరువేల సంవత్సరాల క్రితం సృష్టించాడనీ అది కూడా ఏడు రోజుల్లో సృష్టించాడని నమ్ముతుంటారు. బైబిల్ లో చెప్పబడిన దానికి భిన్నంగా డార్విన్ పరిణామ వాదం, అంటే సృష్టి అనేది భగవంతుని ద్వారా కాకుండా పరిణామ ప్రక్రియ ద్వారా లక్షల సంవత్సరాలుగా కొనసాగింది అని చెబుతోంది కాబట్టి creationists డార్విన్ పరిణామ థియరీని ఒప్పుకోరు. ఈ విషయంలో వాళ్ళు చాలా స్పష్టంగా ఉంటారు. వాళ్ళు బైబిల్ లో చెప్పినట్లు కాకుండా మరే విధంగా సృష్టిని వివరించినా దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. వాళ్ళ జీవితాలంతా మతంతో, బైబిల్ సూక్తులతో, బైబిల్ ఆలోచనలతో నిండి ఉంటాయి. సైన్స్ లో వస్తున్న నూతన ఆవిష్కరణల గురించి కానీ, లేక ఆలోచనల గురించి కానీ , థియరీల గురించి గానీ వారికి ఏమాత్రం స్పృహ ఉండదు. వాళ్ళు అదంతా తమకు అనవసరం అనుకుంటారు. సైంటిఫిక్ డాటాను అల్టిమేట్ అథారిటీ గా వాళ్ళు భావించరు. అంగీకరించరు. బైబిలే అల్టిమేట్ అథారిటీ అనుకుంటారు. "జీవ పరిణామం జరిగిందని సైన్సు లో ఎన్నో ఆధారాలున్నాయి" అని మనం వారితో చెబితే... సైన్స్ ఇంకా అక్కడే ఉంది మరికొంతకాలం ప్రయత్నిస్తే గానీ బైబిల్ లో చెప్పినట్టు దేవుడే సృష్టించాడన్న జ్ఞానానికి సైంటిస్ట్ లు రాలేరు అని చెప్పేస్తారు అలవోకగా. బైబిల్ చెప్పబడిన అద్భుత విషయాలను అందుకోవడానికి సైన్స్ కి ఇంకా చాలా సమయం పడుతుందనేది వారి ప్రగాఢ విశ్వాసం. అంటే ఒకరకంగా creationists అనబడే వారు గుడ్డిగా బైబిల్ ను నమ్మేవారు అనుకోవచ్చు. డార్విన్ పరిణామ థియరీ నాస్తికత్వాన్ని ప్రోత్సహిస్తుందనీ, తద్వారా సమాజంలో పాపాలూ, అశాంతి పెరిగిపోతాయనీ, ఇది దైవ వ్యతిరేకతకు దారి తీస్తుందనీ బైబిల్ వాదుల అవగాహన.


ఐతే గమనించి చూస్తే ఇటువంటి వాళ్ళు సామాజికంగా వైజ్ఞానికంగా మిగతా సమాజంతో వేరుపడి ఉంటారు అనేది స్పష్టమౌతుంది. అంటే క్రియేషనిష్టులు వారిదైన ఒక లోకంలో ఉండిపోతుంటారు. వీళ్ళు తమ బోధనలద్వారా క్రియేషనిజంని ప్రచారం చేస్తూ దేవుని ఘనకీర్తులను స్తుతిస్తు ఉంటారు . ఐతే సైంటిఫిక్ కమ్యూనిటీ దశాబ్దాల తరబడి ఈ క్రియేషనిస్టులతో వాదోపవాదాలు చేసింది. వారితో కమ్యునికేట్ చేసేందుకు కృషి చేసింది. వారిని మార్చేందుకు సత్యం వారికి తెలిపేందుకు కష్టపడింది. ఈ క్రియేషనిష్టులకు ఏ విధంగా చెబితే డార్విన్ పరిణామ వాదం అర్థమౌతుందని అది తర్జన భర్జనలు పడింది. డిబేట్ లు కొనసాగాయి. ఈ కృషి ఫలితంగా వీరు సైంటిఫిక్ గా ఏమైనా పురోగమించారా అంటే...క్రియేషనిజం ని "క్రియేషన్ సైన్స్" అని పేరు మార్చుకోవడం తప్ప పెద్దగా చేసిండేదేమీ లేదు. ఈ మధ్య దీనికి intelligent design (ID) అని పేరు కూడా మార్చుకున్నారు తప్ప మత గ్రంథంలో చెప్పబడినదానికి వ్యతిరేక వివరణను వారెప్పుడూ ఆహ్వానించ లేదు‌. మొట్టమొదటగా వాళ్ళు బైబిల్ కి భిన్నమైన ఆలోచనలను కనీసం వినడానికి కూడా ఇష్టపడరు, కాబట్టి పరిణామ వాదమే సత్యమని వారితో వాదించి నిరూపించడం అనేది వృథా ప్రయాస. 


బైబిలూ, బైబిల్ చుట్టూతా ఉండే మత నమ్మకాలు వాటితో కూడిన రాజకీయాలు, అధికార కాంక్షలూ మాత్రమే డార్విన్ పరిణామ వాద వ్యతిరేకతకు ముఖ్య కారణాలు అని మనం అర్థం చేసుకుంటే, అది పూర్తి స్థాయి గుడ్డి డోగ్మాటిజమనీ, చర్చలకు ఋజువులకీ లొంగరనీ అర్థం చేసుకుంటే, సైన్స్ ప్రమొటర్స్ వీరితో డిబేట్లవలన అణుమాత్రం ఉపయోగం లేదని తెలుసుకుంటారు. ఐతే మరి డిబేట్ చేయవలసినది ఎవరితో?. సగం సగం తెలిసి, మత భావనల విష కౌగిట్లోకి వెళ్ళిపోతున్న సైన్స్ విద్యార్థులతో అనేది స్పష్టమౌతుంది. ఐతే బైబిల్ ప్రభావం పెద్దగా లేని మన భారతదేశంలో కూడా డార్విన్ సిద్ధాంతానికి ఎందుకు వ్యతిరేకత ఉందనేది చాలా ఆసక్తికరమైన విషయం. క్రియేషనిస్టులు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమ ప్రభావం భారతదేశం మీద కూడా పడిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికా క్రియేషనిస్టుల ప్రభావం యూరోప్ మీద పడవచ్చు కానీ ఇండియా మీద పడుతుందనుకోలేం. ఐనా ఇంటర్నెట్ లో అక్కడా ఇక్కడా hen picking గా క్రియేషనిస్టుల రాతలు చదివి ఎవరైనా ప్రభావం చెంది డార్విన్ థియరీ తప్పు అని వాదించ వచ్చు కానీ అటువంటి వారికి సైన్స్ కీ మతానికీ మధ్య West లో జరిగిన జరుగుతున్న తాత్విక యుద్ధం గురించి తెలిసే అవకాశం లేదు. అక్కడ వెస్ట్ లో సృష్టి వాదం అధికార రాజకీయ శక్తుల తొత్తు కాబట్టే అక్కడ మనుగడ సాగిస్తోందని తెలియదు. అధికారిక తాత్వికతకు వ్యతిరేకంగా ప్రజల్లోంచి పుట్టుకొచ్చే చైతన్యానికి పెద్దపీట వేసే మన భారతీయులం తాత్వికంగా చార్వాక, లోకాయత, సాంఖ్య, వంటి నాస్తిక వాదాలతో జైన బౌద్ధ వంటి అవైదిక నీతి వాదాలతో, ప్రాచీన విజ్ఞాన శాస్త్రంతో పరిపుష్టంగా ఉన్నప్పటికీ ఈ దేశంలో డార్విన్ సిద్ధాంతానికి వ్యతిరేకత ఉండటం చాలా వింతైన విషయం. ఒక సోషల్ పారడాక్స్.‌ ఇది ఈ మధ్య పెరుగుతుండటం కూడా కనిపిస్తుంది .దీనికి గల కారణం మన దేశం యేళ్ళ తరబడి విదేశీ వలస పాలనలో ఉండిపోవడంలో ఉంది. మనలో ఉన్న పోస్ట్ కలోనియల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది సైన్స్ ని మొత్తాన్ని Western origin గా చూడటం ఒక ప్రధానమైన కారణం. డార్విన్ అనేవాడు క్రిస్టియన్ థియాలజీని బద్దలు కొట్టి సైంటిఫిక్ ఆధారాలతో వివరించిన పరిణామ వాదం, భారతీయులకు కేవలం అది క్రిస్టియన్ సైన్స్ గానే అనిపించడం విడ్డూరం. ఈ మైండ్ సెట్ ఉన్నవారి దృష్టిలో డార్విన్ విదేశీ వాడు. క్రిస్టియన్. పైగా బ్రిటీష్ వాడు. కాబట్టి అతడు చెప్పిండేదానిని గుడ్డిగా వ్యతిరేకించవలసిందే అనే భావన. భారతీయులకు అది భారతీయుడు ప్రతిపాదించినది ఐవుంటే బహుశా ఇబ్బంది ఉండేది కాదేమో. డార్విన్ భారతీయుడు కాదు కాబట్టి దానిని ఖండిస్తూ మా వేదాల్లో ఇంతకుమించిన సైన్స్ ఉందని డిఫెన్సివ్ మోడ్ లో మాట్లాడటం మొదలుపెడతారు. వెస్టర్న్ కల్చర్ మీద ఉన్న వ్యతిరేకత అక్కడ అభివృద్ధి చెందిన సైన్స్ పట్ల కూడా మొదలు కావడం, భారతీయ ఆధ్యాత్మిక పుస్తకాల్లో నిగూఢంగా సైన్స్ ని దాచి ఉంచారనే నమ్మకాలు పెరగడం, భారతీయుల గ్రంధాల్లో వేదాలలో లేనిదంటూ ఏదీ లేదనే స్పృహ పెరగడమే కారణం తప్ప డార్విన్ థియరీని సైంటిఫిక్ గా ఎదుర్కొని దానిని తప్పని నిరూపించగలగాలనే భావన భారతీయులలో లేదు. క్లిష్టమైన సైంటిఫిక్ అంశాలకూ అవి లేవదీసే ప్రశ్నలకూ ప్రతిగా సులువైన సమాధానాలు చెప్పే మత సూక్తాలు భారతీయులకు అప్పీలింగ్ అనిపిస్తాయి. కర్మ, కర్మ ఫలితం, పునర్జన్మ, దైవ లీల వంటివి అన్ని ప్రశ్నలకూ సులువైన సమాధానాలు ఇచ్చేలా కనబడటం తో జీవ అస్తిత్వం, మనుగడకి సంబంధించిన లోతైన ప్రశ్నలు అడిగ వలసిన అవసరం దాదాపు లేకుండా పోయింది. అంతే కాకుండా మనదేశంలో మోడర్న్ విద్య దొరుకుతున్నప్పటికీ సైంటిఫిక్ కమ్యూనికేషన్ చాలా బలహీనంగా ఉండి పోవడం, కేవలం ఉద్యోగ సంపాదనే లక్ష్యంగా బట్టీ చదువులు రావడంతో డార్విన్ థియరీ నే కాక అన్ని రకాల సైంటిఫిక్ అవగాహనలు చాలా ప్రాథమిక దశలోనే విద్యావంతులలో ఉండిపోయాయి. 2001 సంవత్సరం లో అమెరికా లో చేసిన Gallup survey ప్రకారం 66% అమెరికన్లకు పరిణామ వాదమంటే ఏంటో తెలియదని అన్నారు. సైంటిఫికల్లీ అభివృద్ధి చెందిన దేశమనుకునే అమెరికాలోనే పరిస్థితి ఇలా ఉంటే సైన్స్ కమ్యూనికేషన్ లో దారుణంగా విఫలమైన మన భారతీయ సమాజం గురించి చెప్పనవసరం లేదు. మొత్తానికి డార్విన్ థియరీ పై వ్యతిరేకత ఉండటానికీ వెస్ట్ కి ఇండియాకి విభిన్నమైన కారణాలు ఉన్నాయనేది సుస్పష్టం. ఐతే సైన్స్ అంటే ఏమిటి?. ఒక విజ్ఞాన ఖనినా లేక ఆలోచనా విధానమా అనే స్పష్టత మనకు కావాలి‌. "Science is a way of thinking much more than it is a body of knowledge" అంటారు Carl Sagan. సైన్స్ ఖచ్చితంగా ఒక ఆలోచనా విధానం. ఈ ఆలోచనా విధానంలోకి జనసామాన్యాన్ని తీసికెళ్ళడానికి ఏం చేయాలన్నదే మనముందున్న అసలైన ప్రశ్న.


ఇలాంటి పరిస్థితుల్లోనే మత రాజకీయాలు పెరగడంతో డార్విన్ థియరీ మనుగడకి మరింత జటిలమైన పరిస్థితే ఇండియాలో నెలకొని ఉంది. అందుకే మొదట సైన్స్ కమ్యూనికేషన్ ని సరైన దిశలో తీసుకుని పోవడం, డార్విన్ థియరీని ఒప్పుకోని చదువుకున్న వ్యక్తులను గుర్తించడం, వారి మెంటల్ మేకప్ వెస్టర్న్ క్రియేషనిస్టులకంటే భిన్నమైనదనే అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని అప్పుడు మాత్రమే సైన్స్ కమ్యూనికేటర్ల ప్రయత్నాలు ఫలిస్తాయనీ నాకనిపిస్తుంది. అంతే కాకుండా లో డార్విన్ థియరీతో పాటు, evolution - creation లో మధ్య వెస్ట్ లో జరిగిన, జరుగుతున్న డిబేట్లలను కూడా స్కూలు, కాలేజీ సైన్స్ సిలబస్ లో చేర్చడం అవసరం. "నా జీవితంలో ఏ కోతి కూడా మనిషిగా మారడం నేను చూడలేదు. అలాంటప్పుడు డార్విన్ థియరీ ఎలా కరెక్ట్ అవుతుంది" అని ఈ మధ్య ఒక రాజకీయ నాయకుడు అనడం చూశాం. ఈ ప్రశ్న చాలా మంది అడుగుతుంటారు కూడా. ఐతే డార్విన్ థియరీ మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పదు. మనిషీ కోతీ ఒకే పూర్వ జంతువునుండి వచ్చారని చెబుతుంది. ఇది చాలా మందికి అర్థం కాకపోవడంతో మనిషి కోతి నుంచి వచ్చాడని డార్వినే చెప్పాడని వాదిస్తుంటారు‌. ఇలాంటివాళ్ళందరూ పరిణామం ఒక సరళ రేఖలా జరుగుతుందనే అపోహలో ఉంటారు. కానీ నిజానికి పరిణామం చెట్టు లాగా దాని వివిధ శాఖలు వృద్ధి చెందుతున్నట్లుగా జరుగుతూ ఉంటుంది. మన కుటుంబానికి చెందిన వంశవృక్షాన్ని తీసుకుని పరిణామవాదాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవచ్చు. మనకు ముత్తాత ఉంటే, ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు ఊహించండి – ఒకరు పెద్ద తాత, మరొకరు చిన్న తాత. ఇప్పుడు, పెద్ద తాతకు ఒక కుమారుడు, చిన్న తాతకు మరో కుమారుడు పుట్టారు. వీరిద్దరూ ఒకే ముత్తాతకు మనవళ్లు అయినా, ఒకరు ఇంకొకరుగా మారరు. అంటే చిన్న తాత కుమారుడు, పెద్ద తాత కుమారుడిగా పరిణామం చెందడం అసాధ్యం. వారు వేర్వేరు శాఖలు, కానీ మూలం ఒకటే – అదే ముత్తాత.


ఇదే సూత్రాన్ని మనిషి, కోతి మధ్య కూడ ఉపయోగించొచ్చు. మనిషి కోతి నుంచి వచ్చాడని అనుకోవడం తప్పు. నిజానికి, మనిషికీ, కోతికీ ఒకే సామాన్య పూర్వజంతువు ఉంది. ఆ పూర్వజంతువు నుంచే రెండు వేర్వేరు శాఖలు ఎదిగాయి – ఒకటి మనిషిగా, మరొకటి కోతులుగా. మనిషి కోతిగా మారలేదన్నదానికి ఇదే సరైన అర్థం.


పరిణామం సరళరేఖలా కొనసాగేది కాదు, అది ఒక వృక్షంలా విస్తరించేది. ఇది అర్థం కాకపోతే మనిషి కోతి నుండి వచ్చాడనే సరళ రేఖ సిద్ధాంతం వచ్చి కూర్చుంటుంది‌. వంశవృక్షాన్ని ఎలా చూసినా, పరిణామవృక్షాన్ని కూడా అలాగే అర్థం చేసుకోవాలి. ఒకే మూలం నుంచి అనేక శాఖలు పుట్టొచ్చు, కానీ ఒక శాఖ మరో శాఖగా మారదు. నాలుగు కాళ్ళ కోతి నుండి నాలుగు కాళ్ళ మనిషిగా అటునుండి రెండుకాళ్ళ మనిషిగా పరిణామం చెందిన primates యెక్క Progressive modification చిత్రాన్ని కూడా డార్విన్ థియరీ ఆఫ్ ఇవొల్యూషన్ గా చెబుతుండటం కూడా ఈ అపోహకి కారణం. పరిణామాన్ని వివరించేటప్పుడు branching of tree model ని విస్మరించకూడదు.


మరికొందరు డార్విన్ థియరీని సైంటిస్టులే తప్పని చెప్పేశారని వాదిస్తుంటారు. ఇటువంటి వారు వాట్సాప్ ఫార్వార్డ్ అంశాలను చదివి వస్తుంటారు. ఐతే శిలాజాల జ్ఞానం, జెనెటిక్స్ , ఆర్కియో జెనెటిక్స్ ,మాలిక్యులార్ బయాలజీ వంటి ఎన్నో ఆధునిక సైంటిఫిక్ ఆవిష్కరణలన్నీ డార్విన్ థియరీని పదే పదే నిరూపిస్తూ ఉంటాయన్నది తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. డార్విన్ నివసించిన కాలంలో శిలాజాల శాస్త్రం చాలా ప్రాథమిక దశలో ఉండింది. కానీ నేడు టెక్నాలజీ వలన మరింత అభివృద్ధి చెందింది. ఒక్క శిలాజ శాస్త్రం తప్ప పైన చెప్పిన మిగిలిన మూడు శాస్త్రాలు డార్విన్ కాలంలో లేవు. అవి తర్వాత వచ్చినవి. శిలాజ శాస్త్రం కూడా డార్విన్ కాలంలో ప్రాథమిక దశలోనే ఉంది. ఐనా అవన్నీ డార్విన్ సిద్ధాంతాన్ని ముక్త కంఠంతో బలపరుస్తున్నాయి. అంతేకాకుండా డార్విన్ థియరీని ఒకవేళ సైంటిస్ట్ లు తప్పని నిరూపించినంత మాత్రాన అది "జీవం పరిణామం చెందుతుంది" అనే సత్యాన్ని తుడిచిపెట్టదు. ఉదాహరణకు గ్రావిటేషన్ థియరీ తప్పు అని ఎవరైనా ఋజువు చేసినా పైకి విసిరేసిన రాయి కిందికే పడుతుంది తప్ప పైకి ఎగరదు. ఎందుకంటే జీవం పరిణామ చెందుతుంది అనేది సత్యమైతే ఆ పరిమాణం ఏవిధంగా జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానంగా డార్విన్ natural selection ద్వారా జీవం పరిణామం చెందుతుందని ప్రతిపాదించి నిరూపించాడు. అంటే జీవ పరిణామ వివరణకు డార్విన్ కి దేవునితో కానీ దేవుని సహాయంతో కానీ ఎలాంటి అవసరమూ పడలేదు. ఆధునిక విజ్ఞానం జీవ పరిణామ ప్రక్రియలలో natural selection కూడా ఒకటని గుర్తించింది. 


డార్వినిస్టులు ఎదుర్కొనే మరొక ముఖ్యమైన ప్రశ్న జీవ పరిణామం నేటికీ జరుగుతుందా?. మనిషి నేటికీ పరిణామం చెందుతున్నాడా?. అదే నిజమైతే మనకెందుకు కనబడదు అని. ఐతే ఈ వాదనలు చేసేవారే ఆధునిక జీవన శైలి వలన ఒబెసిటీ పెరుగుతుందనీ, గుండె జబ్బులు పెరుగుతున్నాయనీ, క్యాన్సర్లు పెరుగుతున్నాయనీ, షుగర్ జబ్బు పెరుగుతోందని వాపోతుంటారు‌. డార్విన్ ఫించెస్ నీ, మాత్ లోనూ ఉదాహరణగా చెబితే అదంతా అబద్ధం అనేస్తున్నారు కానీ, సెల్ఫోన్ వాడకం వలన చిన్న పిల్లల్లో కంటి సమస్యలు ఎక్కువయ్యాయని, మీడియా పెరగడం వలన ఆడపిల్లలు త్వరగా రజస్వల ఐపోతున్నారనీ వాపోతుంటారు. ఐతే వారు వాపోయేదంతా మానవ పరిణామంలో భాగాలేనని, జీవనశైలిలో మార్పులకు అనుగుణంగా శరీరం "అడాప్టివ్ ల్యాగ్" లో ఉండిపోతుందన్న విషయం వారు గ్రహించరు. అంతే కాకుండా బ్యాక్టీరియా వైరస్ లు పరిస్థితులకు అనుగుణంగా జన్యు మార్పిడి కి లోనై వాటిపై మందులు పనిచేయని విధంగా drug resistant గా తయారౌతాయన్నది వారికీ తెలుస్తుంది కానీ ఒప్పుకోరు. దీనిపై ఒక జోక్ కూడా ఉంది. టీబీతో బాధ పడే ఒక వ్యక్తిని మీరు క్రియేషనిష్టా అని అడుగుతాడు ఒక డాక్టర్. ఔను అని చెబుతాడు. ఐతే మీ థియరీ ప్రకారం టీబి బ్యాక్టీరియా, మీరూ భగవంతుని చేత ప్రస్తుతం ఉన్న రూపంలోనే సృష్టించబడ్డారు కనుక మీకు మామూలు మందులు ఇస్తాము. Multi drug resistant బ్యాక్టీరియా గా పరిణామం చెందిందన్న విషయాన్ని మీరు ఒప్పుకోరు కనుక మీకు multi drug resistant strains కి ఇచ్చే మందులు ఇవ్వము అంటాడు. ఇది జోకైనప్పటికీ మనం కంటి ముందు కనబడుతున్న జీవ పరిణామ సత్యం. కరోనా సమయంలో కూడా ఏ విధంగా వైరస్ పరిణామం చెందుతూ కొత్త strain లుగా పాండెమిక్ ని కలిగించిందో చూశాం. ఐతే జీవ జాతులు ఎన్ని ఉన్నాయో ఎంత విస్తృతంగా జీవావరణం తమ చుట్టూ పరుచుకుని ఉందో అణులేశ మాత్రం తెలుసుకోకుండా explore చేయకుండా కనీసం వాటిని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేకుండా కనీసం నేచురల్ జియోగ్రాఫిక్, డిస్కవరీ వంటి ఛానల్స్ కూడా చూడకుండా తమ కంటి ముందు పరిణామం కనిపిస్తే గానీ నమ్మము అనేవారికి నేటికీ జీవ పరిణామం జరుగుతుంది అని చెప్పాలనుకోవడం ఖచ్చితంగా వృథా ప్రయాసే అవుతుంది. కాబట్టి మొదట జీవశాస్త్రం ఎంత విస్తృతమైనదో వివిధ రకాల జీవులతో ఎంత వైవిధ్యంగా ఎన్ని అద్భుతాల తో నిండి ఉన్నదో ఎంత విరాట్ రూపంగా పరుచుకుని ఉన్నదో తెలిస్తే తప్ప జీవ పరిణామం అర్థం కాదు. అందుకే సైన్స్ విద్యార్థులకు సరైన రీతిలో డార్విన్ సిద్ధాంతాన్ని చెప్పే దిశగా ఆలోచించడం సైన్స్ ప్రమోటర్ల మొట్ట మొదటి బాధ్యత అవుతుంది. ఎవరైనా ఒక విద్యార్థి సైన్స్ ని మొదటి సబ్జెక్టుగా చదివి, ఆ తర్వాత డార్విన్ సిద్ధాంతాన్ని వదిలి వేసి క్రియేషనిస్టుల పాట అందుకుంటే, అది తప్పని సరిగా సైన్స్ బోధకుల, సైన్స్ ప్రమోటర్ల ఫెయిల్యూర్ గా గుర్తించక తప్పదు. అటువంటి విద్యార్థులను పర్సనల్ గా ట్రోల్ చేయడం వలన లాభం ఉండదు‌.

కాబట్టి సైన్స్ టీచర్లు, సైన్స్ ప్రమోటర్ లు ఈ దిశగా కృషి చేస్తారని ఆశిద్దాం.


డాక్టర్ విరించి విరివింటి 

13/2/2025

All Replies

New to Communities?

Join the community