"The public is never wrong. The only thing that matters is how they are right."
– Barbra Streisand
మన దేశంలో సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే ఐనప్పటికీ, ఆ వినోదం కోసం ప్రతి పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు ఎవరో ఒకరు ఆ తొక్కిసలాటలో చనిపోవడం, మనం దానిని సర్వ సాధారణ విషయంగా సీరియస్ గా తీసుకోకపోవడం చర్వణ చరితం గా మారింది. అసలు సరదాగా సినిమాకు వెళ్ళి ఎవరైనా ఎందుకు చనిపోవాలి? ఇది ఎందుకు మనకు సీరియస్ అంశం కావడం లేదు?. ఏమైనా సాహస యాత్రకు వెళ్ళి కొండలెక్కుతూ కాలు జారి పడిపోయి చనిపోయారా..?. సరదాగా సినిమాకు వెళ్ళొస్తాం అని వెళ్ళి ఒక తల్లి ఒక బిడ్డ మృత్యువాత పడటం మనకు సీరియస్ అంశం కాలేదంటే మనం మోస్తున్న విలువలను మనమే సీరియస్ గా ప్రశ్నించుకోవాల్సిన అంశం అని నాకనిపిస్తుంది.
టెక్నాలజీ వచ్చింది. ఆన్లైనై టికెట్ సిస్టం వచ్చింది. ముందే రిజర్వేషన్ తో మాత్రమే టికెట్లు కొనే స్థితి వచ్చింది. ఐనా ఎందుకు తొక్కిసలాట జరుగుతోంది. మన కంటే టెక్నికల్ గా కానీ మార్కెట్ పరంగా కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో కానీ పదుల రెట్లు ముందు ఉండే హాలివుడ్ లో ఎప్పుడూ ఒక సినిమా రిలీజ్ రోజున తొక్కిసలాట జరిగి ఒక సినిమా అభిమాని కానీ ఒక హీరో అభిమాని కానీ మరణించిన దాఖలాలు లేవు. మనకే ఎందుకు ఇలా?. ఎక్కడ లోపం ఉంది?
ఈ మధ్య మనం "ఎక్కువ మంది" "ఎక్కువ మార్కెట్" "ఎక్కువ రోజులు" "ఎక్కువ సంపాదన" వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అనిపిస్తుంది. ఈ అంశాలను ఆరాధిస్తున్నాం అనిపిస్తుంది. సినిమా విషయంలో కూడా ఇది ఇంతే. ఎక్కువ మంది చూడాలి. (ఏం చూడక పోతే ఏమౌతుంది?) వేల కోట్ల బిజినెస్ చేయాలి( ఏం చేయకపోతే ఏమౌతుంది?) ఇదంతా ఒకటైతే మొదటి రోజే మొదటి ఆట చూడాలి అనుకోవడం. ఎందుకు? తర్వాత ఒక సంవత్సరం తర్వాత సినిమా చూసి మెచ్చుకుంటే ఏమైనా నష్టమా?. అన్నీ వెనువెంటనే జరిగిపోవాలి. ఇదంతా మార్కెట్ అనే అంశం నడిపిస్తూ ఉంటే మనమంతా అందులో పావులం అనే అంశం గుర్తించుకోవాలి. ఒక సినిమాని ఎక్కువ మంది చూడకపోయినా పెద్దగా మార్కెట్ చేయలేకపోయినా మొదటి రోజు చూడకపోయినా ఏమీ కాదు. మంచి సినిమా అనేది ఎప్పటికీ ఉండే ఒక కళా విషయం. మొదట మనం అది అర్థం చేసుకోవాలి.
సినిమా వాళ్ళు crowd events చేయడం అందుకు పెద్ద ఉదాహరణ. ముహూర్తం ఫంక్షన్ నుండి మొదలౌతుంది. పోస్టర్ రిలిజ్ ఫంక్షన్, ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్, ఆడియొ రిలీజ్ ఫంక్షన్, ప్రొమో రిలీజ్ ఫంక్షన్, విలేఖరుల సమావేశం, బెనెఫిట్ షో..ఒక సినిమా రిలీజ్ కి ముందు ఆ సినిమా గురించి ఇన్ని రకాలుగా crowd events చేయడం ఏ హాలీవుడ్ సినిమాల విషయంలోనూ జరగదు. పైగా సినిమా రిలీజైన రోజే థియేటర్ కి సినిమా హీరో రావడం అనేది గతంలో ఏ హాలీవుడ్ హీరో చేసి ఉండడు?. మన దగ్గరే ఎందుకు?. దీనిలో ప్రేక్షకుల వ్యక్తి పూజ మాత్రమే కాదు, వారిని అంతగా ఊదరగొట్టే ఒక వ్యవస్థ చాలా planned గా నిర్మితమైంది. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఇద్దరు అకారణంగా ప్రాణాలు కోల్పోవడం మనకు చాలా చాలా చిన్న అంశంగా తోస్తుంది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయాక కూడా స్వచ్ఛందంగా ఈ వ్యవస్థను విమర్శించవలసిన ఆవశ్యకత ఉన్న సమయంలో కూడా మళ్ళీ సినిమా అద్భుతం ..నభూతో నభవిష్యతి అన్న చందంగా మనం సోషల్ మీడియా లో దాని చుట్టూతానే పోస్ట్ లు రాయడాన్ని మనకున్న వ్యక్తిగత విలువలను సినిమా సంస్కృతి అది నేర్పించిన మార్కెట్ విలువలు ఎలా పతనం చెందించాయో తెలుపుతుంది.
ఈ సంఘటనకు ఎవరు బాధ్యులు?. ఒక పెద్ద హీరో సినిమా రిలీజౌతున్న తరుణంలో వేల మంది గుమిగూడే అవకాశం ఉన్న చోట, థియేటర్ యాజమాన్యం పోలీసుల సహాయం తీసుకోలేదా?. సినిమా హీరో అదే రోజు సినిమా థియేటర్ కి రావాల్సిన అవసరం ఏముంది?. సినిమాను రిలీజ్ కి ముందర కొన్ని నెలల నుండి హైప్ చేశాక కూడా సినిమా నడవలేని పరిస్థితిలో ఏమీ లేదు కదా?. అలాంటప్పుడు తన రాక వలన సినిమా మార్కెట్ కి ఒనగూరే అదనపు సహాయం ఏమీ లేనప్పుడు ఎందుకు సినిమా హీరో థియేటర్ కి రావాలనుకుంటున్నాడు?. అతడి వ్యక్తిగత బాధ్యత ఏమైంది?. (ఇద్దరి మరణం తర్వాత తనవంతు ఆర్థిక సహాయం చేయడం స్వాగతించగల విషయమే. కానీ అతడు కొంత ఆలోచించి ఉండిఉంటే అసలు ఈ విషాదం జరిగేదే కాదు కదా). ఎందుకు తొక్కిసలాటలు జరిగే విధంగా థియేటర్లు నేటికీ ఉన్నాయి. అంతా online లో ముందే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉన్న తరుణంలో లైన్లో నిలబడి టికెట్ ఎందుకు కొనాలి?. పెద్ద సినిమా రిలీజైనప్పుడల్లా థియేటర్ యాజమాన్యం ఒక helpline number పెట్టి ఫోను ద్వారా టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం గురించి ఆలోచించవచ్చు.
ఫ్యాన్స్ అనబడే వారికి, సినిమా క్రిటిక్స్ కీ, రివ్యూవర్లకి సినిమా రిలీజ్ కంటే ముందే స్పెషల్ షోలు వేసి చూపించడం హాలీవుడ్ లో ఉంది. వాళ్ళ రేటింగ్స్ అనాలిసిస్ లు అప్పుడే మొదలవనీ..పోయేది ఏముంది?. సాధారణ జనాలు సినిమా రిలీజైయ్యాక కూల్ గా చూడనీ.. అర్జంట్ ఏమీ లేదు కదా!. సినిమా చుట్టూ సృష్టించబడిన మార్కెట్ బజ్ ని, ఎంటర్టైన్మెంట్ ని అడ్రెస్ చేయడానికి హాలివుడ్ మరో రకంగా డీల్ చేస్తుంది. అదే red carpet preview show. ఇది సినిమాయొక్క మొదటి official releasing event. దీనికి ఆ సినిమా నటీనటులు డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో పాటు పుర ప్రముఖులు, బ్లాగర్స్, క్రిటిక్స్ , ఫ్యాన్స్ అటెండ్ అవుతారు. ఫోటో సెషన్స్ , ఫ్యాన్స్ తో సెలెబ్రిటీల ఇంటెరాక్షన్స్ ఉంటాయి. ఇదంతా highly organised atmosphere లో లిమిటెడ్ members కి పాస్ లు ఇవ్వడం ద్వారా జరిగే ఈవెంట్స్. మాస్ ఈవెంట్స్ కావు. కానీ సినిమా ప్రమోషన్ కి red carpet preview బాగా ఉపయోగపడుతుంది. సినిమాను మార్కెట్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ విధానం సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలిగించని విధానం నేటికీ మనం కనుక్కోకపోవడం నేరం.
సోషల్ మీడియా లో పూనకాలు లోడింగ్ అనీ అర్జెంటుగా చూసేయాలనీ అనేంతగా రాయసగాళ్ళు రాయనవసరం లేదు అని నా అభిప్రాయం. సినిమా ఎప్పటికీ సినిమానే. ఒకసారి రిలీజ్ ఐనాక ఎప్పుడైనా చూడవచ్చు. ఈ రోజే చూడకపోతే ఏదో ఘోర అపరాధమో అన్యాయమో అనేంత హైప్ థింకర్స్ మి రైటర్స్ళమి అని అనుకుంటున్న వారు కూడా రాయడం విచిత్రం. సినిమాలు పబ్లిక్ డొమైన్ లో ఎప్పటికీ ఉంటాయి. మాయాబజార్ ఇప్పటికీ యూట్యూబ్ లో పెట్టుకుని చూడవచ్చు. మంచి సినిమా ఐతే ఎప్పటికీ నిలిచి ఉండే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మంచి సినిమా అనుకున్నది ప్రస్తుతం పరమ చెత్త సినిమాగా కూడా మనకు అనిపించవచ్చు. ఫ్యానిజం పేరుతో సినిమా మాకు ఉచిత ప్రమోషన్ ఇచ్చి రేటింగ్ ఇచ్చి ఎక్కువ మంది ని "చూడండి.. తప్పక చూడండి" లేకపోతే ఏదో ఐపోతుంది!! అని రాసేవారు ఎందుకు అలా రాస్తుంటారో నాకు అర్థం కాదు. సినిమా ప్రమోషన్ లో వారు కీలకపాత్ర పోషించాలనే అత్యుత్సాహం వారిలో ఎందుకు అంతలా ఉంటుందో కూడా తెలియదు. నా ఉద్దేశం లో ఇవన్నీ కొంత బాధ్యతతో ఆలోచించి సంయమనం పాటించ గలిగిన విషయాలు. సినిమా పై అభిప్రాయం చెప్పడం అనలైజ్ చేయడం తప్పేమీ కాదు. కానీ తొక్కిసలాటలు జరిగేంతగా పూనకాలు లోడింగ్ వంటి మాస్ అప్పీలింగ్ ప్రమోషన్స్ నుంచి ఈ రాసేవాళ్ళు తగ్గించుకుంటే మంచిది.
నిజానికి మనం ఎవరు తప్పు కాదు. మనం ఏవిధంగా కరెక్టో తెలుసుకోవడం ముఖ్యం.
విరించి విరివింటి