Human with Camera.
ఒకసారి ఒక పుస్తకం ఓపెనింగ్ కి వక్త గా వెళ్ళాను. ఆ పుస్తకం పై ప్రముఖులంతా లోతుగా మాట్లాడారు. చివరిగా నేను మాట్లాడటం మొదలుపెట్టాను. ప్రసంగం కొంత ఊపుమీద ఉన్న సమయంలో ఆ ప్రోగ్రాం కి చీఫ్ గెస్ట్ గా పిలువబడిన వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. లేట్ గా ఎంట్రీ ఇచ్చాడంటే అంటే మీకు అర్థం ఐవుండింటుంది. అతడొక సెలబ్రిటీ అని . అతడి రాకకంటే నా ప్రసంగం ఏమంత exciting కాదనే ఉద్దేశంతో కాసేపు ఆపివేయబడింది. స్టేజీ మీద ఉన్న సభాధ్యక్షులు కూడా "ఏహే.. కాసేపు నీ బోడి ప్రసంగం ఆపేసెయ్! వచ్చిండేది సెలెబ్రిటీ మరి!" అని నాతో అస్సలు అనలేదు. కానీ అనకుండా అచ్చం అలాగే ప్రవర్తించారు. దాదాపు అందరూ అతడు రాగానే ఈ సభకు వచ్చినందుకు ఒక సార్థకత వచ్చినట్లు ఫీలయ్యారు. వెనుక సీట్లో కూర్చుని (ఈ ప్రోగ్రాం ఏంటో అసలెందుకు ఇక్కడికి వచ్చామో కూడా తెలియనట్టుగా) టీ లు తాగేందుకు మాత్రమే వచ్చిన ఫోటోగ్రాఫర్ లేచి టకా టకా ఆయనవి పది పన్నెండు ఫోటోలు క్లిక్ మనిపించాడు. ఇదంతా ఆబ్జెక్టివ్ రియాలిటీ. ప్రోగ్రాం ఐపోయాక చాలా మంది ప్రముఖులు ఆయనతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఆయన ఒక మెరుపుతీగ వలె ఉండిన్నాడు. అతడి జ్ఞానం కంటే అతడి బిజీ నే ఎక్కువగా పోజు కొట్టింది. ఎక్కువ గర్వించింది. ఆయన హడావుడిగా వెళ్ళిపోయాక ప్రోగ్రాం ఐపోయాక మిగిలిన వారందరూ ఒకరికొకరు ఫోటోలకు పోజులిచ్చుకున్నారు. సెల్ఫీలు దిగారు. చేతుల్లో చేతులు వేసి ఫోటో పండుగ చేసుకున్నారు. "అసలు పండుగ" ఫోటోలు తీసుకోవడంలా అనిపించింది. పుస్తకం ఓపెనింగ్ ఒక బహానా అంతే!.
మానవుడు కనుక్కున్న ప్రతీ కొత్త సాధనం మనిషికి కొత్త consciousness ని అందిస్తుంది. లీవెన్ హాక్ మైక్రోస్కోప్ కనుక్కోకముందు అసలు సూక్ష్మాతి సూక్ష్మమైన కంటికి కనిపించని ప్రపంచం ఒకటుంటుందని మనిషికి తెలియదు. అప్పటిదాకా బైబిలులో చెప్పిన పర లోకం గురించే తెలుసు. కానీ ఈ సూక్ష్మ లోకం ఏంటి! అనేది ఎవరికీ తెలియదు. బైబిలు తప్ప మరే పుస్తకాలు చదవని లీవెన్ హాక్ బైబిల్ లో సర్వం చెప్పారు అన్నారు కానీ ఈ సూక్ష్మ లోకం గురించి చెప్పనే లేదు అని వాపోయేవాడంట. అలాగే గడియారం కనుక్కున్న తర్వాతే మనిషి ఎన్ని గంటలు పని చేయాలనే ప్రశ్న ఉదయించింది. ఇచ్చిన పని పూర్తయ్యే వరకు చేస్తూ పోవడం మాత్రమే ఉండింది అంతకుముందు. అది కాస్తా మారింది. ఇచ్చిన పని అయిపోయినా కాకపోయినా రోజుకు ఎంత సేపు పని చేయాలో చేసేశా కదా అనే స్పృహ వచ్చింది. అలాగే తుపాకీ. మనుషులను జంతువులను చంపడం ద్వారా చంపుతామని బెదిరించడం ద్వారా సులువుగా కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు. ఐతే తుపాకీ స్థానాన్ని కెమెరా భర్తీ చేసింది అంటుంది సుసాన్ సొంటాగ్ అనే రచయిత్రి , ఫోటోగ్రాఫర్. తుపాకీ దారుణంగా మర్డర్ చేస్తుంది. కెమెరా మెల్లిగా మర్డర్ చేస్తుంది. ఒక అడవిలో వేటగాళ్ళు తుపాకులు పట్టుకుని అడవిలోకి వెళుతున్నారు అంటే అక్కడ క్రూరమృగాలు భద్రంగా ఉన్నట్లు. కానీ ఎప్పుడైతే తుపాకులు వదిలివేసిన వేటగాళ్ళు జంతు ప్రేమికులుగా మారి కెమెరాలతో వెళ్తున్నారో అడవిలో మానవ సంచారం మొదలైనట్టు. అడవిని నాశనం చేస్తున్నట్టు. అని అంటారావిడ. ఎందుకంటే జంతుప్రేమికులకోసం సందర్శకుల కోసం అనుకూలంగా క్రూరమృగాలకు చెందిన అడవి జైలులా మార్చబడింది. అడవిలోకి ప్యాకెట్లు వాటర్ బాటిళ్ళు వచ్చేస్తుంటాయి. ఇలా కెమెరా సాఫ్ట్ గా కొద్దికొద్దిగా అడవిని చంపేస్తుంది. అందులో క్రూరమృగాలు కూడా చచ్చిపోతాయి. పులులు సింహాలు వేటాడబడే కాలంలో కొంత నైనా ప్రకృతి సేఫ్ గా ఉన్నట్లు కానీ కెమెరాలతో వెంబడిస్తూ ఉన్నా మెంటే ఆ అడవి ధ్వంసం అవుతున్నట్టు ప్రకృతి ధ్వంసం అవుతున్నట్టు..
ఫోటోగ్రఫీ ఒక ఆర్ట్ గా ఉండింది. కొందరు ఔత్సాహికులు కెమెరా మెడకు వేసుకుని తిరిగే వాళ్ళు. కొత్తగా వింతగా అనిపించిన ప్రతీ దాన్ని క్లిక్ మనిపించేవారు. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చాక అందులో రకరకాల instant photo editing softwares apps వచ్చేశాడు professional vs amateur ఫోటోగ్రాఫర్ల మధ్యన అంతరం తగ్గిపోయింది. ఇపుడు అందరమూ ఫోటోగ్రాఫర్లమే. కొనుక్కున్న కెమెరాలో మంచి పిక్సెల్ రిజొల్యూషన్ కల కెమెరా ఉంటే చాలు. ప్రతి సంఘటన లైవ్ కాస్ట్ చేసుకోవడానికి యూట్యూబ్ ఫేస్బుక్ వంటివి ఉండనే ఉన్నాయి. పైగా AI రావడంతో తీసిన ఫోటోగ్రాఫ్ లోని వ్యక్తుల ఫేస్ లు అందంగా మార్చేయవచ్చు, బట్టలు తొలగించవచ్చు, వాళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నట్టు చేయవచ్చు. అసలు వ్యక్తినే మార్చేయవచ్చు. ఫోటోగ్రాఫ్ ఒక ఫిక్షన్ ని తయారు చేస్తుంది. జీవితాన్ని అందులోని సంఘటనలనూ fictionise చేస్తుంది. ఫోటోగ్రాఫ్ లతో సోషల్ మీడియా లో తమకు సంబంధించిన జీవితాన్ని ఎలా ఫిక్షనైజ్ చేయాలో తెలియాలి. We have many fictional characters around created by their photographs and selfies.
Photography కనుక్కున్న మొదట్లో అది ఒక కళ లాగా రాలేదు. ఎప్పుడైతే industrialization జరిగి కెమెరాలు ఉత్పత్తి కావడం మొదలైందో అప్పుడే ఫోటోగ్రఫీని ఒకకాళలాగా అభివృద్ధి చేశారు. అది వ్యాపార అవసరం. ఐతే ఇప్పుడది కళ కాదు. ఒక రిచువల్. OCD లాగా ఒక అర్థంలేని compulsion. అనుభవం ఇమేజ్ గా వీడియోగా మారడం. ప్రతీ అనుభవాన్నీ మనసులో దాచుకోవడం పోయి ఆబ్జెక్టిఫై అవడం. పోర్నో సైట్లలో చూస్తే ఎంతోమంది కెమెరాలతో తమ పర్సనల్ స్పేస్ లను ఎందుకు కెమెరా ల్లోకి ఎక్కించుకుంటున్నారో అర్థం కాదు. పల్లెటూరి పిల్లలు బట్టలు మార్చుకోవడం కూడా కెమెరాల్లో పెట్టుకోవడం అది పోర్నో సైట్లలో ప్రత్యక్షం కావడం. సోషల్ మీడియాలో పెట్టుకున్న స్త్రీ ల ఫోటోలు ఇటువంటి సైట్లలో ప్రత్యక్షం కావడం. చివరికి సిసికెమెరాల రూపంలో పనితీరును మానిటర్ చేయడం (power structure) అదే సీసీ కెమెరా లతో బాత్రూంలలో అమ్మాయిల మూత్ర విసర్జన వంటి పర్సనల్ విషయాలను capture చేయడం. కెమెరా స్త్రీ ని, హ్యూమన్ పర్సనల్ స్పేస్ ని, ఇంటిమసిని ఎంతటి ఆబ్జెఫికేషన్ కి గురిచేసిందో చూడండి. కెమెరా తీసిన ఏదైనా ఫోటోగ్రాఫ్ ఈ ప్రపంచం యొక్క ఆబ్జెక్టివ్ రియాలిటీ ని పట్టి ఇచ్చే సాధనం. కానీ రాను రాను ఫోటోగ్రఫీ ఆబ్జెక్టిఫికేషన్ కి సాధనంగా మారిపోయింది. ఐతే ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అదంతా ఐపోయాక "ఒక ఫోటో ప్లీజ్" అనే వారు ఉంటారు. People are vulnerable to being photographed. ఫోటొ తీసుకోవాలనే ఉద్దేశం కానీ ఆసక్తిగానీ లేకున్నా సెల్ఫీలో టకీమని తీసేస్తారు. ఆ మధ్య నేను ఇలా ఒక ప్రయోగం చేశాను. అప్పుడే పరిచయమైన వ్యక్తితో మొదటిసారి మాట్లాడి కాసేపాగి సెల్ఫీ తీసుకుందామా? అని అడిగితే తలదువ్వుకుని వెంటనే రెడీ అయిపోయాడు. ఎందుకు ? అవసరమా ? వంటి సందేహాలు రాలేదు. ఎందుకింత వల్నరబుల్ గా ఉన్నారో అర్థం కాలేదు. ఫోటో తీయడానికి ఉత్సాహం, తీయబడటానికి వల్నరబిలిటీ రెండూ ఉన్నాయి. ఫోటో తీశాక కనీసం ఈ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టవచ్చా అని ఎవరూ అడగటం నాకు కనబడలేదు. నాకు తెలియకుండా నా ఫోటో ఒకటి తీసుకుని దానిని అప్పట్లో ఒక మిత్రుడు ఫేస్బుక్ లో పెట్టాడు. అందులో అస్సలు బాగాలేను నేను. కానీ అది నా పర్మిషన్ లేకుండా ఫోటో తీయడమే కాకుండా దానిని సోషల్ మీడియాలో display చేయడం. నన్ను నేను పలువురి ముందు మంచిగా ప్రెజెంట్ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ అనుకోకుండా నా ప్రమేయదీ లేకుండా నా ప్రెజెంటేషన్ మరోవిధంగా తయారైతే?. ఒకసారి ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ మారిస్తే ఒక డాక్టర్ నా లుక్ గురించి బాడీ షేమింగ్ మాట కూడా పబ్లిక్ గా కామెంట్ చేశాడు. దానికి లాఫ్ గుర్తులు బాగా వచ్చాయి. ఇదంతా objectification. నిజానికి ఆ ఫోటోలో కనబడే వ్యక్తిని మాత్రమే కాదు నేను. ఒకవేళ మనం ఆ కామెంట్స్ కి హర్ట్ ఐతే అందులో కనిపించేదే అన్నాం.. అంటే తప్పేంటి..ఉన్నది ఉన్నట్లుగా accept చేసేయాలి.. వంటి ఎన్నో మోరల్ పోలిసింగ్ మాటలు వెనువెంటనే వచ్చేస్తాయి. చూడండి ఇదంతా ఒక వ్యక్తిని ఆబ్జెక్టిఫై చేసిన ఆ వల్నరబిలిటీని పెంచిన ఒక ఫోటో గురించి మాట్లాడుతున్నాను. ఇందులో 'నేను' సర్వనామం. ఇటువంటివి మీకందరికీ అనుభవంలోకే వచ్చి ఉంటాయి.
To photograph people is to violate them. By seeing them as they never see themselves by having knowledge of them they can never have. It turns people into objects. అంటుంది సుసాన్ సొంటాగ్.
జర్నలిస్టులు ఫోటోలు తీసి ప్రపంచం యొక్క objective రియాలిటీని పట్టి ఇస్తుంటారు. కానీ కెవిన్ కార్టర్ ఈ ఆబ్జెక్టివ్ రియాలిటీని పట్టి ఇచ్చే ఉత్సాహంలో తాను ఒక మనిషినని మరచిపోయాడు. శరణార్థి శిబిరంవద్ద ఆకలితో దొగ్గాడే ఒక చిన్నారిని గ్రద్ద పొడుచుకు తింటుంటే గ్రద్ద ను అదిలించి ప్రాణం కాపాడాల్సింది పోయి ఫోటోలు తీశాడు. ఈ మధ్య ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. కంటి ముందు ఒక వ్యక్తి కాలిపోతుంటే మంటలు ఆర్పాల్సిందిపోయి వీడియో తీసిన ఒక హృదయ విదారక సంఘటన ఈమధ్యే మనం చూశాం. కెమెరా మనిషిలో మానవత్వాన్ని చంపేసింది. వ్యక్తులను వ్యక్తులుగా కాకుండా objects గా తయారు చేసింది. మెడికల్ క్యాంపులు చేసి తమ గొప్పల కోసం పేషెంట్ల ఫోటోలు యథాతథంగా షేర్ చేసే ప్రబుద్ధ డాక్టర్లు ఎందరో. యుద్ధం, యుద్ధం యొక్క బీభత్సం ప్రపంచానికి చూపడం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఫోటోగ్రాఫర్లు ఎందరో...మనం యుద్ధానికి సంబంధించిన ఫోటోలు ఎన్నో చూసి ఉంటాం. వియత్నాం యుద్ధంలో శరీరంపై నూలుపోగు లేకుండా ఏడుస్తున్న చిన్నారి ఫోటో చూశాం. శరణార్థిలాగా నౌకలో వెళ్తూ సముద్రంలో మునిగి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన 'అలాన్ కుర్దీ' ఫోటో చూశాం. ఎంతో బాధపడ్డాం. ఏడ్చాం. కానీ అవేవైనా యుద్ధాల్ని ఆపాయా?. ఆపలేకపోయాయి. ఏ యుద్ధ బీభతైసాన్నైతే మనం ప్రత్యక్షంగా చూడనేలేమో అదంతా ఫోటోలలో బంధించి.."చూడండయ్యా ఈ యుద్ధం చేసే మారణహోమం" అని అరిచి గీపెట్టినా యుద్ధాలు ఏవీ ఈ ప్రపంచంలో ఆగనేలేదు. మరి ఈ ప్రపంచంలో కెమెరా సాధించిన గొప్ప ఘనత ఏమి? ఎవరికి వారిమి మేము గొప్ప ఫోటోగ్రాఫర్లమని తీసిన ఫోటోలను ప్రదర్శించుకోవడానికి తప్ప కెమెరా తీసుకొచ్చిన గొప్ప మార్పు ఏమిటి?. పునరాలోచించక తప్పదు.
విరించి విరివింటి